ITR Filing: ఐటీ రిటర్న్ ఇంకా ఫైల్ చేయలేదా?, ఇవాళే లాస్ట్ డేట్, తెలిసి తెలిసి చిక్కుల్లో పడొద్దు
ఆదాయపు పన్ను చట్టం-1961 సెక్షన్ 139(4) కింద ఆలస్య రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుందని గుర్తు పెట్టుకోండి.
ITR Filing: మీరు జీతం తీసుకునే వ్యక్తి అయితే, మీ జీతం ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తే, ఆదాయ పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడం తప్పనిసరి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి (FY 2021-22), అంటే 2022-23 మదింపు సంవత్సరానికి (AY 2022-23) మీరు ఇంకా ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయకపోతే, ఇవాళే ఆఖరు తేది. తక్షణం రిటర్న్ ఫైల్ చేయకపోతే, తెలిసి తెలిసి ఇబ్బందుల్లో పడతారు. చాలా పెద్ద ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, గుర్తుంచుకోండి.
ఆదాయపు పన్ను చట్టం నిబంధన ప్రకారం, ఏ కారణం వల్లనైనా సాధారణ గడువులోగా ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేయలేకపోతే, ఆలస్య రుసుముతో కలిపి సంబంధిత గడువు తేదీలోగా ఫైల్ చేయవచ్చు.
2021-22 ఆర్థిక సంవత్సరం లేదా 2022-23 మదింపు సంవత్సరానికి సంబంధించి 2022 జులై 31వ తేదీన సాధారణ గడువు ముగిసింది. ఈ తేదీ లోపు ఆదాయ పన్ను పత్రాలు సమర్పించని వాళ్లు, జరిమానాతో కలిపి 2022 డిసెంబర్ 31, శనివారం అర్ధరాత్రికి ముందే (Last Date for ITR Filing) పత్రాలు సమర్పించాలి.
రూ.1000-5000 ఆలస్య రుసుము
ఆదాయపు పన్ను చట్టం- 1961 సెక్షన్ 139(4) కింద ఆలస్య రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుందని గుర్తు పెట్టుకోండి. దాఖలు చేసే ప్రక్రియలో ఎలాంటి మార్పు ఉండదు. దీనికి సెక్షన్ 234(F) ప్రకారం నిర్దిష్ట మొత్తంలో ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పన్ను వర్తించే ఆదాయం రూ. 5 లక్షలు దాటితే 5 వేల రూపాయల ఆలస్య రుసుముతో ITR ఫైల్ చేయాలి. పన్ను వర్తించే ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువగా ఉంటే, వెయ్యి రూపాయల ఆలస్య రుసుముతో రిటర్న్ దాఖలు చేయాలి. ఒకవేళ పన్ను బకాయి ఉంటే, దానిని వడ్డీతో కలిపి చెల్లించాలి. పన్ను బకాయిలు ఉన్న వారు ఆలస్యంగా రిటర్న్ దాఖలు చేసినందుకు ప్రతి నెలా ఒక శాతం అదనంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
ఆలస్యమైన ITR ఫైలింగ్స్‌లో, మునుపటి అసెస్‌మెంట్ సంవత్సరంలో జరిగిన నష్టాన్ని ఫార్వార్డ్ చేయడానికి అనుమతి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో పన్ను చెల్లింపుదార్లు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.
అదే విధంగా, రివైజ్డ్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (Revised Income Tax Return) దాఖలు చేయడానికి కూడా 2022 డిసెంబర్ 31ని చివరి తేదీగా ఆదాయ పన్ను విభాగం నిర్ణయించింది. ఎవరైనా ITR ఫైల్ చేసినప్పుడు ఏదైనా తప్పు దొర్లితే, సవరించిన (రివైజ్డ్) ITR ఫైల్ చేయడం ద్వారా ఆ తప్పును సరిదిద్దుకోవచ్చు. 2021-22 ఆర్థిక సంవత్సరం లేదా 2022-23 మదింపు సంవత్సరానికి సంబంధించి రివైజ్డ్ ITR ఫైల్ చేయడానికి కూడా ఇవాళే లాస్ట్ డేట్.
ఆదాయపు పన్ను చట్టం- 1961లోని సెక్షన్ 139(5) కింద రివైజ్డ్ ITR దాఖలు చేయాలి. ఇక్కడ కూడా ఫైలింగ్ ప్రక్రియ మారదు. కాకపోతే, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారు రివైజ్డ్ ITRను ఫైల్ చేస్తున్నప్పుడు, సెక్షన్ 139(5)ని ఎంచుకున్నారా లేదా అనే విషయాన్ని మాత్రం కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ITR నంబర్‌ను కూడా భద్రపరుచుకోవాలి.
డిసెంబర్ 31లోగా ITR ఫైల్ చేయకపోతే ఏమవుతుంది?
మీరు డిసెంబర్ 31, 2022 లోపు ఆదాయపు పన్ను పత్రాలు సమర్పించకుంటే, జనవరి 1, 2023 నుండి రిటర్న్‌లను దాఖలు చేయడానికి ఆదాయపు పన్ను విభాగం నుంచి ప్రత్యేక మినహాయింపును పొందవలసి ఉంటుంది, పన్ను విధించదగిన ఆదాయం ఉన్నప్పటికీ తుది గడువులోగా మీరు పత్రాలు సమర్పించకపోతే, ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్ మీకు నోటీసు పంపడం ద్వారా చర్య తీసుకోవచ్చు. దీనితో పాటు, జరిమానాలు, పరిశీలన వంటి అదనపు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
వెరిఫికేషన్ తప్పనిసరి
ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసిన తర్వాత, వెరిఫికేషన్ వ్యవధిని గతంలోని 120 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించారు. అంటే, 30 రోజుల లోపు ITR వెరిఫికేషన్ చేయకపోతే, మీరు దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్ చెల్లదు. CBDT జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఆగస్ట్ 1, 2022న లేదా ఆ తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసే పన్ను చెల్లింపుదారు 30 రోజుల్లోపు రిటర్న్‌ను వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు, ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి 120 రోజుల్లో వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది.