AP News: జగన్ సర్కార్‌కి కేంద్రం పిడుగులాంటి వార్త! దెబ్బమీద దెబ్బతో మళ్లీ ఝలక్
విభజన చట్టంలోని హామీల అంశంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆధ్వర్యంలో రాష్ట్ర అధికారులతో మంగళవారం (సెప్టెంబరు 28) ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది.
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఓ పిడుగు లాంటి వార్త చెప్పింది. విశాఖపట్నానికి రైల్వే జోన్ సాధ్యం కాదని తేల్చి చెప్పింది. విభజన చట్టంలోని హామీల అంశంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆధ్వర్యంలో రాష్ట్ర అధికారులతో మంగళవారం (సెప్టెంబరు 28) ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. ఇందులో తెలంగాణ అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగానే విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు లాభదాయకం కాదని, అందుకే ఆ డీపీఆర్‌ను ఆమోదించలేదని వారు చెప్పినట్లు తెలిసింది. అసలే విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించిన తర్వాత ఇప్పటికే ఊసూరుమంటున్న ప్రజలకి వెంటనే దెబ్బ మీద దెబ్బ తరహాలో ఈ వార్త ఝలక్ ఇచ్చినట్లయింది.
విశాఖ రైల్వే జోన్ సాధ్యం కాదని కేంద్రం చెప్పడంతో ఏపీ సీఎస్ సమీర్ శర్మ ఆధ్వర్యంలోని బృందం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. లాభం కాదనే దానికి చట్టపరంగా హామీ ఇచ్చారని, లాభాలు వస్తే ఏ చట్టంతో అవసరం లేకుండా రైల్వేశాఖ జోన్ ఏర్పాటు చేసేదని చెప్పారు. లాభం లేకపోయినా రాజకీయ కారణాల వల్ల కేంద్రం.. దేశంలో ఎన్నో జోన్లను ఏర్పాటు చేసిందని వారు గుర్తు చేశారు. అందువల్ల విశాఖ జోన్ విషయంలోనూ అదే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ సమయంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి జోక్యం చేసుకుంటూ జోన్ ఏర్పాటు సాధ్యం కాదన్న నిర్ణయం మీ స్థాయిలోనే తీసుకోవద్దని, ఆ విషయాన్ని కేబినెట్ ముందు పెడితే, దానిపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని సూచించినట్లు తెలిసింది.
రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు ఇస్తామన్నారని గతంలో హామీ ఇచ్చినందున, ఇప్పటివరకు రూ.1,500 కోట్లు ఇచ్చారని, మిగిలిన రూ.వెయ్యి కోట్లను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర అధికారులు తెలిపారు. అందుకు కేంద్ర అధికారులు స్పందిస్తూ ఇప్పటిదాకా రాజధాని కోసం చేసిన ఖర్చుల లెక్కలు సమర్పిస్తే మిగిలిన నిధుల గురించి ఆలోచిస్తామని చెప్పారు.
వెనకబడ్డ జిల్లాల గురించి
ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధుల గురించి కూడా రాష్ట్ర అధికారులు కేంద్రాన్ని అడిగారు. అయితే, నీతి ఆయోగ్ అయిదేళ్లకే ఆ నిధులను సిఫార్సు చేసిందని, ఇప్పటికే ఆ మొత్తం ఇచ్చామని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇప్పటివరకు రూ.1,750 కోట్లు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.1,049 కోట్లకే ఖర్చులకు సంబంధించి పత్రాలు ఇచ్చిందని, మిగిలిన లెక్కలు చెప్తే ఆ నిర్ణయాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నట్లు తెలిసింది. ఈ సమావేశంపై ఏపీ ప్రభుత్వ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో ఏపీ తరపున సీఎస్ సమీర్ శర్మ, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్, ఆర్థికశాఖ కార్యదర్శి నటరాజ్ గుల్జార్, రోడ్లు, భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవన్, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి అరుణ్ కుమార్, జీఏడీ ముఖ్యకార్యదర్శి ప్రేమచంద్రారెడ్డి, దిల్లీలో ఏపీ భవన్ చీఫ్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ పాల్గొన్నారు.