భద్రతా కారణాల వల్ల పంజాబ్ పర్యటనను రద్దు చేసుకుని దిల్లీ చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అయితే ఫిరోజ్‌పుర్ పర్యటన రద్దు వెనుక రాజకీయమే కారణమని భాజపా ఆరోపించింది. ఇప్పటికే భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే దిల్లీకి విమానం ఎక్కేముందు ప్రధాని మోదీ.. పంజాబ్ సీఎంపై వ్యంగ్యాస్త్రాలు సంధించినట్లు సమాచారం.
భఠిండా విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ప్రధాని మోదీ అక్కడి రాష్ట్ర అధికారులతో సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీకి ధన్యవాదాలు చెప్పాలని అన్నట్లు సమాచారం.
పంజాబ్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు భఠిండా విమానాశ్రయానికి బుధవారం ఉదయం మోదీ చేరుకున్నారు. అక్కడి నుంచి హుస్సేనీవాలాలోని స్వాతంత్య్ర సమర యోధుల స్మారకం వద్ద నివాళి అర్పించేందుకు హెలికాప్టర్లో వెళ్లాలనుకున్నారు. అయితే వాతావరణం సరిగా లేకపోవడం వల్ల 20 నిమిషాలపాటు మోదీ ఎదురు చూడాల్సి వచ్చింది.
పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడం వల్ల రోడ్డు మార్గంలో మోదీ కాన్వాయ్ బయలుదేరింది. గమ్యస్థానానికి మరో 30 కిలోమీటర్ల దూరం ఉండగా ఆయన కాన్వాయ్‌ను ఫ్లైఓవర్‌పై కొంతమమంది నిరసనకారులు అడ్డుకున్నారు. ఫ్లైఓవర్‌పై 15 నుంచి 20 నిమిషాలపాటు మోదీ కాన్వాయ్ ఉండిపోయింది. ఇది భద్రతాపరమైన సమస్యలకు కారణమైంది.
హోంశాఖ సీరియస్..
పంజాబ్‌లో ప్రధాని పర్యటనపై ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగానే తెలియజేసినప్పటికీ ఇలా జరిగిందని కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారం రోడ్డు మార్గాన్ని సురక్షితంగా ఉంచేందుకు అదనపు భద్రతను రాష్ట్ర ప్రభుత్వం మోహరించవలసి ఉందని కానీ అలా జరగలేదని పేర్కొంది. దీనిపై పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని చన్నీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Also Read: PM Narendra Modi: పంజాబ్‌లో ప్రధాని మోదీకి నిరసన సెగ.. ర్యాలీ రద్దు చేసి హుటాహుటిన దిల్లీకి పయనం!
Also Read: Covid-19 Update: ఒక్కరోజే 58 వేల కరోనా కేసులు.. దేశంలో వైరస్ 'మహా' కల్లోలం