Revanth Reddy Setires On KCR :  తెలంగాణలో బీఆర్ఎస్ లేదని..  టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారిన తర్వాత తెలంగాణలో తెరాస లేదు భారత్ లో బిఆర్ఎస్ అనేది లేదని సీఎం రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఎక్కడుందో  కేసిఆర్ కూడా టార్చ్ లైట్ వేసుకొని వెతుక్కుంటున్నారని అన్నారు. బిఆర్ఎస్ అనేది ఇప్పుడు గతించిన చరిత్ర అని స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు ఆయన కలిశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు.


టార్చ్ లైట్ వేసుకుని బీఆర్ఎస్ కోసం వెదుక్కుంటూ జనం వస్తారన్న కేసీఆర్ 


" కొద్ది రోజుల్లోనే టార్చ్ లైట్ పట్టుకొని జనం దోలాడుకుంటా బీఆర్ఎస్ పార్టీకోసం వస్తారని ” కేసీఆర్ గురువారం పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో వ్యాఖ్యానించారు. ఫామ్ హౌస్‌లో కొంత మంది నేతలతో ఈ వ్యాఖ్యలు చేశారు. రెండున్నర దశాబ్దాల బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో అద్భుతమైన విజయగాథలే తప్ప అపజయ గాథలు లేవని, తెలంగాణ సాధన కోసం బయలుదేరిన నాటి వ్యతిరేక పరిస్థితులనే తట్టుకుని నిలబడ్డ పార్టీకి నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదని, ఎటువంటి ఆటంకాలనైనా అలవోకగా దాటుకుంటూ ప్రజాదరణను మరింతగా పొందుకుంటూ ముందడుగు వేస్తుందని   కేసీఆర్ చెప్పుకొచ్చారు.  తన చేష్టలతో తానే ప్రజలచేత ఛీ కొట్టించుకోవడమే యాబై ఏండ్ల కాంగ్రేస్ వైఖరి అనీ పాలనపై విరక్తి చెందారనే విషయం క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నదని  నే టార్చ్ లైట్ పట్టుకొని జనం దోలాడుకుంటా బీఆర్ఎస్ పార్టీకోసం వస్తారని జోస్యం చెప్పారు. 


కేసీఆర్ టార్చ్ లైట్ వ్యాఖ్యలకు రేవంత్ సెటైర్                         


ప్రజలే టార్చ్ లైట్ పెట్టుకుని బీఆర్ఎస్ కోసం దేవులాడుకుంటూ వస్తారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైనే రేవంత్ స్పందించారు. కేసిఆర్ కూడా టార్చ్ లైట్ వేసుకొని వెతుక్కుంటున్నారని అన్నారు. అసలు బీఆర్ఎస్ లేదన్నారు.   ఎన్నికల సమయంలోనే రాజకీయాలు.. ఆ తర్వాత ఫోకసంతా అభివృద్ధిపైనే ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  తెలంగాణ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. 


రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని, హోంమంత్రితో భేటీ                      


రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని, కేంద్రమంత్రిని కలిశామని రేవంత్ స్పష్టం చేశారు.   తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరామన్నారు.  గోదావరి పరిసరాల్లోని బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని కోరామని.. వేలం లేకుండా సింగరేణికి బొగ్గు గనులను కేటాయించాలని విజ్ఞప్తి చేశామన్నారు.   ఐటీఆర్ ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఐటీఆర్ఎస్ ప్రాజెక్టును పునరుద్ధరించాల్సిందిగా ప్రధానికి విన్నవించాం. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి చేయాలని కోరామని సీఎం, డిప్యూటీ సీఎం మీడియాకు తెలిపారు.