Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో 81 మంది! నామినేషన్ల స్క్రూట్నీలో హైడ్రామా!
Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో స్క్రూట్నీ తర్వాత 81 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో ఈ రెండు రోజుల్లో ఎంతమంది నామినేషన్లు వెనక్కి తీసుకుంటారో చూడాలి.

Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ స్క్రూట్నీలో హైడ్రామా నడిచింది. రెండు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయనే ప్రచారం జోరుగా సాగింది. కానీ అధికారులు కీలక ప్రకటన చేశారు. మూడు పార్టీల ప్రధాన అభ్యర్థులతోపాటు 81 మంది వేసిన 135 నామినేషన్లను అంగీకరించారు. మిగతా వాటిని వివిధ కారణాలతో తిరస్కరించారు. దీంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఫేక్ అని తేలింది. ఇప్పుడు ఈ నామినేషన్‌లలో ఎంతమంది వెనక్కి తీసుకుంటారు? బరిలో ఎంత మంది ఉంటారనే ఆసక్తి నెలకొంది.
స్క్రూట్నీ రోజు అనూహ్య పరిణామాలు
తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో ఈ స్థానాన్ని తామే దక్కించుకోవాలని గోపీనాథ్ భార్య సునితకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. అయితే ఆమె చట్టబద్ధంగా భార్య కాదంటూ నామినేషన్ స్క్రూట్నీ టైంలో బాంబు పేల్చాడు గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు. ఆయనకు తానే వారసుడిని అంటూ ప్రకటించడం సంచలనంగా మారింది. దీంతో ఆమె నామినేషన్ తిరస్కరిస్తున్నారని ప్రచారం జరిగింది. ఇందులో సునీత కూడా స్పందించి అదంతా తప్పుడు ప్రచారంగా కొట్టిపారేశారు.
నవీన్ యాదవ్ నామినేషన్ తిరస్కరించారని ప్రచారం
కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న సునీల్ యాదవ్ నామినేషన్‌లో తప్పులు ఉన్నాయని అందుకే ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైందని కూడా సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. ఫామ్ 26ని పూర్తిగా నింపలేదని కూడా చెప్పుకొచ్చారు. ఆయనతోపాటు కొందరు స్వతంత్ర అభ్యర్థులు ఇదే పని చేస్తే వారి నామినేషన్లు తిరస్కరించారని ఇప్పుడు ఆయనది కూడా తిరస్కరిస్తారని అన్నారు. ఇలాంటిది ముందే గ్రహించిన సునీల్ యాదవ్ తన భార్య పేరున కూడా నామినేషన్ వేశారని కూడా పోస్టులు కనిపించాయి.
81 మంది నామినేషన్లు ఓకే
అన్నింటినీ కొట్టిపారేస్తు అధికారులు ఫైనల్ జాబితాను విడుదల చేశారు. ప్రధాన పార్టీలకు చెందిన నామినేషన్లు ఆమోదం పొందినట్టు వెల్లడించారు. స్క్రూట్నీని నాటకీయ పరిణామాల మధ్య 17 గంటలపాటు నిర్వహించారు. ఇలా నిర్వహించిన స్క్రూట్నీలో 211 మంది అభ్యర్థులు వేసిన 321 నామినేషన్లను పరిశీలించారు. ఇందులో 81 మందికి చెందిన 135 మంది నామ పత్రాలకు మాత్రమే ఆమోదం తెలిపారు. మిగిలిన 130 మంది అభ్యర్థులకు చెందిన 186 నామినేషన్లు తిరస్కరించారు. ఆ వివరాలను అధికారులు బుధవారం ప్రకటించారు.
శుక్రవారం వరకు నామినేషన్లు విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంది. 135లో ఎంత మంది తమ నామినేషన్లున వెనక్కి తీసుకుంటారు. చివరకు బరిలో ఉండేది ఎంత మంది అన్న ఆసక్తి నెలకొంది. ఈసారి ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న ఓయూ నిరుద్యోగ యువత, ట్రిపుల్ ఆర్ నిర్వాసితులు భారీగా వచ్చి నామినేషన్లు వేశారు. 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు దాఖు చేశారు. చాలా వరకు సరైన పత్రాలు లేకపోవడం, రూల్స్‌కు అనుగుణంగా లేని వాటిని అధికారులు తిరస్కరించారు. ఈ ప్రక్రియ కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన రంజిత్ కుమార్ సింగ్ పర్యవేక్షణలో జరిగింది.





















