Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్, ఈ స్టిక్కర్లతో ఉన్న వాహనాలకు కొండపైకి నో ఎంట్రీ
Tirumala : తిరుమలలో తొలిసారిగా హనుమజ్జయంతి ఉత్సవాలను నిర్వహిస్తుంది టీటీడీ. ఈ నెల 25 నుంచి 29 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. అయితే భక్తులకు టీటీడీ ఓ విజ్ఞప్తి చేసింది.
Tirumala : తిరుమలలో తొలిసారి హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు హనుమజ్జయంతిని వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ అదనపు ఈవో ఏవీ.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం హనుమజ్జయంతి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ.. హనుమంతుని జన్మస్థలమైన అంజనాద్రిలోని ఆకాశగంగ వద్ద, జాపాలీ తీర్థం, నాదనీరాజనం వేదిక, ఎస్వీ వేద పాఠశాలలో కార్యక్రమాలు నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. మే 29న ధర్మగిరి వేదపాఠశాలలో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించేందుకు ఆయా విభాగాల అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు.
నాలుగు ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం
ఉత్సవాల నిర్వహణ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ కార్యక్రమాలను వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీ నాలుగు ఛానళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని అదనపు ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశంచారు. ఈ ఉత్సవానికి సంబంధించి ఆకట్టుకునేలా ప్రోమో రూపొందించాలని కోరారు. నాదనీరాజనం వేదికపై నిర్వహించే ప్రవచనాలకు సంబంధించి ఆచార్య రాణి సదాశివమూర్తి, డా. ఆకెళ్ల విభీషణశర్మ, పవనకుమార శర్మ తదితర పండితులను భాగస్వాములను చేయాలన్నారు. అంజనాద్రి వైభవం, ఇతిహాస హనుమద్విజయం, యోగాంజనేయం, వీరాంజనేయం, భక్తాంజనేయం పలు అంశాలపై ప్రవచనాలు ఉంటాయన్నారు. ఏర్పాట్లకు సంబంధించి ఇంజినీరింగ్, అన్నదానం, ధర్మప్రచార పరిషత్, ఎస్వీ వేద పాఠశాల, భద్రతా విభాగం, పీఆర్వో, ఎస్వీబీసీ విభాగాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే
అలాంటి వాహనాలకు అనుమతి లేదు
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వారి వాహనాలకు వ్యక్తుల ఫొటోలు, రాజకీయ పార్టీల జెండాలు, అన్యమత చిహ్నాలతో తిరుమలకు రావొద్దని టీటీడీ కోరింది. అలాంటి వాహనాలను అలిపిరి వద్దే నిలిపివేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ విధానాన్ని టీటీడీ ఎన్నో దశాబ్దాలుగా అనుసరిస్తుందని వెల్లడించింది. అయితే ఈ మధ్యకాలంలో అవగాహన లేక కొన్ని వాహనాలపై వ్యక్తుల ఫొటోలు, పార్టీ జెండాలు, అన్యమత చిహ్నాలతో వస్తున్నారని పేర్కొంది. వాహనదారులకు ఈ విషయం వివరించి విజిలెన్స్ సిబ్బంది వాటిని తొలగిస్తున్నారని టీటీడీ తెలిపింది. ఇకపై వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తులు ఇలాంటి స్టిక్కర్లు లేకుండా రావాలని కోరింది. భక్తులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా తితిదే విజ్ఞప్తి చేసింది.
Also Read: సర్ప దోషాలన్నీ తొలగించే ఆలయం, ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరిచి ఉంటుంది