Machilipatnam Railway Station History: ఒక తెలుగు గాయకుడు బ్రిటీష్ వాళ్ళని మెప్పించి తెచ్చిన మంచిలీపట్నం రైల్వే లైన్ కథ తెలుసా?
Machilipatnam Railway Station History: ఒక తెలుగు గాయకుడు బ్రిటీష్ వాళ్ళని మెప్పించి తెచ్చిన మంచిలీపట్నం రైల్వే లైన్ కథ తెలుసా?

Machilipatnam Railway Station History: ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ తర్వాత అంతటి ప్రముఖమైన రైల్వే స్టేషన్ "మచిలీపట్నం '. బందరు టౌన్, పోర్ట్‌ను ప్రధాన నగరాలతో కలిపే మచిలీపట్నం- విజయవాడ రైల్వే లైన్ ఆవిర్భవించడం వెనుక ఒక తెలుగు గాయకుడి కృషి ఉందన్న విషయం చాలా మందికి తెలియదు.ఆయనే "ఆంధ్ర గాయక పితామహ" గరికపర్తి కోటయ్య దేవర.
బందరులో పుట్టి నిజాం కొలువులో అస్థాన విద్వాంసుడుగా ఎదిగిన కోటయ్య దేవర
1864లో బందరులోని వీరశైవ జంగమ కుటుంబంలో జన్మించాడు కొటయ్య దేవర. ఈయన తండ్రి లక్ష్మయ్య ఫిడేలు బాగా వాయించేవారు. తల్లి పేరు బసవమ్మ. తన తండ్రి వద్ద చిన్నవయసు నుంచే సంగీతం నేర్చుకున్నారు కోటయ్య. ఆయనకు మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు బందరుకు ఉప్పెన వచ్చిన కారణంగా కరవు ఏర్పడింది. దీంతో తిండికి కష్టమైంది. దీంతో ఆయన తండ్రి మకాంను మచిలీపట్నం నుంచి హైదరాబాదుకు మార్చారు. అప్పటికి నిజాం నవాబు వద్ద దివానుగా పని చేస్తున్న సాలార్ జంగ్ స్వయంగా కోటయ్య దేవర సంగీత ప్రతిభ చూసి 10 ఏళ్లపాటు విద్య చెప్పించారు. ఆ తరువాత నిజాం కొలువులో చేరి 20 ఏళ్లపాటు అస్థాన విద్వాంసుడుగా పని చేశారు. కర్ణాటక సంగీతంతో పాటు వెస్ట్రన్ సంగీతంలో కూడా శిక్షణ పొంది దక్షిణ దేశ యాత్రలు చేశారు.
1894 నాటికి మద్రాస్, తంజావూర్ ప్రాంతాల్లో అనేక కచేరీలు చేసి సన్మానాలు, సత్కారాలు పొందారు. 1896లో పుట్టిన ఊరు బందరు చేరుకున్న కోటయ్య దేవర 300మంది విద్యార్థులతో సంగీత పాఠశాల ప్రారంభించారు. తన కచేరీల మీద వచ్చే డబ్బుతో విద్యార్థులకు ఉచితంగా సంగీతం నేర్పేవారు. ఆయనకు ఆర్ధికంగా చల్లపల్లి, వల్లూరు సంస్థానాల జమీందార్లు కూడా సహకరించేవారు. సురభి నాటక కంపెనీల నుంచి వచ్చిన వారికి నాదస్వరంలో శిక్షణ ఇచ్చి వారి ద్వారా 'సురభి' నాటకాల్లో నాద స్వరానికి ప్రాధాన్యత కలిగేలా చూశారు.
మచిలీపట్నానికి రైల్వే లైన్ కోటయ్య దేవర చలువే
1906లో మద్రాస్ గవర్నర్ ఆలీవర్ రస్సెల్ (Oliver Russell, 2nd Baron Ampthill) అధికార పర్యటనలో భాగంగా బందర్ వచ్చారు. ఆయన కోసం ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో ఇంగ్లీషులో ఒక ట్యూన్ కట్టి సొంతంగా పాట రాసి పాడారు కోటయ్యదేవర. అది చూసి ఆశ్చర్యపోయిన రస్సెల్ దొర ఏం కావాలో కోరుకో అని కోటయ్య దేవరను అడిగితే తనకు వ్యక్తిగతంగా ఏమీ వద్దు కానీ ఎప్పటి నుంచో బందరువాసులు అడుగుతున్న మచిలీపట్నం విజయవాడ రైల్వే లైన్ ఏర్పాటు చెయ్యమని కోరారు కోటయ్య. దానికి సరే అన్న రస్సెల్ వెంటనే దానిని మంజూరు చేశారు.
తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయినప్పటికీ అందరూ బందరు-గుడివాడ రైల్వే లైన్ (37km ) పనులను కొనసాగించింది బ్రిటిష్ ప్రభుత్వం. దానితో మచిలీపట్నం- గుడివాడ- విజయవాడ రైల్వే లింక్ పూర్తైంది. 1908 ఫిబ్రవరి 4 న మచిలీపట్నం నుంచి విజయవాడ లైన్‌లో మొదటిసారి రైలు నడిచింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని అతి ముఖ్యమైన రైల్వే స్టేషన్లో ఒకటి గా మచిలీపట్నం సేవలు అందిస్తోంది. అయితే ఈ రైల్వేలైన్ ఏర్పాటుకు ప్రధాన కారణమైన కోటయ్య దేవర గురించి ఈ తరంలో తెలిసిన వాళ్ళు తక్కువే. 1924లో ఆయన మరణించే నాటికి ఆయన వద్ద 600 మంది శిష్యులు ఉన్నారు. ఆయనకు నలుగురు కుమారులు. వారందరూ కూడా సంగీత వాయిద్యాలు తయారీలో సిద్ధ హస్తులే.





















