Kothapalli Geetha News: మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు తెలంగాణ హైకోర్టు ఊరట, ఎన్నికల్లో పోటీకి లైన్ క్లియర్
Andhra Pradesh News: పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించి రుణం పొందారన్న కేసులో మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు 5 ఏళ్లు శిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. ఆ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది.
Telangana High Court gives stay on Kothapalli Geetha CBI case: హైదరాబాద్: మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గతంలో సీబీఐ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు సోమవారం (మార్చి 11న) స్టే విధించింది. ఓ కేసులో నిందితురాలిగా ఉన్న కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించడం తెలిసిందే. సీబీఐ కోర్టు సెప్టెంబర్ 13, 2022న తీర్పు వెలువరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించి రుణం పొందారన్న కేసులో కొత్తపల్లి గీతతో పాటు ఆమె భర్తకు, మరో ఇద్దరికి గతంలో సీబీఐ కోర్టు అయిదేళ్లు శిక్ష విధిస్తూ తీర్పిచ్చింది.
సీబీఐ కోర్టు ఉత్తర్వులపై మాజీ ఎంపీ కొత్తపల్లి గీత తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని కొత్తపత్తి గీత తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. కానీ సీబీఐ కోర్టు ఉత్తర్వుల కారణంగా ఆమె పోటీకి అనర్హులయ్యే అవకాశం ఉందని న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కొత్తపల్లి గీతకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు వీలు కల్పిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.
రెండు రోజుల్లోనే బెయిల్ మంజూరు
బ్యాంక్ రుణాల ఎగవేత కేసులో సీబీఐ కోర్టులో శిక్ష పడిన కొత్తపల్లి గీత దంపతులకు హైకోర్టులో ఊరట లభించింది. 2022 సెప్టెంబర్ నెలలో వీరికి బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని గీత దంపతులను హైకోర్టు ఆదేశించింది. బ్యాంకును మోసం చేశారన్న కేసులో గీత, ఆమె భర్త రామకోటేశ్వరరావుకు న్యాయస్థానం ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. చెరో రూ.లక్ష జరిమానా విధిస్తూ నాంపల్లి సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో బ్యాంకు అధికారులు బీకే జయప్రకాశం, కేకే అరవిందాక్షన్‌కు కూడా ఐదేళ్ల జైలుశిక్ష, నిందితుల జాబితాలో ఉన్న విశ్వేశ్వర ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.2 లక్షల జరిమానా విధించింది.
సీబీఐ కోర్టు శిక్షను హైకోర్టులో సవాల్ చేసిన కొత్తపల్లి గీత
సీబీఐ కోర్టు తీర్పును కొత్తపల్లి గీత దంపతులు హైకోర్టులో సవాల్ చేశారు. సీబీఐ కోర్టు తీర్పు అమలు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబరు 16వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.కొత్తపల్లి గీత, రామకోటేశ్వరరావు డైరెక్టర్లుగా ఉన్న ఆ విశ్వేశ్వర ఇన్‌ఫ్రా కంపెనీ 2008లో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.42 కోట్ల రుణం పొందారు. తప్పుడు పత్రాలు సమర్పించడంతోపాటు కొందరు బ్యాంకు అధికారులతో కుమ్మక్కై బ్యాంకును మోసం చేశారని అభియోగం నమోదైంది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు 2015లో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది.
తప్పుడు డాక్యుమెంట్లతో రుణాలు
ఆ రుణం ద్వారా పొందిన డబ్బును సొంత అవసరాలకు మళ్లించినట్లు బ్యాంకు గుర్తించి సీబీఐకి అధారాలు ఇచ్చింది. వీరిని దోషులుగా గుర్తించి జైలుశిక్ష, జరిమానా విధించింది. తీర్పు వెలుపడినప్పటికీ అనారోగ్యం కారణంగా కొత్తపల్లి గీతకు పోలీసులు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య చికిత్స చేయించి.. జైలుకు తీసుకెళ్లారు. రామకోటేశ్వరరావును, ఇద్దరు మాజీ బ్యాంకు అధికారులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే రెండు రోజుల్లోనే బెయిల్ రావడంతో ఆమె బెయిల్ మీద విడుదలయ్యారు.