గత ఏడాది నవంబర్ 21 రాత్రి మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూపకుంట రోడ్డులో జరిగిన హత్య కేసును వరంగల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను మీల్స్ కాలనీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి హతుడికి సంబంధించిన ఒక బంగారు బ్రాస్లెట్, రెండు బంగారు ఉంగరాలు, ఒక సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బైరి గురుమూర్తి గతంలో ఫైనాన్షియర్ కోక వేంకటేశ్వరరావుతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. ఈ పరిచయంతో గురుమూర్తి తన పెద్ద కుమార్తె వివాహం కోసం తన సొంత ఇంటికి సంబంధించిన దస్తావేజులను హతుడు వెంకటేశ్వరరావు వద్ద తనాఖా పెట్టి 5 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు.
Also Read: 'బుల్లి బాయ్'ను పట్టేసిన పోలీసులు.. మహిళల చిత్రాలను అసభ్యంగా మార్చి అమ్మకం
ఇంట్లో కిరాయికి ఉంటున్న వ్యక్తి హస్తం
అలాగే గురుమూర్తి తన రెండో కుమార్తె కాలేజీ ఫీజులు, వివాహం కోసం తన ఇంటిని 58 లక్షలకు అమ్మేందుకు మరో వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుని, రూ.15 లక్షలు అడ్వాన్సుగా తీసుకున్నాడు. ఇందుకోసం తన ఇంటి దస్తావేజులు ఇవ్వాలని గురుముర్తి వెంకటేశ్వరరావు ఇవ్వాలని కోరాడు. అయితే తీసుకున్న డబ్బుకు వడ్డీ చెల్లిస్తేనే దస్తావేజులు తిరిగి ఇస్తానని చెప్పడంతో వెంకటేశ్వరావుపై గురుమూర్తి ద్వేషం పెంచుకున్నాడు. చివరికి హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంకటేశ్వర రావు ఇంటిలో కిరాయికి ఉంటున్న మరో వ్యక్తి నీలం శ్రీనివాస్ ఆర్థిక లావాదేవీల గొడవలతో యాజమానిపై ద్వేషం పెంచుకున్నాడు. ప్రధాన నిందితుడు గురుమూర్తి, మరో నిందితుడు నీలం శ్రీనివాస్ కు మధ్య పరిచయం ఏర్పడింది. ఇరువురు వెంకటేశ్వర్లరావుతో ఉన్న ఆర్థిక లావాదేవీల గోడవలు సమసిపోవాలంటే హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. వెంకటేశ్వర రావు హత్య చేసేందుకు అవసరమైన డబ్బు ఖర్చు చేసేందుకు శ్రీనివాస్ అంగీకరించాడు. వెంకటేశ్వర రావును హత్య చేసేందుకు ఆకునూరి మహరాజ్ తో పాటు మరికొందరితో గురుమూర్తి, శ్రీనివాస్ లు ఒప్పందం కుదుర్చుకున్నారు.
Also Read: 'ప్రాణాలతో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చా.. మీ సీఎంకు థ్యాంక్స్'.. పంజాబ్ అధికారులతో ప్రధాని
ప్లాన్ ప్రకారం హత్య
ఫైనాన్స్ డబ్బులు వసూళ్ల కోసం వెంకటేశ్వరరావు దూపకుంట వస్తున్నట్లుగా తెలుసుకుని తూర్పుకోటకు వెళ్లే మార్గంలోని తాటివనంలో హత్యకు ప్లాన్ వేశారు. అనుకున్నట్లే గత నవంబర్ 21న రాత్రి 8 గంటల సమయంలో నిందితుల్లో ఒకడైన నీలం శ్రీనివాస్ వెంకటేశ్వర రావు ద్విచక్ర వాహనంపై ఎక్కి తూర్పుకోట మార్గంలోని తాటివనం వైపు తీసుకొచ్చాడు. అప్పటికే అక్కడ ఆటోలో కాపుకాస్తున్న గురుమూర్తితో సహ మిగతా నిందితులు వేంకటేశ్వరరావుపై దాడి చేసి హత్య చేశారు. మృతుడి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలతో పాటు సెల్ ఫోన్, మృతుడి జేబులో ఉన్న రూ. పది వేల నగదును చోరీ చేశారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి సూచనల మేరకు దర్యాప్తు చేసి నిందితులను గుర్తించారు. గురువారం ఉదయం ఆర్థిక లావాదేవీలపై నిందితులందరూ చర్చించేందుకు రంగశాయిపేట్ వాటర్ ట్యాంక్ వద్దకు వచ్చినట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో మీల్స్ కాలనీ ఇన్ స్పెక్టర్ తన సిబ్బందితో వెళ్లి నిందితులను అదుపులో తీసుకొని విచారించగా హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు.