RK Roja: ఏపీలోని తమిళుల సమస్యలు పరిష్కరించండి, సీఎం స్టాలిన్ ను కలిసిన ఎమ్మెల్యే రోజా
నగరి ఎమ్మెల్యే రోజా సెల్వమణి దంపతులు తమిళనాడు సీఎం స్టాలిన్ ఇవాళ కలిశారు. చిత్తూరు, నెల్లూరులోని తమిళులకు తమిళనాడులోని జనరల్ హాస్పిటల్స్ లో ప్రభుత్వ సౌకర్యాలు వర్తింపజేయాలని కోరారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిసిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సెల్వమణి దంపతులు కలిశారు. ఇవాళ చెన్నైలోని సీఎం కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పట్టు వస్త్రంతో సత్కరించారు. నగిరి చేనేత కార్మికుల చేత ప్రత్యేకంగా స్టాలిన్ ప్రతిమను పట్టువస్త్రంపై నేసిన శాలువను ఆయనకు బహుకరించారు. అనంతరం దాదాపు అర్ధ గంట పాటు ఆంధ్రాలో నివసిస్తున్న తమిళుల సమస్యలపై నగిరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా తమిళనాడు సీఎంతో చర్చించారు. సీఎంతో భేటీ అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో ఉండి తమిళ మీడియంలో చదువుతున్న విద్యార్థులకు తమిళ పాఠ్యపుస్తకాలు(మెట్రిక్యులేషన్ సిలబస్ ) ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒక్కొక్క తరగతికి 1000 చొప్పున మంజూరు చేయాలని కోరామని తెలిపారు.
టెక్స్ టైల్ రంగానికి ఊతం
ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా సుమారు 5 వేల ఎనిమిది వందల ఎకరాల విస్తీర్ణంలో కొసలనగరం పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడికి తమిళనాడు నుంచి పరిశ్రమలు రావడానికి, భారీ వాహనాల ట్రాన్స్పోర్టేషన్ రాకపోకలకు అనువుగా నేడుంబరం-అరక్కోణం రోడ్డు ఎన్ హెచ్ 716 నుంచి ఇండస్ట్రియల్ పార్కు చేరడానికి అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి తమిళనాడు సీఎం అనుమతులు కోరి ప్రతిపాదనలు పంపామని రోజా దంపతులు తెలిపారు. ముఖ్యంగా ఆంధ్ర-తమిళనాడు రాష్ట్రాలలో హ్యాండ్లూమ్, పవర్ లూమ్ కార్మికులు ఒక కోటికి పైగా ఉన్నారని కరోనా తర్వాత ప్రపంచ దేశాలు టెక్స్ టైల్స్ ను చైనా దేశం నుంచి దిగుమతి చేసుకోకపోవడం కారణంగా టెక్స్ టైల్ అవసరాలను దక్షిణ భారతదేశంలోని చేనేత మరమగ్గాల కార్మికులకు ఉపాధి కల్పించడం ద్వారా ప్రపంచ దేశాల అవసరాలను తీర్చడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
చిత్తూరు, నెల్లూరు తమిళుల కోసం
ఈ ప్రతిపాదన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో కూడా గతంలో చర్చించామని, దీనిపై తగు సూచనలు, చర్యలు తీసుకోవాలని తమిళనాడు సీఎంని కోరినట్లు రోజా సెల్వమణి తెలిపారు. అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో నివాసిస్తున్న తమిళ కుటుంబీకులు చెన్నై మహానగరం తోనూ తమిళనాడులోని ప్రధాన పట్టణాల్లోనూ బంధుత్వ పరంగా, వ్యాపారపరంగా చాలా ఎక్కువ లావాదేవీలు కలిగి ఉన్నారన్నారు. అటువంటి వారికి తమిళనాడులో జనరల్ హాస్పిటల్స్ లో తమిళులకు ఉన్న సౌకర్యాలు అన్నింటిని కూడా చిత్తూరు, నెల్లూరు జిల్లాలో ఉన్న తమిళ కుటుంబీకులకు వర్తింపజేయాలని రోజా సీఎం స్టాలిన్ ను కోరారు. తమిళనాడు సీఎం దృష్టికి తీసుకెళ్లిన ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించి తగ్గు చర్యలు తీసుకుంటామని తమిళనాడు సీఎం హామీ ఇచ్చినట్లు రోజా తెలిపారు.