Crime News: ఒక్కడి మర్డర్‌కు ప్లాన్ చేసి ఐదుగురిని చంపేశాడు, ప్రమాదంగా మార్చేశాడు, తూర్పుగోదావరి జీలుగు కల్లు కేసులో షాకింగ్ ఫ్యాక్ట్స్
వివాహేతర సంబంధాలు మనిషి ప్రాణాలను సైతం తీసేందుకు ప్రేరేపిస్తున్నాయి. పోలీసులను డైవర్ట్ చేయడానికి ఎంతకైనా తెగిస్తారు. దీనికి కరెక్ట్ ఎగ్జాంపుల్ తూర్పుగోదావరి ఘటన.
మొన్నీ మధ్య తూర్పుగోదావరి జిల్లాలోని రాజవొమ్మంగి మండలం లోదొడ్డిలో జీలుగు కళ్లు తాగి ఐదుగురు చనిపోయిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. ఉదయాన్నే వెళ్లి జీలుగు కల్లు తాగిన ఐదుగురిలో ఇద్దరు మార్గమధ్యలో చనిపోగా... ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. దీనిపై కేసు నమోదు చేసి విచారించిన పోలీసులుకు షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.
వివాహేతర సంబంధం కారణంగా ఓ వ్యక్తిని చంపేందుకు వేసిన ఉచ్చులో మరో నలుగురు చిక్కుకున్నారు. మొత్తానికి ఈ మారణకాండను ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించడం ఈ కేసులో అసలు ట్విస్ట్.
తూర్పుగోదావరి జిల్లాలో జీలుగు కల్లు తాగి ఐదుగురు మృతి చెందిన ఘటనలో అసలు కారణం వివాహేతర సంబంధమే కారణంగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వాళ్లు తాగిన జీలుగు కల్లు శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన పోలీసులకు దిమ్మ తిరిగే వాస్తవాలు కనిపించాయి. జిలుగ కల్లులో క్రిమిసంహారక మందు కలిసినట్లు రిపోర్టు వచ్చింది.
జీలుగ చెట్టు నుంచి తీసిన కల్లు తాగితే చనిపోయే అవకాశం లేకపోగా దీని వెనుక ఏదో కుట్ర కోణం దాగి ఉందని అనుమానించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. ఇదేదో తేడాగా ఉందని గ్రహించిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. నాలుగు కుటుంబాలను పిలిచి విచారించిన పోలీసులకు ఓ వ్యక్తి భార్యపై అనుమానం వచ్చింది. మృతుల్లో ఒకడైన గంగరాజు అనే వ్యక్తి భార్యపై అనుమానంతో కూపీ లాగితే మర్డర్ ప్లాన్ వెలుగు చూసింది.
లోదొడ్డి ప్రాంతానికి చెందిన రాంబాబు అనే వ్యక్తికి మృతుడు గంగరాజు భార్యతో వివాహేతర సంబంధం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. రాంబాబును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులకు జీలుగు కళ్ళు విషాదం వెనుక అసలు గుట్టు బయటపడింది.
గంగరాజునుచంపటానికి రాంబాబు కావాలనే జీలుగ కల్లులో పురుగుల మందు కలిపినట్లుగా పోలీసులు దర్యాప్తులో తేలింది. అది తెలియక ఆ కల్లు తాగిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అలా ఒకరిని చంపటానికి కల్లులో అత్యంత విషపూరితమైన కలుపు మందు కలిపి అయిదుగురు ప్రాణాలు తీశాడు రాంబాబు.
వివాహేతర సంబంధంతో తన టార్గెట్ అయిన గంగరాజును చంపేందుకు సిద్ధ పడటమే కాకుండా కేసును తప్పుదోవ పట్టించేందుకు అతనితో ఉన్న మరో నలుగురు ప్రాణాలు తీశాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన రాంబాబుతోపాటు మృతుడు గంగరాజు భార్య, ఇంకా మరెవరైనా పాత్ర ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీన్ని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.