Vemuri Balaram: 'స్వాతి' బుక్ ఎడిటర్ వేమూరి బలరామ్‌పై బయోపిక్
'స్వాతి' సపరివార పత్రిక సంపాదకులు వేమూరి బలరామ్‌పై 'క్యాంపస్ అంపశయ్య' దర్శకుడు ప్రభాకర్ జైన్ బయోపిక్ ను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు ‘స్వాతి బలరాం – అతడే ఒక సైన్యం’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు.
Swati Balaram – Athade OkaSainyam :'స్వాతి' సపరివార పత్రిక తెలుగు పత్రికా ప్రపంచంలోనే ఒక నూతన విప్లవాన్ని తీసుకువచ్చింది. ఇది 1984లో ప్రారంభమైంది. దీని ప్రస్థానం విజయవాడ నుంచి మొదలైనది. దీని సంపాదకులు వేమూరి బలరామ్. యువతనూ, గృహిణులనూ, పాత తరాల వారిని ఆకట్టుకొనే రచనలను ప్రచురిస్తూ, 2005 జాతీయ చదువరుల సర్వే (NRS2005) ప్రకారం 39.59 లక్షల పాఠకులతో తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన వారపత్రికగా స్వాతి నిలిచింది. కాగా తాజాగా ఈ పత్రిక ఎడిటర్ వేమూరి బలరామ్ జీవితాన్ని రచయిత, దర్శకుడు ప్రభాకర్ జైనీ దృశ్య రూపంలో తెరపై ప్రదర్శించనున్నారు. ఈ బయోపిక్ కు ‘స్వాతి బలరాం – అతడే ఒక సైన్యం’ అనే టైటిల్ ను కూడా ఇప్పటికే ఖరారు చేశారు.
తెలుగు పత్రికా ప్రపంచంలో స్వాతి ఓ సంచలనం సృష్టించింది. తెలుగు ప్రజలు అందరూప్రతి గురువారం 'స్వాతి' బుక్ కోసం ఎదురు చూస్తూ ఉండేవారంటే అతిశయోక్తి కాదు. ఆ స్థాయి పాఠకాదరణ సొంతం చేసుకున్న స్వాతి.. 40 ఏళ్ళుగా విజయవంతంగా సేవలందిస్తోంది. ఈ పత్రిక సంపాదకులైన వేమూరి జీవితాన్నే దర్శకుడు ప్రభాకర్ జైన్ ఓ బయోపిక్ లా రూపొందించబోతున్నారు. 'స్వాతి బలరాం - అతడే ఒక సైన్యం' పేరుతో రాబోతున్న ఈ సినిమాను విజయలక్ష్మీ జైనీ నిర్మిస్తున్నారు. జైనీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో నటీనటులను ఎంపిక చేసి సెట్స్ మీదకు తీసుకురానున్నట్టు దర్శక నిర్మాతలు స్పష్టం చేశారు.
పైపైన అందరూ విమర్శించినా... నూనూగు మీసమొచ్చిన ప్రతీ కుర్రవాడూ, పరికిణీ కట్టే వయసొచ్చిన ప్రతి ఆడపిల్లా, గత నలభై సంవత్సరాలుగా దిండు కింద దాచుకుని చదివిన ఏకైక వారపత్రిక స్వాతి. నవరసాల సాహిత్యంతో ప్రతీ ఒక్కరినీ అలరింప చేసిన సాహితీ సమరాంగణా సార్వభౌముడు బలరామ్ గారు అని డైరెక్టర్ ప్రభాకర్ కీర్తించారు. ఆయన తన జీవితంలోని కొన్ని సంఘటనలు చెప్పినప్పుడు అవి తన కళ్ళ ముందు దృశ్య రూపంలో మెదిలాయని, ఆయన ఎన్నో విజయాలు సాధించినా... వాటి కన్నా ఎక్కువ విషాదాలు ఉన్నాయని ప్రభాకర్ చెప్పారు. స్వాతిని ఈ స్థాయికి తేవడానికి 1970 మే 27 నుంచి ఈ నాటికీ ఆయన నిరంతరం శ్రమిస్తున్నారని, ఇవన్నీ ప్రజలకు తెలియవలసిన అవసరం ఉందని తెలిపారు.
సంశయిస్తూనే 'సార్! మీ బయోపిక్ తీద్దాం' అన్నాను
'క్యాంపస్ - అంపశయ్య', 'ప్రజాకవి కాళోజీ' వంటి జీవిత చరిత్రలను తీసిన అనుభవంతో ఈ సినిమా కూడా తీయగలనన్న నమ్మకంతోనే వేమూరి బలరామ్ ముందుఈ ప్రతిపాదన పెట్టానని ప్రభాకర్ చెప్పారు. అప్పటికీ ఖర్చు వంటి మిగతా విషయాలేమీ ఆలోచించలేదని, మనసులో మెదిలిన ఆలోచన బయట పెట్టానని, అతి చనువు తీసుకున్నానేమోనని కూడా అనిపించిందని ఆయన చెప్పారు. ఆయన ఐదు నిమిషాలు ఆలోచించి, తన ఆంతరంగీకులతో సంప్రదించి సరేనన్నారు. అయితే తాను సినిమా కోసం మీ దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోను అనే ఓ కండిషన్ పై ఆయన్ని ఒప్పించానన్నారు. దానికి ఆయన ఆశ్చర్యపోయి, 'ఇప్పటి వరకు అందరూ నన్ను వాడుకున్నవారే బిడ్డా! నువ్వేమో ఇట్లా అంటున్నావు. సరే!' అన్నారు.
అలా ఆయన వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని ప్రతిఫలించేలా ఒక పాటను రికార్డ్ చేసి వారికి వినిపించానని, ఆ తర్వాత రెండు, మూడు రోజులు విజయవాడలోని వారింట్లో, ఆఫీసులో, కొడాలిలో, ఘంటసాలలో షూటింగ్ ఒక షెడ్యూల్ పూర్తి చేశామని చెప్పారు. ఇప్పుడు మిగిలిన షూటింగ్ కోసం వేమూరి బలరాం గారు యవ్వనంలో ఉన్నప్పుడు, మధ్య వయసులో ఉన్నప్పుడున్న పోలికలు కలిగిన నటుల కోసం వెతుకుతున్నామన్నారు. ఔత్సాహిక నటులు తమ ప్రొఫైల్స్, ఆడిషన్ వీడియోస్ balaram.biopic@gmail.com మెయిల్ ఐడీకి పంపగలరని ప్రభాకర్ చెప్పారు. తనకైతే ఇదొక అద్భుతంలా అనిపిస్తుందన్న ఆయన.. ఈ సినిమా ఒక అద్భుతమైన దృశ్యకావ్యంగా రూపుదిద్దుకుంటుందని నమ్మకంగా ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇంతకు ముందు ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో 'క్యాంపస్ అంపశయ్య', 'ప్రణయ వీధుల్లో', కాళోజీ నారాయణరావు బయోపిక్ 'ప్రజాకవి కాళోజీ' వచ్చాయి. ఇప్పుడు స్వాతి పత్రికాధినేత వేమూరి బలరామ్ జీవిత చిత్రం 'స్వాతి బలరాం - అతడే ఒక సైన్యం'కి శ్రీకారం చుట్టారు.