ప్రధాని నరేంద్ర మోదీకి పంజాబ్‌లో నిరసన సెగ తగిలింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్​లో ఈరోజు జరగాల్సిన మోదీ ర్యాలీ అనూహ్యంగా రద్దయింది. ప్రధాని పర్యటనలో సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే ఆయన సభకు హాజరుకాలేదని కేంద్ర హోం శాఖ తెలిపింది.




ఫిరోజ్​పుర్​లో మోదీ సభ జరగాల్సి ఉందని కానీ  కొన్ని కారణాల వల్ల ఈ సభకు మోదీ హాజరు కావడం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్​ మాండవీయా సభా వేదికపై ప్రకటించారు.





అసలేమైంది..?





బుధవారం ఉదయం బతిండ విమానాశ్రయంలో ప్రధాని మోదీ ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి హస్సేన్​వాలాకు వెళ్లి హెలికాప్టర్​లో స్వాతంత్ర్య సమర యోధులకు నివాళి అర్పించేందుకు వెళ్లారు. వర్షం కారణంగా ఆయన అక్కడ ఇరవై నిమిషాలు వేచి చూడాల్సి వచ్చిందని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే సభకు వెళ్లే మార్గంలో భద్రతా చర్యలు పటిష్ఠంగా చేపట్టకపోవడం వల్లే ఆయన సభకు హాజరు కాకుండా తిరిగి విమానాశ్రయానికి వెళ్లారని చెప్పింది.

 

అయితే ప్రధాని మోదీ కాన్వాయ్‌ను నిరసనకారులు అడ్డుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగానే ప్రధాని మోదీ వెనుదిరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా విమర్శించారు. పంజాబ్‌లో అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేసేందుకు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుందన్నారు.