డయాబెటిస్ బాధితుల మాటలు ముద్దగా మరిపోతాయా? కారణాలేమిటీ?
రక్తంలో గ్లూకోజ్ పెరిగినా, తగ్గినా ప్రమాదమే. గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతే నేరుగా మెదడు పనితీరు మీద ప్రభావం ఉంటుంది. దీని గురించి ఇక్కడ తెలుసుకుందాం.
డయాబెటీస్ రక్తంలో అధికంగా గ్లూకోజ్ చేరే ప్రమాదకరమైన వ్యాధి. ఇలా రక్తంలో షుగర్ పెరిగితే శరీరంలోని ప్రతి అవయవయం మీద దుష్ప్రభావం ఉంటుంది. చికిత్స తీసుకోకపోతే, షుగర్ లెవెల్స్ అదుపులో పెట్టుకోకపోతే మరణానికి దారితీస్తుంది. మరి రక్తోంలో షుగర్ స్థాయి తగ్గితే? అది మరింత ప్రమాదకరమని నిపుణలు జాగ్రత్తలు చెబుతున్నారు.
రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గినపుడు ఏర్పడే స్థితిని హైపోగ్లైసీమియా అంటారు. లో షుగర్ గా వ్యవహరిస్తారు. ఇలా రక్తంలో షుగర్ లెవల్స్ పడిపోతే వణుకు, చమటలు పట్టడం, గందరగోళం ఏర్పడడం, స్పృహ కోల్పోవడం లాంటి లక్షణాలు ఏర్పడుతాయి. వీటితో పాటు హైపోగ్లైసీమియాలో అత్యంత సాధారణంగా కనిపించే లక్షణం మాటలో స్పష్టత లోపించడం కూడా. తీవ్రమైన హైపోగ్లైసీమియాలో గందరగోళం, దృష్టి మందగించడం, తిమ్మిరిగా అనిపించడం, జలదిరింపు కలగడం వంటి న్యూరాలాజికల్ లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఒక్కోసారి కోమాలోకి కూడా వెళ్లవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మెదడుకు శక్తి అందాలంటే క్రమం తప్పకుండా గ్లూకోజ్ అందాలి. రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ బాగా తగ్గినపుడు మెదడు పనితీరు మందగిస్తుంది. అందువల్ల గందరగోళం ఏర్పడడం, దృష్టి సరిగా లేకపోవడం, మాటలో స్పష్టత లోపించడం (ముద్దగా మాట్లాడటం లేదా పదాలను కష్టంగా పలకడం) వంటి లక్షనాలు కనిపిస్తాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గడం కొనసాగితే, చికిత్స అందక పోతే రోగి కోమాలోకి కూడా వెళ్లవచ్చు, ప్రాణాపాయం కూడా కలుగవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మెదడుకు గ్లూకోజే ఇంధనం. గ్లూకోజ్ సంశ్లషణ కూడా మెదుడు చెయ్యలేదు. అంతేకాదు కొన్ని నిమిషాలకు మించి గ్లూకోజ్ సరఫరాను నిలువ చేసుకోలేదు. కనుక నిరంతరాయంగా మెదడుకు గ్లూకోజ్ సరఫరా అవవసరముంటుంది. రక్తంలో తగ్గిన గ్లూకోజ్ ప్రభావం మెదడు పనితీరు మీద నేరుగా ఉంటుంది. అందువల్ల మాటలో స్పష్టత లోపిస్తుంది.
హైపోగ్లైసీమీయా ఎందుకవుతుంది?
చాలా కారణాలతో హైపోగ్లైసీమియా అవుతుంది. వాటిలో ముఖ్యమైంది డయాబెటీస్ కి ఉపయోగించే ట్యాబ్లెట్లు, ఇన్సులిన్ వంటివి, సప్సిస్, లివర్ డిసీజ్, కిడ్నీ డిసీజ్, ఆల్కహాల్, ట్యూమర్స్, కార్టిసాల్ హార్మోన్ లోపం వల్ల హైపోగ్లైసీమియా అవుతుంది.
ఈ పరిస్థితుల్లో శరీరంలో ఇన్సులిన్ స్థాయి పెరిగిపోవడం వల్ల లేదా శరీరంలో గ్లూకోజ్ వినియోగం పెరగడం వల్ల శరీరంలో హైపోగ్లైసిమిక్ కండీషన్ ఏర్పడుతుంది.
డయాబెటిక్స్ ఈ సూచనలు పాటించి హైపోగ్లైసీమియా ఏర్పడకుండా జాగ్రత్త పడవచ్చు.
- ఒకే సారి కడుపు నిండా భోంచేసి ఊరుకోవడం కాకుండా, తక్కువ తక్కువగా రెండు మూడు సార్లు తినడం అలవాటు చేసుకోవాలి.
- రక్తంలో చెక్కెర స్థాయిని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి.
- ఉపవాసాలు చెయ్యడం, భోజనం మానెయ్యడం వంటి వాటికి దూరంగా ఉండాలి.
- క్రమం తప్పకుండా వ్యాయమం చెయ్యాలి.
- ఆల్కహాల్ పరిమితంగా తీసుకోవాలి.
- గ్లూకోజ్ బిళ్లలు, చాక్లెట్, క్యాండీల వంటివి వెంట ఉంచుకోవాలి. లక్షణాలు కనిపిస్తే వెంటనే వాటిని తీసుకోవడం వల్ల నేరుగా గ్లూకోజ్ రక్తంలో చేరుతుంది.
హైపోగ్లైసీమియా తరచుగా ఎదుర్కొనే వారు 15-15 అనే రూల్ ఫాలో చెయ్యాలని నిపుణులు సూచిస్తున్నారు. అంటే 15 గ్రాముల కార్బోహైడ్రేట్ తీసుకున్న తర్వాత 15 నిమిషాలు వేచి ఉండి షుగర్ టెస్ట్ చెయ్యాలి. అప్పటికీ 70 mg/dL కంటే తక్కువ ఉండే మరో 15 గ్రాములు తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
Also Read: సమంతను కాపాడుతున్న డైట్ ఇదే - ఇలా తింటే అందం, ఆరోగ్యం మీ సొంతం