The Family Star Movie: ఎవడ్రా ‘ఫ్యామిలీ స్టార్’ ఫ్లాప్ అన్నది - ఉగాది రోజు హౌస్‌ఫుల్ బోర్డులు, లెక్క తప్పిందా?
Family Star Collections: భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ది ఫ్యామిలీ స్టార్’ బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే, ఉగాది రోజు మాత్రం కలెక్షన్లు కుమ్మేసింది.
The Family Star Movie: గత కొంతకాలంగా టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజును నెటిజన్లు టార్గెట్ చేస్తున్నారు. కారణాలు తెలియకపోయినా, వీరి సినిమాలపై నెగెటివ్ ప్రచారానికి తెరలేపుతున్నారు. గతంలో ‘లైగర్’ సినిమా సమయంలో విజయ్ మాటలు, వ్యవహార తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దిల్ రాజు కూడా గత కొంత కాలంగా మీడియాపైనా, సోషల్ మీడియా నెగెటివ్ ప్రచారంపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆయన్ను కూడా టార్గెట్ చేశారు. మొత్తంగా ఈ ప్రభావం ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా మీద గట్టిగానే పడింది.
ఫ్యామిలీ స్టార్ కు దారుణమైన ఓపెనింగ్స్
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఓపెనింగ్స్ సాధించింది. ఈ సినిమా తొలి షో నుంచే మిశ్రమ స్పందన లభించింది. సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో నెగెటివ్ ప్రచారం జరిగింది. నాన్‌స్టాప్ ట్రోలింగ్ విజయ్ దేవరకొండ సినిమాకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది.
ఉగాది రోజున ‘ఫ్యామిలీ స్టార్’కు భారీ ఊరట
అయితే, ఉగాది పండుగ రోజు ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమాకు పెద్ద ఉపశమనం లభించింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్ ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఈ చిత్రం ఉగాది రోజున 60K టిక్కెట్లు అమ్ముడుపోయినట్లు బాక్సాఫీస్ లెక్కలు వెల్లడించాయి. దీంతో ఎగ్జిబిటర్లలో కాస్త ఉత్సాహం కలిగింది. ‘ఫ్యామిలీ స్టార్’ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.16.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడం అంత ఈజీ కాదనే టాక్ నడుస్తోంది. అయితే, ఈద్ సెలవులు, వీకెండ్ లో మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది.
నెగెటివ్ ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు
అటు ‘ది ఫ్యామిలీ స్టార్’ మూవీపై జరుగుతున్న నెగెటివ్ ప్రచారం వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా మీద నెగిటివ్ పోస్టులు చేశారని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దృష్టికి వచ్చిందని, నిర్మాణ సంస్ధ ఇచ్చిన సమాచారం ఆధారంగా విజయ్ దేవరకొండ మేనేజర్, వీడీ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కలిసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కావాలని కొందరు దుష్ప్రచారం చేస్తూ సినిమా చూడాలనుకునే ప్రేక్షకులను మిస్ లీడ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వసూళ్లపై ప్రభావం పడుతోందని ఫిర్యాదులో వెల్లడించారు. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల అయ్యింది. పరుశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శక హీరోల కాంబోలో రూపొందిన ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నా, వాటిని అందుకోవడంలో విఫలం అయ్యింది.
Read Also: అందుకే నా పెళ్లి విషయాన్ని సీక్రెట్‌గా ఉంచా - అసలు విషయం చెప్పిన తాప్సి