Sirivennela Live: సీతారాముడూ వెళ్లిపోయాడు.. ఇన్నాళ్లూ వెన్నెల కురింపించి.. నేడు చీకట్లలో వదిలేసి..

జూబ్లీహిల్స్‌లో ఉన్న ఫిల్మ్‌ ఛాంబర్‌లో సిరివెన్నెల‌ సీతారామ శాస్త్రి భౌతిక కాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖులు సందర్శించుకుంటున్నారు. పాటపై ఆయనకు ఉన్న మక్కువను గుర్తు చేసుకుంటున్నారు.

ABP Desam Last Updated: 01 Dec 2021 03:15 PM
ముగిసిన సీతారాముడి అంత్యక్రియలు

అక్షరసేద్యం చేసిన ప్రముఖ సినీ సాహితీవేత్త,వచన కవిత్వానికి ఆకాశమంత స్థాయిని కల్పించిన కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి  అంత్యక్రియలు మహాప్రస్థానంలో ముగిశాయి. కోట్లాది అభిమానుల అశ్రునయనాల మధ్య అంతిమ యాత్ర సాగింది.  

మొదలైన సిరివెన్నెల అంతిమయాత్ర

సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామాశాస్త్రి అంతిమ యాత్ర ఫిల్మ్‌ ఛాంబర్‌ నుంచి మొదలైంది. అభిమానుల సందర్శనార్థం ఇప్పటి వరకు భౌతిక కాయాన్ని ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఉంచారు. ఇప్పుడు ఆ భౌతిక కాయాన్ని మహా ప్రస్థానానికి తరలిస్తున్నారు. 

పండితులనే కాదు, పామరులను కూడా మెప్పించగల వ్యక్తి సిరివెన్నెల: హరీష్‌ రావు

ఫిల్మ్‌ ఛాంబర్‌లో అభిమానుల కోసం ఉంచిన సినీ గేయ రచయిత సిరివెన్నెల భౌతిక కాయాన్ని మంత్రి హరీష్‌ రావు సందర్శించారు. సిరివెన్నెల కుటుంబంతో మాట్లాడారు. సీతారామశాస్త్రి మరణం తెలుగు సినీ పరిశ్రమకు, సాహిత్య రంగానికి తీరని లోటని... అశ్లీలత, డబుల్‌ మీనింగ్ లేకుండా పాటలు రాసిన మహా వ్యక్తి అని కొనియాడారు. సమాజంలో గొప్ప చైతన్యం రగిలించిన వ్యక్తి ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు హరీష్‌ రావు. 

ఎప్పుడూ కూర్చున్నా మా ఇద్దరి మధ్య సాహిత్య ఉండేవి సాహిత్య చర్చలే: పవన్

సీతారామ శాస్త్రి మరణం బాధ కలిగించిందన్నారు పవన్‌ కల్యాణ్. రుద్రవీణ రోజుల నుంచే తనతో అనుబంధం ఉందని...ఎప్పుడు ఇద్దరం కలిసి కూర్చున్నా... సాహిత్యం గురించే మాట్లాడుకునే వాళ్లమని అన్నారు. మరికొన్ని దశాబ్దాలు తెలుగు సినీ పరిశ్రమకు సేవ చేయాల్సిన వ్యక్తకి ఇలా వెళ్లి పోవడం దురదృష్టకరమన్నారు పవన్.

సిరివెన్నెల లేని సినిమా పాట ఊహించలేం: మహేష్‌ బాబు

సిరివెన్నెల సీతారామశాస్త్రి లేకుండా తెలుగు సినిమా పాటను ఊహించుకోలేమంటున్నారు హీరో మహేష్‌ బాబు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని వేడుకున్నారాయన. 

సిరివెన్నెల మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు: బాలకృష్ణ

ఫిల్మ్‌ ఛాంబర్‌లో సిరివెన్నెల భౌతికి కాయానికి హీరో బాలకృష్ణ నివాళి అర్పించారు. ఆయన మరణం తెలుగు పరిశ్రమకు తీరని లోటని అభివర్ణించారు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని అభిప్రాయపడ్డారు.  

సిరివెన్నెలను చూసేందుకు కడసారి చూసేందుకు వస్తున్న సినీ ప్రముఖులు

 



సిరివెన్నెల‌ సీతారామ శాస్త్రి భౌతిక కాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్ధం ఫిల్మ్ ఛాంబర్‌కు తరలించారు. దర్శకుడు రాజమౌళి, కీరవాణి సిరివెన్నెలకు నివాళి అర్పించారు. త‌నికెళ్ల భ‌ర‌ణి వ‌ట‌వృక్షం కూలిపోయిందంటూ క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. వెంక‌టేష్, అల్లు అర్జున్, నాని, బాలకృష్ణ, నందిని రెడ్డి, అశ్వనీదత్, ఎస్వీ క్రిష్ణారెడ్డి, సింగర్ సునీత తదితరులు సిరివెన్నెలకి నివాళులు అర్పించారు. నేడు ఫిల్మ్ నగర్‏లోని మహాప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలను నిర్వహించనున్నారు.


సీతారామశాస్త్రికి మంత్రి పేర్ని నాని నివాళులు

సిరివెన్నెల భౌతిక కాయానికి ఏపీ ప్రభుత్వం తరపున ఆ రాష్ట్ర మంత్రి పేర్ని నాని నివాళి అర్పించారు. అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పాటు, ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తెలుగు అక్షరాలతో పద విన్యాసం చేసి ప్రతి వ్యక్తి మదిలో చెరగని ముద్ర వేసిన వ్యక్తి ఆయన. సీతారామశాస్త్రికి ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్‌కు ఘన నివాళి అర్పి్స్తున్నాం. సిరివెన్నెల కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుంది’’ అని పేర్ని నాని అన్నారు. 

సిరివెన్నెలకు నాగార్జున, జీవితా రాజశేఖర్ దంపతులు నివాళులు

సిరివెన్నెల సీతారామశాస్త్రికి నాగార్జున, జీవితా రాజశేఖర్ దంపతులు నివాళులు అర్పించారు. తమ సినిమాలకు ఎన్నో మంచి పాటలు రాశారని.. చాలా చిన్న వయసులో ఆయన తనువు చాలించారని చెప్పారు. ఆయన లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని చెబుతూ ప్రముఖులు సిరివెన్నెలకు నివాళులర్పిస్తున్నారు. 

సిరివెన్నెల సీతారామశాస్త్రికి మంత్రి తలసాని నివాళి

ఫిలిం ఛాంబర్‌కు వెళ్లిన తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు. 11 నంది అవార్డులు సొంతం చేసుకున్న గొప్ప వ్యక్తి అని, పద్మశ్రీ సొంతం ఆయనకు దక్కిందని తలసాని గుర్తుచేశారు. రెండు తెలుగు రాష్ట్రాల వారికి సిరివెన్నెల మరణం విషాదాన్ని నింపిందన్నారు. పాటల రచయిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిరివెన్నెల పాటలకు చాలా అర్థం ఉంటుందని, ఎన్నో పాటలను మనకు అందించారని చెప్పారు. వారి కుటుంబంతో పాటు తెలుగు వారికి ఆయన మరణం చాలా లోటు అన్నారు.

సిరివెన్నెలకు అగ్ర నటులు పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ నివాళి..

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి టాలీవుడ్ అగ్రనటులు పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ నివాళులర్పించారు. రాబోయే తరాలకు సిరివెన్నెల సాహిత్యం బంగారు బాటగా మారుతుందని ఎన్టీఆర్ అన్నారు. సిరివెన్నెల భౌతికకాయం వద్ద పవన్ కళ్యాణ్ కొద్దిసేపు అలాగే ఉండిపోయారు.

Background

సిరివెన్నెల సీతారామ శాస్త్రి... సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న అక్షర శ్రామికుడు. ఆయన్ని గేయ రచయిత అనడం కంటే కవి అనడం సబబు. సినిమా పాటకు పేరు తీసుకొచ్చిన కవి ఆయన. ఎన్నో వేల పాటలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఆయన ఇకలేరు.


'సిరివెన్నెల' సీతారామశాస్త్రి ఈ లోకాన్ని విడిచి పైలోకాలకు వెళ్లిపోయారు. (నవంబర్ 30, 2021) కిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఈ నెల 22న ఆస్పత్రికి తీసుకెళ్లారు. మధ్యలో ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వార్తలు వచ్చాయి. అయితే... కుటుంబ సభ్యులు వాటిని ఖండించారు. తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో లేరని చెప్పారు. మళ్లీ సోమవారం 'సిరివెన్నెల' పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఒక్క రోజు గడిచిందో... లేదో... ఆయన లేరనే వార్త వినాల్సి వచ్చింది.


'సిరివెన్నెల' సీతారామశాస్త్రి అసలు పేరు చేంబోలు సీతారామశాస్త్రి. చేంబోలు ఆయన ఇంటి పేరు. ఆయన జన్మించినది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివనిలో జన్మించారు. చేంబోలు వేంకట యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు ఆయన తొలి సంతానం. అక్కడ నుంచి స్వస్థలమైన విశాఖపట్టణం జిల్లాలోని అనకాపల్లికి వేంకట యోగి వచ్చారు. 'సిరివెన్నెల' బాల్యం అంతా అక్కడే గడిచింది. హైస్కూల్ వరకూ అనకాపల్లిలో చదువుకున్నారు. తర్వాత 1971లో కాకినాడలోని ఆదర్శ్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివారు. 1973లో పీఆర్ కాలేజీలో బీకామ్ చేరారు. అదే ఏడాది ఆంధ్ర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ జాయిన్ అయ్యారు. ఒక్క ఏడాది చదివారో... లేదో.. ఆయనకు 1974 సెప్టెంబర్ నెలలో టెలికాం శాఖలో అసిస్టెంటుగా ఉద్యోగం లభించింది. రాజమండ్రిలో 1974లో... తాడేపల్లి గూడెంలో 1975లో పని చేశారు. ఆ తర్వాత కాకినాడకు ట్రాన్సఫర్ అయ్యింది. 1983 వరకూ అక్కడే పని చేశారు. ఆ కాలంలోనే ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా పొందారు. తర్వాత ఎంఏ జాయిన్ అయ్యారు. కానీ, ఓ ఏడాది తర్వాత చదువు ముగించారు.


కాకినాడలో పని చేస్తున్న సమయంలో సాహితీలోకంతో పరిచయమైంది. 'భరణి' అనే పేరుతో ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, విజయ తదితర పత్రికలకు కథలు, కవితలు పంపించారు. సుమారు ఓ పదిహేను కథల వరకూ రాశారు. ఆ తర్వాత ఆయనలో ప్రతిభను గుర్తించిన కళాతపస్వి కె. విశ్వనాథ్... 'సిరివెన్నెల' సినిమాలో పాటలు రాసే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత అదే ఆయన ఇంటి పేరు అయ్యింది. అక్కడ నుంచి తెలుగు సినిమాలో 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి ప్రయాణం ఓ చరిత్ర అయ్యింది. ఎన్నో సినిమాల్లో పాటలకు ప్రాణం పోసిన ఆ కలం నేడు శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంది. 



Also Read: సిరివెన్నెల రాసిన ఈ రెండు పాటలే చివరివి... ఆర్ఆర్ఆర్‌లో ఆ పాట కూడా...
Also Read: సిరివెన్నెల పాట.. ప్రశ్నించే తూటా..
Also Read: వేల పాటలు రాసిన సిరివెన్నెలకు నచ్చిన పాట ఏది? నెటిజన్ల ముచ్చట్లలో ఏం చెప్పారు?

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.