దేశంలో రోజురోజుకి కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు విధించాయి. కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లను మూసేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో థియేటర్లు మూతపడ్డాయి. కొన్ని రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీని యాభై శాతానికి తగ్గించారు. నైట్ కర్ఫ్యూల కారణంగా సెకండ్ షోలు రద్దయ్యాయి. ఉత్తరాదిన బీహార్లో థియేటర్లను మూసి వేస్తున్నట్లు ప్రకటించిన.. కొన్ని గంటల్లోనే తమిళనాడు ప్రభుత్వం కూడా ఇదే బాట పట్టింది. 

 

రాష్ట్రంలో థియేటర్లన్నింటినీ మూసివేయాలని నిర్ణయించుకుంది. దీంతో అక్కడ విడుదల కావాల్సిన 'వలిమై' సినిమాను వాయిదా వేయక తప్పలేదు. ఇప్పటివరకు ఈ విషయంపై తీవ్ర చర్చలు జరిగాయి.  ఈ సాయంత్రం చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల వాయిదా ప్రకటన చేసింది. 

 

ముందుగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయాలని అనుకున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా విడుదలకు సన్నాహాలు చేశారు. తమిళ పేరుతోనే తెలుగులో కూడా విడుదల చేయాలనుకున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా వదిలారు. కానీ కొన్ని గంటల్లోనే పరిస్థితులు మారిపోయాయి. 

 

కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవడంతో 'వలిమై' లాంటి భారీ సినిమా సంక్రాంతికి విడుదలైతే వైరస్ మరింత విజృంభించడం ఖాయం. అందుకే ముందుగానే థియేటర్లను క్లోజ్ చేసి చిత్రబృందానికి క్లారిటీ ఇచ్చేశారు. ఇలా చేయకపోతే కచ్చితంగా రిలీజ్ కు ఏర్పాటు చేసుకుంటారు. చివరి నిమిషంలో రిలీజ్ వాయిదా వేయాల్సి వస్తే పరిస్థితులు మరింత గందరగోళంగా మారతాయి.