‘స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా’ అన్న రాజ్-కోటీలు ఎందుకు విడిపోయారు?
రాజ్-కోటి అంటే ఒకప్పుడు మంచి సంగీత దర్శకులనే కాదు.. స్నేహానికి సైతం ప్రతీకగా భావించేవారు. మరి, వారు ఎందుకు విడిపోయారు?
‘‘స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా
కడదాక నీడలాగ నిను వీడిపోదురా
నీ గుండెలో పూచేటిది
నీ శ్వాసగ నిలిచేటిది
ఈ స్నేహమొకటేనురా’’
ఈ పాట వింటుంటే, ఇప్పటికీ కళ్లు చెమర్చుతాయి. మళ్లీ మన స్నేహితులను కలుసుకోవాలని అనిపిస్తుంది. ఇంత చక్కని పాట అందించింది మరెవ్వరో కాదు.. సంగీత స్నేహితులు రాజ్-కోటి. ‘ప్రాణ స్నేహితులు’ సినిమాలో ఈ పాటకు భువన చంద్ర లిరిక్స్ అందించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. 1983లో ‘ప్రళయ గర్జన’తో మొదలైన రాజ్-కోటీల ‘సంగీత’ స్నేహం.. 1999లో ముగిసింది.
ఒకప్పుడు రాజ్-కోటీల స్నేహం గురించి ఎంతోమంది గొప్పగా చెప్పుకొనేవారు. ఈ పాటే వారి స్నేహానికి నిదర్శనం అనేవారు. వారిద్దరు కలిసి స్వరాలు అందించారంటే.. ఆ సినిమా హిట్టు కొట్టాల్సిందే అనే టాక్ ఉండేది. అలాంటి మంచి పేరున్న మ్యూజిక్ డైరెక్టర్లు విడిపోవడానికి కారణం ఏమిటీ అనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే. ఎందుకంటే.. దీన్ని రాజ్ ఎప్పటికీ రహస్యంగానే ఉంచారు. కోటి మాత్రమే తనకు తెలిసిన విషయాన్ని చెప్పారు. కానీ, రాజ్ మనసులో భావం ఏమిటనేది ఇప్పటికీ మిస్టరీనే. పోనీ, ఇప్పుడు తెలుసుకుందామని అనుకున్నా.. రాజ్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. తన స్నేహితుడు కోటికి కూడా శాస్వతంగా దూరమయ్యారు.
ఆదివారం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని ఫోరం మాల్ సమీపంలో ఉన్న ఆయన ఇంట్లో బాత్రూమ్‌లో కాలు జారిపడ్డారు. ఆ వెంటనే గుండెపోటుకు గురయ్యారు. హాస్పిటల్‌కు తరలించేలోపే ఆయన మరణించారు. రాజ్ కోటి కలిసి సుమారు 180 వరకు సినిమాలకు సంగీతాన్ని అందించారు. 3 వేల పాటలకు స్వరాలు సమకూర్చారు. కోటితో విడిపోయిన తర్వాత రాజ్ మూడు సినిమాలకు మాత్రం సంగీతం అందించారు. కోటి ఇప్పటికీ సంగీతాన్ని అందిస్తూనే ఉన్నారు. పలు టీవీ షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు.
మాకు ఎలాంటి విభేదాలు లేవు, విడిపోవాలనేది ఆయన నిర్ణయమే: కోటి
అప్పట్లో రాజ్-కోటికి చేతి నిండా సినిమాలున్నాయి. ఇద్దరు కలిసి మ్యూజిక్ అందించేందుకు చాలా సినిమాలకు సైన్ చేశారు. అయితే, ఏమైందో ఏమో రాజ్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఇక కలిసి సంగీతం అందించడం కష్టమని తేల్చేశారు. ఎవరి కెరీర్ వారు చూసుకుందామని వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా రహస్యంగా ఉన్న ఈ విషయంపై ఇటీవలే కోటి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
‘‘వాస్తవానికి రాజ్‌కు నాకు ఎలాంటి విభేదాలు లేవు. ఇద్దరం కలిసే పాటలు చేసేవాళ్లం. రాజ్ పాటలకు కండక్టింగ్ బాగా చేసే వాడు. నేను కంపోజింగ్ చేసేవాడిని. ఏదైనా ఇద్దరం కలిసే పనిచేసేవాళ్లం. ఎలాంటి క్రెడిట్ వచ్చినా అది రాజ్ కోటికి కలిపే వచ్చేది. అయితే పని విషయంలో ఒక్కోసారి హీరో, డైరెక్టర్లు నాతో వచ్చి మాట్లాడేవారు. అది ఆయనకు నచ్చేది కాదు. అయితే రాజ్ అలాంటి చిన్న చిన్నవి పెద్దగా పట్టించుకోరు. కానీ పక్కన ఉన్నవారి చెప్పుడు మాటలు విని ఆయన నాకు దూరమైపోయారు’’ అని కోటి తెలిపారు. ‘‘రాజ్‌కు నటనంటే చాలా ఇష్టం. హాలీవుడ్ నటుల పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి మరీ నటిస్తారు. కానీ, ఆయన సంగీతం మీదే ఫోకస్ పెట్టారు’’ అని పేర్కొన్నారు.
మొదటి సినిమా అవకాశం వచ్చింది రాజ్‌కే
‘‘నిజానికి రాజ్ కే మొదట సినిమా అవకాశం వచ్చింది. ఆయనే ఇద్దరం కలసి సినిమాలు చేద్దామని చెప్పారు. అప్పుడు మేం సంగీతద దర్శకుడు చక్రవర్తి దగ్గర పనిచేసేవాళ్లం. ఒకే టీమ్‌లో ఉన్నాం కదా కలిసి పనిచేద్దామని రాజ్ అన్నారు. అలా మేమిద్దరం కలసి కెరీర్ ప్రారంభించాం. మళ్లీ తర్వాత ఆయనే వచ్చి మనం విడిపోదాం అని అంటే నేను షాక్ కు గురయ్యాను. నేను ఎంత చెప్పినా ఆయన వినలేదు. మనల్ని నమ్ముకొని కొన్ని ఆర్కెస్ట్రా ఫ్యామిలీలు ఉన్నాయని.. అందుకే విడిపోకూడదని బతిమాలినా రాజ్ వినలేదు. విడిపోవాల్సిందేనని పట్టుబట్టారు. అప్పటికే కొన్ని సినిమాలు వర్క్ జరుగుతున్నాయి. అందులో చిరంజీవి లాంటి పెద్ద హీరోల సినిమాలు ఉన్నాయి. రాజ్ స్టూడియోకు రాకపోయినా నేను మాత్రం పని ఆపలేదు. 90 శాతం సినిమాలు నేనే పూర్తి చేసి.. అవి పూర్తయ్యాక స్క్రీన్ మీద రాజ్ కోటి అనే టైటిల్ వేయించాను. ఆ తర్వాత నుంచీ ఎవరికి వారు సినిమాలు చేసుకున్నాం. మేము విడిపోయిన విషయంలో తప్పు ఎవరిదీ కాదు. కాల ప్రభావం వలన అలా జరిగింది. రాజ్ అంటే నాకు ఎప్పటికీ గౌరవమే’’ అని కోటి అన్నారు.
Also Read: ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ ఇక లేరు, బాత్రూమ్‌లో జారి..