(Source: ECI/ABP News/ABP Majha)
Sidharth Luthra: ఇది చంద్రబాబును ఇరికించే ప్రయత్నమే, కీలక అంశం లేవనెత్తిన లాయర్ సిద్ధార్థ్ లుత్రా
చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లుత్రా వాదనలు వినిపిస్తూ.. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ అనేది పూర్తిగా రాజకీయ ప్రేరేపితం అని వాదించారు.
చంద్రబాబు అరెస్టు తర్వాత విజయవాడ ఏసీబీ కోర్టులో ఆయన్ని హాజరుపర్చిన అనంతరం ఉదయం 6 గంటల నుంచి సుదీర్ఘంగా వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబుపై 409 సెక్షన్ పై నమోదు చేయడంతో ఇరుపక్షాలు వాదనలు ఉదయం నుంచి జరుగుతున్నాయి. ఏపీ సీఐడీ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పి.సుధాకర్ రెడ్డి టీమ్ వాదనలు వినిపిస్తుండగా, చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లుత్రా వాదనలు వినిపిస్తున్నారు. 11 గంటల ప్రాంతంలో న్యాయమూర్తి రెండోసారి విరామం ప్రకటించారు. అనంతరం వాదనలు కొనసాగుతాయని చెప్పారు.
ఫోన్ సంభాషణలు బయటపెట్టాలని డిమాండ్
అంతకుముందు చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లుత్రా వాదనలు వినిపిస్తూ.. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ అనేది పూర్తిగా రాజకీయ ప్రేరేపితం అని వాదించారు. ఇది పూర్తిగా చంద్రబాబును ఇరికించే కుట్ర అని అన్నారు. చంద్రబాబు హక్కులకు భంగం కలిగించేలా సీఐడీ వ్యవహరించిందని లుత్రా వాదించారు. అరెస్టు చేసే ముందు కనీసం గవర్నర్ అనుమతి కూడా సీఐడీ అధికారులు తీసుకోలేదని లుత్రా కోర్టుకు వివరించారు. చంద్రబాబు అరెస్టుకు సంబంధించి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సీఐడీ అధికారులు ఫోన్లో మాట్లాడుకున్న సంభాషణలను కోర్టుకు సమర్పించాలని లుత్రా డిమాండ్ చేశారు. అంతేకాక, రిమాండ్ రిపోర్టు తిరస్కరించాలని లుత్రా కోరారు. ఈ సందర్భంగా గతంలో పంజాబ్ మణిందర్ సింగ్ కేసును కూడా లుత్రా ప్రస్తావించారు.
2021 డిసెంబరులో ఈ వ్యవహారంలో కేసు నమోదైతే అప్పుడు చంద్రబాబు పేరును ఎందుకు చేర్చలేదని కోర్టు కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయలేదో చెప్పాలని కోర్టు అడిగింది. రిమాండ్ రిపోర్టులో అన్ని అంశాలు చేర్చామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.
తిరిగి వాదనలు ప్రారంభం
ఏసీబీ కోర్టులో తిరిగి వాదనలు ప్రారంభం అయ్యాయి. 17ఏ మీద వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి కావాలని, గవర్నర్ అనుమతిని సీఐడీ తీసుకోలేదని సిద్ధార్థ్ లుత్రా కోర్టుకు తెలిపారు. పీసీయాక్ట్ లో వారం ముందుగా నోటీసులు ఇవ్వాలని చెప్పారు.
మరోవైపు, విజయవాడ ఏసీబీ కోర్టు దగ్గర హైఅలర్ట్ గా ఉంది. అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. కోర్టుకు వెళ్లే అన్ని దారుల్లో రాకపోకలు నిషేధించారు. లాయర్లకు మాత్రమే కోర్టు ప్రాంగణంలోకి అనుమతించారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు పరిసరాల్లో ఉన్న టీడీపీ నేతలను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలిస్తున్నారు. దీంతో టీడీపీ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటోంది. పోలీసు జులం నశించాలంటూ టీడీపీ నేతలు, కార్యకర్తల నినాదాలు చేస్తున్నారు.