(Source: ECI/ABP News/ABP Majha)
Chalapati Rao Death: టాలీవుడ్‌లో మరో విషాదం! నటుడు చలపతి రావు కన్నుమూత
1944 మే 8న క్రిష్ణా జిల్లా బల్లిపర్రులో చలపతి రావు జన్మించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా చలపతి రావు పని చేశారు.
టాలీవుడ్ లో మరో విషాదం జరిగింది. నటుడు చలపతి రావు కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు తమ్మారెడ్డి చలపతిరావు. వయసు 78 సంవత్సరాలు. హైదరాబాద్‌లోని తన నివాసంలోనే గుండెపోటుతో చలపతిరావు చనిపోయారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని కుమారుడి ఇంట్లోనే ప్రస్తుతం చలపతి రావు ఉంటున్నారు. చలపతి రావు హఠాన్మరణంతో సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
అంత్యక్రియలు బుధవారం - కుమారుడు రవిబాబు
చలపతి రావు కుమార్తెలు అమెరికాలో ఉంటుండడంతో వారు హైదరాబాద్‌కు వచ్చాక అంత్యక్రియలు జరుగుతాయని కుమారుడు రవిబాబు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం వరకు సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం చలపతి రావు భౌతిక కాయాన్ని రవిబాబు ఇంట్లోనే ఉంచనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మహా ప్రస్థానం ఫ్రీజర్‌లో ఉంచి బుధవారం (డిసెంబరు 28) అంత్యక్రియలు నిర్వహిస్తామని రవిబాబు తెలిపారు.
‘‘ఆయన లైఫ్‌లో ఎంత ఆనందంగా ఉంటారో అంతే హ్యాపీగా ఆయన వెళ్లిపోయారు. రాత్రి 8.30 గంటల సమయంలో ఆయన చికెన్ బిర్యానీ, చికెన్ కూరతో భోజనం చేశారు. ఆ తర్వాత ప్లేటు చేతికిచ్చి వాలిపోయారు. హ్యాపీనెస్‌తో పెయిన్ తెలియకుండా వెళ్లిపోయారు. నా సిస్టర్స్ ఇద్దరు యూఎస్‌లో ఉన్నారు. వారు టికెట్స్ తీసుకుని ఇక్కడికి వచ్చేసరికి టైమ్ పడుతుంది. మంగళవారం ఎర్లీ మార్నింగ్ దిగుతారు. మంగళవారం అంత్యక్రియలు చేయకూడదు అంటున్నారు కాబట్టి బుధవారం మార్నింగ్ చేస్తారు. ఆయన ఎన్టీఆర్‌తో చాలా బాగా ట్రావెల్ అయ్యారు. ఆయన సినిమాలకు రిటైర్డ్ అవుతున్నానని ఫీలవుతున్న టైమ్‌లో నేను చేస్తున్న ఒక సినిమాలో క్యారెక్టర్ పెట్టాను. ఐదు రోజుల కిందటే అందులో యాక్ట్ చేసి వెళ్లిపోయారు. అదే ఆయన చివరి సినిమా. మీ ఫ్రెండ్, మా నాన్నగారు ఇక లేరనేది వాస్తవం’’ అని రవిబాబు పేర్కొన్నారు.
1944 మే 8న క్రిష్ణా జిల్లా బల్లిపర్రులో చలపతి రావు జన్మించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా చలపతి రావు పని చేశారు. దాదాపు 1200 కు పైగా సినిమాల్లో చలపతి రావు నటించారు. విలన్ పాత్రలు, సహాయ నటుడి పాత్రలు వందల సంఖ్యలో పోషించారు. చలపతిరావుకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆయన కుమారుడు నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన రవిబాబు.
చలపతిరావు నటించిన మొదటి చిత్రం 1966లో వచ్చిన గూఢచారి 116. అప్పటి నుంచి వరుసగా సినిమాల్లో నటిస్తూ వచ్చారు. నిర్మాతగా ఏడు చిత్రాలు నిర్మించారు. కలియుగ క్రిష్ణుడు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్లపంట, ప్రెసిడెంట్ గారి అల్లుడు, అర్ధరాత్రి హత్యలు, రక్తం చిందిన రాత్రి వంటి సినిమాలు నిర్మించారు. ఈ ఏడాది మొదట్లో విడుదల అయిన బంగార్రాజు సినిమాలో చలపతి రావు ఆఖరుసారి కనిపించారు.
ఎన్టీ రామారావుతో అత్యధిక సినిమాల్లో నటించిన వ్యక్తిగా చలపతి రావుకు గుర్తింపు ఉంది. అంతేకాక, ఎన్టీఆర్ తో వ్యక్తిగతంగా కూడా చలపతి రావు మంచి సాన్నిహిత్యం ఉంది. నందమూరి ఫ్యామిలీలో ఏ శుభకార్యం జరిగినా చలపతి రావు హాజరయ్యేవారు. చలపతి రావు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాటి నుంచి మూడు తరాల హీరోలు, నటీనటులతో కలిసి పని చేశారు.