Amazon Quick Service: అమెజాన్‌లో ఆర్డర్ చేస్తే నిమిషాల్లోనే డెలివెరీ - ర్యాపిడ్ సర్వీస్ ఈ నెలలోనే ప్రారంభం!
Amazon Rapid Delivery Service: మీరు అమెజాన్‌లో ఏదైనా ఆర్డర్ చేసి, ఫోన్ పక్కన పెట్టి సర్ధుకుని కూర్చునే లోగానే ఆ వస్తువు మీ ఇంటి ముందుకు రావచ్చు. ఈ ర్యాపిడ్ సర్వీస్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది.
Quick Commerce: భారతదేశంలో క్విక్ కామర్స్ రంగం వేగంగా విస్తరిస్తోంది. ఇప్పుడు, వినియోగదారులు ఏదైనా వస్తువును ఆర్డర్ చేసిన తర్వాత రోజుల తరబడి ఎదురు చూడడానికి ఇష్టపడడం లేదు. ఆర్డర్ చేసిన వెంటనే, నిమిషాల వ్యవధిలో ఆ వస్తువు తమ చేతుల్లో ఉండాలని కోరుకుంటున్నారు. ఈ రకమైన ధోరణి వల్ల క్విక్ కామర్స్‌కు ఎప్పటికప్పుడు ఆదరణ పెరుగుతోంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ-కామర్స్ రంగంలో పెద్ద కంపెనీ అమెజాన్ (Amazon India) కూడా క్విక్ కామర్స్‌లోకి అతి త్వరలో అడుగు పెట్టబోతోంది. ఇప్పటికే క్విక్ కామర్స్ విభాగంలో రాజ్యం ఏలుతున్న బ్లింకిట్ (Blinkit), స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ (Swiggy Instamart), జెప్టో (Zepto), ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ (Flipkart Minutes), బిగ్ బాసెక్ట్ (BigBasket) వంటి కంపెనీలకు పోటీగా మార్కెట్‌లోకి వస్తోంది. వాటిలాగే అమెజాన్ కూడా క్విక్ డెలివరీ సర్వీస్‌లో చేరబోతోంది, మీరు ఆర్డర్ చేసిన వస్తువులను నిమిషాల వ్యవధిలో మీ ఇంటి గుమ్మం వద్దకు చేరుస్తుంది.
బెంగళూరు నుంచి ప్రారంభం
ఈ నెలలోనే, బెంగుళూరు నుంచి అమెజాన్ ర్యాపిడ్ సర్వీస్ ప్రారంభం అవుతుందని భారతదేశంలో అమెజాన్ 'కంట్రీ మేనేజర్' సమీర్ కుమార్, దిల్లీలో జరిగిన ఓ కంపెనీ ఈవెంట్‌లో చెప్పారు. అమెజాన్, క్విక్ కామర్స్ సెక్టార్‌లో తాను అందించే సర్వీస్‌కు తేజ్ (Tez) అని పేరు పెట్టవచ్చు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
15 నిమిషాల్లో డెలివరీ
"అమెజాన్ క్విక్ సర్వీస్ ద్వారా, వినియోగదారులు తమ రోజువారీ జీవితంలో అవసరమైన వస్తువులను ఆర్డర్ చేసిన తర్వాత, కేవలం 15 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయంలోనే వాటిని పొందగలరు" - సమీర్ కుమార్
త్వరితగతి వాణిజ్య రంగంలో (క్విక్ కామర్స్ సెక్టార్) వ్యాపారాన్ని పెంచడమే తమ లక్ష్యం సమీర్ కుమార్ చెప్పారు. బెంగళూరు తర్వాత, దేశంలోని ఇతర నగరాల్లో కూడా ఈ సేవను ప్రారంభించాలని యోచిస్తున్నామని వెల్లడించారు. ఓ రిపోర్ట్ ప్రకారం, అమెరిజాన్ క్విక్ కామర్స్ సర్వీస్‌కు సంబంధించిన పనులు గత కొన్ని నెలలుగా జరుగుతున్నాయి, ఇప్పుడు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చాయి.
గత కొన్నేళ్లుగా వినియోగదారుల ప్రాధాన్యతలు మారడం ప్రారంభించాయి. ఇప్పుడు, వస్తువుల డెలివరీ కోసం 1-2 రోజులు కూడా ఎదురు చూడడం లేదు, నిమిషాల్లోనే డెలివరీ పొందడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ట్రెండ్‌ను క్యాష్ చేసుకుంటున్న క్విక్ కామర్స్ కంపెనీల దూకుడు కారణంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల మార్కెట్ షేర్ తగ్గుతోందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, పోగొట్టుకున్న మార్కెట్ వాటాను తిరిగి పొందడానికి, ఈ-కామర్స్ కంపెనీలు త్వరితగతి వాణిజ్య రంగంలోకి అడుగు పెడుతున్నాయి. అమెజాన్‌కు భారతదేశంలో ప్రైమ్ మెంబర్లు సహా మిలియన్ల మంది కస్టమర్లు ఉన్నారు. ఈ భారీ కస్టమర్ బేస్ అమెజాన్‌కు అతి పెద్ద అసెట్ అవుతుందని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ భావిస్తున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries), టాటా గ్రూప్ (Tata Group) కూడా ఈ విభాగంలో ప్రవేశించనున్నాయి. బిగ్‌బాస్కెట్ కూడా టాటా గ్రూప్ కంపెనీయే.
ప్రస్తుతం, క్విక్ కామర్స్ మార్కెట్ విలువ సుమారు రూ. 51,240 కోట్లుగా ఉందని డాటమ్ ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. 2030 నాటికి ఇది సుమారు రూ. 3.36 లక్షల కోట్లకు చేరుతుందని లెక్కగట్టింది. అంటే, ఆరేళ్లలో ఆరు రెట్లకు పైగా పెరుగుతుంది. ఈ ఏడాది, క్విక్ కామర్స్ ద్వారా అమ్ముడైన వస్తువుల్లో కిరాణా సరకుల విలువ దాదాపు రూ. 10,750 కోట్ల ఉంటుందని డాటమ్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. క్విక్ కామర్స్ కంపెనీల మొత్తం సేల్స్‌లో కిరాణా సరకుల వాటా 21 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.
మరో ఆసక్తికర కథనం: ఆర్‌బీఐ కొత్త గవర్నర్ జీతం ఎంత, ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి?