Cat Saves Owners Life: యజమానికి గుండెపోటు - ప్రాణాలు కాపాడిన పిల్లి, ఇదిగో ఇలా చేసింది!
గుండెపోటు వచ్చిన తన యజమానిని కాపాడేందుకు ఓ పిల్లి చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిల్లి చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు..
ప్రస్తుత కాలంలో చాలా మంది పిల్లులు, కుక్కలతో పాటు పక్షులను పెంచుకుంటున్నారు. కొంత మంది మనుషుల కంటే పెంపుడు జంతువులనే ఎక్కువ ప్రేమగా చూసుకుంటున్నారు. అవి కూడా తమ యజమానులతో మంచి అనుబంధాన్ని ఏర్పర్చుకుంటున్నాయి. ఒక్కోసారి ఆయా పెంపుడు జంతువులు యజమానులపై చూపించే ప్రేమ, విశ్వాసం ఎంతో ఆశ్యర్యాన్ని కలిగిస్తుంది. తమ యజమానులు ప్రమాదంలో ఉన్నారని గ్రహించి.. ఆపద నుంచి వారిని కాపాడేందుకు చేసే ప్రయత్నాలు చూస్తే మతిపోతుంది. పెంపుడు జంతువులు చేసే అలాంటి అరుదైన చర్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మీకు తెలిసిందే.
తాజాగా ఓ పిల్లి కూడా ఇలాంటి పనే చేసింది. తన యజమానికి ప్రాణాలను కాపాడేందుకు చేసిన ప్రయత్నం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గుండెపోటుతో విలవిలాడుతున్న తన ఓనర్ ను చూసి.. వెంటనే తన పాదాలతో ఛాతి మీద కొట్టడం మొదలు పెట్టింది. ప్రాణం పోకుండా కాపాడింది. పిల్లి ప్రయత్నాన్ని చూసి నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఇంగ్లాండ్‌లోని నాటింగ్ హామ్ కు చెందిన సామ్ ఫెల్ స్టెడ్ అనే 42 ఏండ్ల మహిళ.. బిల్లీ అనే పిల్లిని పెంచుకుంటుంది. ఏడేళ్ల వయసున్న బిల్లీ.. ఎప్పుడూ సామ్ చుట్టూనే తిరుగుతుండేది. ఏనాడు తనను ఇబ్బంది కలిగించేది కాదు. పెట్టినప్పుడు తిని హాయిగా నిద్రపోయేది. సామ్ సైతం ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచేందుకు అలారం పెట్టుకునేది. తాజాగా అలారం మోగడానికి రెండు గంటల ముందే బిల్లీ తనను లేపినట్లు చెప్పింది. ఆ సమయంలో తన బాడీని కదిలించలేక ఇబ్బంది పడినట్లు చెప్పింది. అంతేకాదు.. తన ఛాతి భాగంలో విపరీతమైన నొప్పి ఉన్నట్లు చెప్పింది. ఒళ్లంతా చెమటలు పట్టినట్లు వెల్లడించింది. ఆ సమయంలో బిల్లీ తన ఛాతి మీద ఉన్నట్లు చెప్పింది. అంతేకాదు.. చెవి దగ్గర గట్టిగా అరవడం మొదలుపెట్టినట్లు తెలిపింది. అంతకు ముందు బిల్లీ ఎప్పుడూ అలా చేయలేదని సామ్ చెప్పింది.
బిల్లీ తనను నిద్ర లేపడంతో నెమ్మదిగా వైద్యులకు సమాచారం అందించినట్లు సామ్ తెలిపింది. తర్వాత ఆమెను నాటింగ్‌హామ్ సిటీ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు నిద్రలో గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు. అప్పుడు తను షాక్ అయినట్లు చెప్పింది. తను పడుకునే ముందు బాగానే ఉన్నట్లు వెల్లడించింది. అంతకు ముందు ఎప్పుడూ అనారోగ్యం కలగలేదని.. కనీసం నొప్పులు కూడా లేవని వెల్లడించింది. బిల్లీ తన ప్రాణాలను కాపాడిందని సామ్ సంతోషం వ్యక్తం చేసింది. ఒకవేళ బిల్లీ లేకుంటే తాను ప్రాణాలతో ఉండేదాన్ని కాదేమోనని అభిప్రాయపడింది. ఈ విషయాన్ని తన తల్లికి చెప్తే చాలా ఆశ్చర్యపోయినట్లు వెల్లడించింది.
సామ్ ధమనులు మూసుకుపోవడం మూలంగానే గుండెపోటు వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. మూడు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత తను ఇంటికి చేరుకుంది. బిల్లీ మాత్రం గతంలో మాదిరిగానే ఏమీ పట్టనట్లు ఉందని సామ్ తెలిపింది. తన ప్రాణాలను కాపాడిన బిల్లి మీద ఇంకొంచెం ఎక్కువ ప్రేమను చూపించేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించింది.
Also read: ఈ బిర్యానీ చాలా స్పెషల్, రైస్ అవసరం లేదు, జీవితంలో ఒక్కసారైన రుచి చూడాల్సిందే