(Source: ECI/ABP News/ABP Majha)
Zodiac Signs Love Marriage: ఈ ఐదు రాశులవారు ప్రేమ వివాహలకే ఆసక్తి చూపిస్తారు, ఆరు నూరైనా సరే!
మీరు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారా.. ప్రేమ పెళ్లి చేసుకుంటారా.. ఏం రాశిపెట్టి ఉంటే అది జరుగుతుందంటారా.. మీ మాట నిజమే అయ్యిండొచ్చు, కానీ మీ రాశులపై గ్రహాల ప్రభావమే అలా నడిపిస్తుందట.
పెళ్లి… ఇద్దరు వ్యక్తులతో పాటు.. రెండు కుటుంబాలను కలిపేందుకు వేదిక. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ఘట్టం తప్పనిసరిగా వస్తుంది. అయితే పెళ్లిపీటల వరకూ వెళ్లేందుకు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం పెద్ద ప్రాసెస్. పెద్దలు కుదిర్చిన వివాహం అయితే అమ్మాయినో, అబ్బాయినో వెతకడం మొదలు…పెళ్లి జరిగేవరకూ అన్నీ బాధ్యతలు వహిస్తారు. అయితే మారుతున్న ట్రెండ్ తో పాటూ యువతలో స్వతంత్య్ర భావాలు పెరుగుతున్నాయి. చదువు పూర్తిచేసి ఉద్యోగంలో చేరిన వెంటనే పెళ్లిచేస్తే ఓ పనైపోతుందని పెద్దలు భావిస్తారు. అయితే నేటి యువతలో చాలామంది తమ జీవిత భాగస్వామిని తామే ఎంపిక చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. వారి వారి రాశులపై గ్రహాల ప్రభావం అలాంటిది మరి. మరి ఇంతకీ ఏఏ రాశులవారు ప్రేమ వివాహంపై ఆసక్తి ప్రదర్శిస్తారో చూద్దాం…
మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1) మేష రాశి వారు సున్నితంగా ఉంటారు. బంధాలు, అనుబంధాలకు చాలా విలువనిస్తారు. ఇక ప్రేమ విషయంలో అస్సలు వెనకడగువేయరు. ఒక్కసారి కమిటైతే వీళ్లమాట వీరే వినరన్నమాట. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రేమించిన వారిని వదులుకునేందుకు ఇష్టపడరు. మేషరాశి వారిలో దాదాపు 80శాతం మంది స్నేహితులనే ప్రేమించి పెళ్లిచేసుకుంటారట. కాబోయే భాగస్వామి కోసం గట్టిపోరాటమే చేస్తారు కాబట్టి… వీరి జీవితం మొత్తం ప్రేమమయంగా సాగిపోతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) వృషభ రాశి వారు పద్ధతిగా ఉంటారు. కష్టజీవులు. ప్రేమ విషయంలోనూ ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఒక్కసారి ప్రేమలో పడితే బయటకు రాలేనంత లోతులో కూరుకుపోతారట. మనసుకి నచ్చినవారిని పెళ్లిచేసుకోవాలని ఉన్నా.. ఎవ్వరికీ చెప్పకుండా మనసులోనే దాచుకుంటారు. ఎదుటివారు గమనించి ఓ అడగు ముందుకేయాలే కానీ…వృషభరాశి వారు మాత్రం మరోసారి ఆలోచించండి అనే తరహాలో వ్యవహరిస్తారట. పరిస్థితి చేయిదాటిపోతుంది అన్నప్పుడు మాత్రం బయటపడి… ప్రేమను నిలబెట్టుకుంటారు. సాధారణంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం వీరికి అంతగా నచ్చదు.
మిధునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) మిధున రాశి వారికి సైలెంట్ అనే మాటే గిట్టదు. ఎక్కడుంటే అక్కడ సందడే. చలాకీగా, చురుకుగా, డైనమిక్‌గా ఉంటారు. అందరితోనూ త్వరగా కలిసిపోతారు. అందుకే అందరూ వీళ్లను ప్రేమిస్తారు. అయితే ఇక్కడో సమస్య ఉంది. మిధున రాశి వారు ఎప్పుడూ ఒకే ఫ్రెండ్స్‌తో ఫిక్స్‌గా ఉండరు. ఎందుకంటే వీళ్లకు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అందువల్ల ఎవరినైనా వదిలేయడానికి కూడా వీరు పెద్దగా ఆలోచించరు. చిత్రమేంటంటే... ఇలాంటి వారు ప్రేమ, పెళ్లి విషయంలో మాత్రం చాలా కచ్చితంగా ఉంటారు. సరైన వాళ్లను ఎంచుకుని... వాళ్లనే పెళ్లి కూడా చేసుకోవాలని భావిస్తారు. వీళ్ల అల్లరి, చిలిపితనం భరించేవారిని ప్రేమిస్తారు… అలాంటివారినే పెళ్లిచేసుకుంటారు. అంతగా తెలియనివారిని పెళ్లిచేసుకోవడం చాలా అరుదు.
ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ధనస్సు రాశివారు ఓ సర్కిల్ గీసుకుని అందులోనే ఉంటారు. తాము గీసుకున్న సర్కిల్లోకి ఎవరైనా రావాలి కానీ.. గీసిన గీత మాత్రం దాటరు. తొలిచూపులోనే అనే మాటే ఉండదు. ఒకటికి నాలుగుసార్లు ఆలోచించిన తర్వాత కానీ నిర్ణయం తీసుకోరు. ఎవర్ని ప్రేమించాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి... అన్నీ ఓ పద్ధతిగా ప్లాన్ చేసుకుంటారు. ఓ రకంగా చెప్పాలంటే ధనస్సు రాశివారు ప్రేమ వివాహాన్ని కూడా పెద్దలు కుదిర్చిన వివాహంలానే చేసుకోవాలని భావిస్తారు. వీళ్లలో తప్పుపట్టేందుకు కూడా ఏమీ దొరకదు. ఒకర్ని ప్రేమిస్తే ఆరు నూరైనా… నూరు నూటారైనా వాళ్లనే పెళ్లిచేసుకుంటారు. ఇచ్చిన మాటకు కట్టుబడే తరహా వ్యక్తిత్వం వీరిది.
మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) మకర రాశివారికి పెద్దలు కుదిర్చిన వివాహం అంటే అసలు ఇష్టపడరు. ప్రేమించడం కన్నా… ప్రేమను పొందడంలో ఆనందాన్ని వెతుక్కుంటారు. ఎవరైనా వచ్చి ప్రపొజ్ చేస్తే చాలు… ప్రేమిద్దాం పోయేదేముందని ఫిక్సైపోతారట. అలా అని ఆకతాయి ఆలోచన అనుకుంటే పొరపాటే. ప్రేమను పొందడమే కాదు జీవితాంతం ఆ ప్రేమను నిలబెట్టుకోవడంలోనూ మకరరాశి వారికి సాటిలేరని జ్యోతిష్య పండితులు అంటారు.
నోట్- ఒక రాశిలో ప్రస్తావించిన విషయాలన్నీ ఏ ఒక్కరికో చెందుతాయని భావించవద్దు. మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాలు మారొచ్చు. పూర్తి వ్యక్తిగత వివరాలకోసం అనుభవజ్ఞుడైన జ్యోతిష్యుడిని సంప్రదించగలరు….