Jangareddy Gudem: ఆరోగ్యంగా ఉన్నవాళ్లు సహజంగా ఎలా చనిపోతారు? బోరుమన్న జంగారెడ్డి గూడెం బాధితులు
ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న జంగారెడ్డి గూడెంలో ఏం జరుగుతోంది? నాటు సారా ఏరులై పారుతోందా? ప్రజలు ఏమంటున్నారు? అక్కడ చావులన్నీ సహజమరణాలేనా? ఏబీపీ దేశం గ్రౌండ్ రిపోర్ట్‌లో ఏం తేలింది?
అప్పటి వరకు ఆరోగ్యంగా తిరుగుతూ పనిచేసుకునే వాడు ఉన్నఫళంగా ఎలా చనిపోతాడు..? ఈ సంఘటన జరగకముందు రోజూలానే ఇంటికి వచ్చాడు.. ఒంట్లో చాలా తేడాగా ఉందని చెప్పాడు.. అంతలోనే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.. వికారంగా ఉంది.. ఊపిరి ఆడడం లేదు.. అంటూ చెప్పాడు.. ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితంలేదు.. చివరకు చనిపోయాడు.. ఈ మరణాలు కచ్చితంగా నాటు సారా వల్లనే సంభవించాయి.. అంటూ బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
బాధితులకు కట్టడి
పశ్చిమగోదావరి జిల్లా సంగారెడ్డి గూడెంలో వరుస మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించిన సంఘటన తెలిసిందే. అయితే ఈ సంఘటనపై బాధిత కుటుంబాలు, ప్రతిషక్షాలు ఈ మరణాలు ముమ్మాటికీ నాటు సారా సేవించడం వల్లనే జరిగాయని చెబుతున్నాయి. ప్రభుత్వం మాత్రం బాధితులు విపరీతమైన హాల్కాలిక్స్ అని, వారికి దీర్ఘకాలిక అనారోగ్యాలున్నాయని, ఈ మరణాలను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని చెబుతోంది. స్థానికంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య వైద్యాధికారులు, సిబ్బంది, చివరకు పేరు వెల్లడించడానికి ఇష్టపడని పోలీసు అధికారులు కూడా ఇదే మాటచెబుతున్నారు..
ఈసంఘటనపై ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్ధిక సాయం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సంఘటనపై జ్యుడీషియల్ విచారణ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు కుటుంబాలకు హామీ ఇచ్చారు. జనసేన పార్టీ ముఖ్యనాయకుడు నాదెండ్ల మనోహర్, పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు కూడా బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్ధిక సాయం అందచేశారు..
జంగారెడ్డి గూడెంలో బాదితులకు ఆంక్షలు..?
జంగారెడ్డి గూడెంలో వరుస మరణాల సంఘటనపై బాధిత కుటుంబాలను ఎవ్వరిని కదిపినా కన్నీటి పర్యాంతమవుతున్నారు. అయితే ఈ మరణాలపై మాత్రం వివరాలు వెల్లడించేందుకు ఇష్టపడడం లేదు. తమకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇక మేమేమీ చెప్పలేమని తేల్చి చెబుతున్నారు. ఏబీపీ దేశం బాధితుల వద్దకు వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయగా రెండు బాధిత కుటుంబాలు మాత్రమే జరిగింది చెప్పేందుకు భయం ఎందుకు అంటూ ముందుకు వచ్చి ఆరోజు జరిగిన సంఘటనను వెల్లడించారు.
వామపక్షాల నాయకులు నిరసనలు..
జంగారెడ్డి గూడెంలో వరుస మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని యాక్తివిస్టులు, వామపక్ష నాయకులు, ఐద్వా నాయకులు ఆరోపిస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో విచ్చలవిడిగా నాటు సారా విక్రయాలు జరుగుతున్నాయని, దీనిని ప్రభుత్వం అరికట్టడంలో పూర్తి వైఫల్యమైందని పైగా ఈ మరణాలన్నీ సహజ మరణాలేనని చెప్పడం దారుణమని మండిపడ్డారు. జంగారెడ్డి గూడెం ఎస్ఈబీ కార్యాలయం వద్ద నిరసనలు తెలిపారు. ఈసంఘటనపై జ్యూడిషియల్ విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు..
జంగారెడ్డి గూడెం వరుస మరణాల సంఘటనపై పైకి ఇవి నాటుసారా వల్లన కాదు అంటూనే పోలీసులు నాటు సారా కేంద్రాలపై దాడులు నిర్వహిస్తున్నారు. దీనిపై ఇంచార్జి డీఎస్పీ హరికిరణ్‌ను వివరణ కోరగా నాటు సారా కేంద్రాలపైన, తయారీ దారులపైనా ప్రత్యేకంగా అంటూ దాడులు నిర్వహించడం లేదని, తమకు అందుతున్న సమాచారం మేరకు సాధారణ దాడుల్లో భాగంగానే దాడులు నిర్వహించి కొందరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
జంగారెడ్డి గూడెం సబ్ డివిజన్ పరిధిలో గత మూడు రోజుల్లో 45 కేసులు నమోదయ్యాయని, 59 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు ఎస్‌ఈబీ సిబ్బంది. 510 లీటర్లు నాటుసారా స్వాధీనం చేసుకోగా 9,850 లీటర్లు బెల్లం ఊట ధ్వంసం చేశామని, నాలుగు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ లక్షా 19 వేల 650 రూపాయల విలువ ఉంటుందని వెల్లడించారు.