Chandrababu Letter To AP DGP: జంట హత్యల కేసులో బెదిరింపులు.. సాక్షులను రక్షించాలని డీజీపీకి చంద్రబాబు లేఖ
పెసరవాయిలో జరిగిన నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్ రెడ్డి జంట హత్య కేసులో సాక్షులను బెదిరిస్తున్నారని, ఈ దుర్మార్గాలకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని మాజీ సీఎం చంద్రబాబు కోరారు.
Chandrababu Letter To AP DGP: ఏపీలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ జంట హత్యల కేసులో సాక్షులపై బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీని చంద్రబాబు కోరారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు టీడీపీ అధినేత లేఖ రాశారు.
కర్నూలు జిల్లాలో జూన్ 17వ తేదీన ఇద్దరు వ్యక్తులను వైఎస్సార్‌సీపీ గూండాలు దారుణంగా హత్య చేశారని చంద్రబాబు ఆరోపించారు. పెసరవాయిలో జరిగిన నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్ రెడ్డి జంట హత్యల కేసులో సాక్షులను బెదిరిస్తున్నారని, ఈ దుర్మార్గాలకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. హత్యలు జరిగి నెలన్నర గడుస్తున్నా నిందితులను అరెస్ట్ చేయలేదని, ప్రస్తుతం బాధితుల కుటుంబసభ్యులతో పాటు కేసులో సాక్షులపై సైతం కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని తన లేఖలో తెలిపారు. ఈ చర్యలకు పాల్పడుతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకుని, బాధితులకు, సాక్షులకు రక్షణ కల్పించాలని చంద్రబాబు.. ఏపీ డీజీపీని కోరారు. వారి ఆస్తులపై సైతం దాడులు జరిగే అవకాశం ఉందని చంద్రబాబు ఆందోళ వ్యక్తం చేశారు.
Also Read: AP New DA: ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు.. ఆ రెండూ ఒకేసారి పెంచుతూ ఉత్తర్వులు
వారి సోదరుడు మోహన్ రెడ్డికి నివాళులు అర్పించడానికి వెళ్లిన సమయంలో వైసీపీ నేతలు వారిని వెంటాడి హత్య చేశారని ఆరోపించారు. ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిని ఇప్పటివరకూ ఎందుకు అరెస్ట్ చేయలేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులకు సమాజంలో చోటు ఉండకూడదన్నారు. నేరస్థులను తక్షణమే అరెస్టు చేసి.. హత్యకు గురైన నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్ రెడ్డి కుటుంబసభ్యులకు, ఈ కేసులో సాక్షులకు కూడా రక్షణ కల్పించాలని ఏపీ డీజీపీని చంద్రబాబు తన లేఖ ద్వారా డిమాండ్ చేశారు.
కాగా, కర్నూలు జిల్లా పెసరవాయిలో టీడీపీ నేతలు నాగేశ్వర రెడ్డి, ప్రతాప రెడ్డిలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు జూన్ నెలలో వేటకొడవళ్లతో నరికి దారుణంగా హత్యచేశారు. అన్నదమ్ములను కారుతో ఢీకొట్టి.. వెంటపడి వేటకొడవళ్లతో నరికి హత్య చేసిన వ్యక్తులను కనీసం అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు హత్యలతో సంబంధం ఉందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో క్షీణించాయని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.