Krishna Cockfight: ఉమ్మడి కృష్ణా జిల్లాలో జోరుగా కోడి పందాలు, అక్కడక్కడా బరులు ధ్వంసం
పోలీసుల ఆంక్షలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినప్పటికీ ఖాతరు చేయకుండా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కోడిపందాలు జోరుగా సాగాయి.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. పోలీసుల ఆంక్షలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినప్పటికీ ఖాతరు చేయకుండా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కోడిపందాలు జోరుగా సాగాయి.
జోరుమీద కోడి పందాలు..
సంక్రాంతి సంబరాలు మూడో రోజు కనుమను పురస్కరించుకుని అత్యంత ఘనంగా నిర్వహించారు. కనుమ వినోద ప్రధానమైన పండుగ కావడంతో పందెం రాయుళ్లకు అడ్డు అదుపు లేకుండా పోయింది. విజయవాడ శివారు సహా ఎన్టీఆర్, కృష్ణ జిల్లాల్లో ముమ్మరంగా కోడిపందాలు నిర్వహించారు. పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా యదేచ్చగా పందాలు కొనసాగాయి. బరుల వద్ద లక్షలాది రూపాయలు చేతులు మారాయి. కోడిపందాలతో పాటు పేకాట, గుండాట వంటి జూద క్రీడలు నిర్వహించారు. మద్యం మత్తులో కొన్నిచోట్ల దాడులకు సైతం తెగబడ్డారు. కృష్ణాజిల్లా పెడన లోని పల్లోటి స్కూల్ వద్ద నిర్వహించిన బరి అదుపుతప్పింది. బరి కమిటీ సభ్యులే ఓ వ్యక్తి పై దాడికి తెగబడ్డారు. కుర్చీలతో దాడికి పాల్పడడంతో తోటమూల గ్రామానికి చెందిన గొడవర్తి వాకలయ్య గాయపడ్డారు. ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
బరులు ధ్వంసం...
పోలీసుల కళ్ళు కప్పి కొన్నిచోట్ల కోడిపందాలు నిర్వహించినప్పటికీ మరికొన్నిచోట్ల పోలీసులు వీటిని నిలువరించారు. విజయవాడ శివారులో బరులు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు కోడిపందాల బరులను ధ్వంసం చేశారు. పందాలు నిర్వహించే వారికి హెచ్చరికలు జారీ చేశారు. అలాగే బంటుమిల్లి పెడన మండలాల్లో కూడా పోలీసులు కోడిపందాలపై ఉక్కు పాదం మోపారు. స్వయంగా రంగంలోకి దిగి బరులను ధ్వంసం చేశారు షామియానాలను తొలగించి పందాలు నిర్వహించకుండా నిలువరించారు.
ఇబ్రహీంపట్నంలో అధికార పార్టీ నేతల హల్ చల్...
ఇబ్రహీంపట్టణంలో కోడిపందాలు గుండాట, పేకాట శిబిరాలు యథేచ్ఛగా జరిగాయి. లక్షల్లో పందాలు పెట్టి కోట్లు దండుకుంటున్నారు. పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరించారని విమర్శలు తలెత్తుతున్నాయి. పోలీసులకు ముడుపులు ఇచ్చామంటూ నిర్వాహకులు బాహాటంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు కనువిందు చేయటమే సంక్రాంతి పండగ ఉద్దేశం అని నిర్వాహకులు చెప్తున్నారు. సంప్రదాయం కావడంతో పోలీసు శాఖ కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తుందన్న వాదన వినిపిస్తోంది.
అంబాపురంలో ఘర్షణ.. విజయవాడలో సంప్రదాయ బద్దంగా జరగాల్సిన సంక్రాంతి సంబరాలు వివాదాలకు కేంద్రం అయ్యాయి. అంబాపురం దగ్గర గల పాములు కాలువ సమీపాన ఏర్పాటు చేసిన కోడిపందాల్లో కొందరు యువకులు ఘర్షణ పడి బీభత్సం సృష్టించారు. కోడిపందాలు వద్ద ఏర్పడిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులకు పాల్పడ్డారు. కనుచూపు మేరలో కూడా పోలీసులు, రెవిన్యూ అధికారులూ కనపడకపోవడం విమర్శలకు తావిచ్చింది.
కొడాలి నాని ఆధ్వర్యాన సంక్రాంతి సంబరాలు.... ఎడ్ల బండలాగుడు పోటీలను తిలకించడం ఎంతో ఆనందంగా ఉందని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా అన్నారు. కన్నబిడ్డల మాదిరిగా పశువులను పోషిస్తున్న రైతులను ఆయన అభినందించారు. ఇలాంటి పోటీలు తిలకించడం వల్ల తమకు వృత్తిపరంగా ఎదురయ్యే ఒత్తిళ్లను మరచిపోతామని తెలిపారు.
మాజీమంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడ లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న ఎడ్ల బండలాగుడు పోటీలకు విశేష స్పందన లభిస్తుంది. సుదూర ప్రాంతాల నుంచి జనం విశేష సంఖ్యలో తరలివచ్చి ఈ పోటీలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా ఎడ్ల బండ్లలాగుడు పోటీలను స్వయంగా తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీలను తిలకించటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పశువులను కన్నబిడ్డలుగా భావించే రైతులను ఆయన అభినందించారు. జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్ళని అధిగమించేందుకు ఇలాంటి ఉత్సవాలలో పాల్గొనడం ఎంతైనా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పోలీసు శాఖలో ఉండే పని ఒత్తిడి మరిచిపోయేందుకు ఈ తరహా పోటీలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.