Kavitha in Konaseema: కోనసీమలో కేసీఆర్ కుమార్తె కవిత సందడి - ముత్యాలమ్మ అమ్మవారి దర్శనం
Konaseema District: కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమె తమ గ్రామానికి రావడంతో గ్రామస్థులంతా ఆనందం వ్యక్తం చేశారు.
Mutyalamma Talli Temple: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. పి. గన్నవరం మండలంలోని ముంగండ అనే గ్రామానికి వచ్చారు. గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి ఆలయ విగ్రహ పున:ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ఆమె ఆలయానికి వచ్చారు. కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమె తమ గ్రామానికి రావడంతో గ్రామస్థులంతా ఆనందం వ్యక్తం చేశారు.
ఈ ఆలయ పున:ప్రతిష్ఠ కార్యక్రమంలో తాను పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ముత్యాలమ్మ అమ్మవారి ఆలయానికి 400 ఏళ్ల చరిత్ర ఉందని.. అలాంటి ఆలయ పున:ప్రతిష్ఠలో పాల్గొని, అమ్మవారి దర్శనం చేసుకోవడం పూర్వజన్మ సుకృతం అని అన్నారు. బ్రిటీష్ హాయాంలో కూడా ముంగండ గ్రామ ప్రజలు ఎంతో ధైర్యం ప్రదర్శించి ఆలయాలను కాపాడుకున్నారని కొనియాడారు. ముత్యాలమ్మ అమ్మవారు ముంగండ గ్రామాన్ని మాత్రమే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని కవిత అన్నారు. అమ్మవారి దయతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. తనకు ముత్యాలమ్మ అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించినందుకు ముంగండ గ్రామస్థులకు కవిత ధన్యవాదాలు తెలిపారు.