Mushroom: పుట్ట గొడుగులు కాదు బంగారం - ఈ కశ్మిరీ మష్రూమ్స్ కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలి
ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మష్రూం. కేవలం జమ్ము కశ్మిర్‌లో మాత్రమే లభిస్తుంది. మరి దీని ప్రత్యేకతలు ఏమిటో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మష్రూంగా పిలువబడే, గుచ్చి పుట్టగొడుగు హిమాలయ పర్వతాలలో విరివిగా లభిస్తుంది. ఈ ప్రాంతాల్లో లభించే ఈ అరుదైన పుట్టగొడుగును విక్రయించడం ద్వారా స్థానికులు భారీగా డబ్బును సంపాదిస్తున్నారు. భారత్‌లో దీని ధర కిలో రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటుంది. అద్భుతమైన రుచికి ప్రసిద్ధి చెందిన గుచ్చి పుట్టగొడుగులు భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ పర్వత ప్రాంతాలలో సహజంగా పెరుగుతుంది.
పర్వతాలలో నివసించే ప్రజలు ఎత్తైన కొండల్లో ఎంతో రిస్క్ చేసి మరీ ఈ పుట్టగొడుగులను సేకరిస్తారు. అందుకే, ఇది ప్రపంచ ‘మెను’లో లగ్జరీ ఐటెమ్‌గా అమ్ముడవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ పుట్టగొడుగులను ఇష్టంగా తింటారట. భారత్‌తో పాటు అమెరికా, యూరప్, ఇటలీ సహా పలు దేశాల్లో దీనికి మంచి డిమాండ్ ఉంది.
వ్యవసాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, గుచ్చి మష్రూం సముద్ర మట్టానికి 1500 నుంచి 3500 మీటర్ల ఎత్తులో కనిపిస్తుంది. దీని కోసం, 14 నుండి 17 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. పుట్టగొడుగులు తేమ పరిస్థితులు ఉండే అడవులలో ఎక్కువగా పెరుగుతాయి.
గుచ్చి మష్రూంలను సేకరించేందుకు స్థానికులు గుంపులుగా ఎత్తైన ప్రాంతాలకు వెళతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గుచ్చి మష్రూంల కోసం అన్వేషిస్తారు. కొన్నిసార్లు వీరు ఖాళీ చేతులతో తిరిగి రావాల్సి ఉంటుంది. ఈ పుట్టుగొడుగులను సేకరించేందుకు ప్రమాదకరమైన మార్గాల ద్వారా ఎత్తైన పర్వతాలను అధిరోహిస్తారు. ఈ సేకరణ సందర్భంగా తీవ్ర గాయాలు అయ్యే ప్రమాదం కూడా ఉంది. సేకరణ సమయంలో అడవి జంతువుల నుండి కూడా ప్రమాదం ఉంది..
విటమిన్ డి కోసం గుచ్చి పుట్టగొడుగు ఎందుకు ప్రత్యేకమైనది?
ప్రపంచంలో విటమిన్ D ఉన్న ఏకైక కూరగాయ ఇదే కావడం విశేషం. గుచ్చి పుట్టగొడుగు సాగు చేయడం అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. గతంలో కూడా గుచ్చి మష్రూమ్‌ను రాచరిక ఆహారంగా పిలిచేవారు. రాజులకు, చక్రవర్తులకు ఈ కొండ ప్రాంతాల ప్రజలు అరుదైన కానుకగా గుచ్చి పుట్టగొడుగులు ఇచ్చేవారు. పైగా బ్రిటీష్ వారికి కూడా ఇదంటే పిచ్చి.
మగ, ఆడ గుచీ కలిసే పెరుగుతాయట
భారతీయ వ్యవసాయ పరిశోధన విభాగం సోలన్‌లో ఖుంబా పుట్టగొడుగుల పరిశోధనా కేంద్రాన్ని నిర్వహిస్తోంది. ఇక్కడి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ అనిల్ కుమార్ 2019 నుంచి గుచ్చి పుట్టగొడుగులపై పరిశోధనలు చేస్తున్నారు. సహజంగా పెరిగే ఈ పుట్టగొడుగుల సాగును నియంత్రిత పద్ధతులలో పెంచవచ్చని ఆయన తెలిపారు.. అయితే ఇందులో కొంత వరకు మాత్రమే విజయం సాధించగలిగారు. ఈ పుట్టగొడుగులు ఎక్కువగా జంటలుగా పెరుగుతాయి. కొన్నిపుట్టగొడుగులు ఒంటరిగా కనిపిస్తాయి. ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ పుట్టగొడుగులను అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున విక్రయించేందుకు పలు చర్యలు తీసుకుంటుంది అంతేకాదు స్థానికులను ఈ పుట్టగొడుగుల సాగులో సరైన విలువ లభించేలా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. మీకు కూడా విటమిన్-డి సమస్యలు ఉన్నట్లయితే తప్పకుండా వీటిని తినండి.
Also Read : సీజనల్ వ్యాధులు దరిచేరకూడదంటే ఇవి తినాలి.. ఎందుకంటే?