Achuthapuram SEZ: అచ్యుతాపురం ప్రమాద ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు - రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు
Andhra News: అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. దీనిపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీ, సీఎస్‌లకు నోటీసులు జారీ చేసింది.
NHRC Notices On Achuthapuram SEZ Accident: అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై (Atchuthapuram Incident) జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) స్పందించింది. దీనిపై సుమోటోగా కేసు నమోదు చేసిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ.. డీజీపీ, సీఎస్‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసి రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. యాజమాన్యం నిర్లక్ష్యం, ఇతర అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని విచారణ చేయాలని సూచించింది. కాగా, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో ఈ నెల 21న (బుధవారం) జరిగిన ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోగా.. 36 మంది గాయపడ్డారు. ఉదయం షిప్టు వారు పనులు ముగించుకొని సాయంత్రం షిఫ్టు వారు విధుల్లోకి వస్తోన్న క్రమంలో రియాక్టర్ పేలడంతో ఈ విషాదం చోటు చేసుకుంది.
ప్రమాద ధాటికి కంపెనీ పై కప్పు కూడా ఒక్కసారిగా కుప్పకూలి గందరగోళం నెలకొంది. కొన్ని మృతదేహాలు గుర్తు పట్టలేనంతంగా ఛిద్రమైపోయాయి. అటు, ఈ ఘటనపై ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ కమిటీ వేసింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.50 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.25 లక్షల పరిహారం అందించింది. రాష్ట్రానికి పరిశ్రమలు రావడమే కాకుండా ప్రజల భద్రత కూడా తమకు తొలి ప్రాధాన్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. రెడ్ కేటగిరీలోని పరిశ్రమలు తప్పకుండా సేఫ్టీ ఆడిట్ జరిపించాలని స్పష్టం చేశారు. గత ఐదేళ్లుగా పరిశ్రమలను జగన్ ప్రభుత్వం లూటీ చేసిందని.. అందుకే ప్రమాదాలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలుంటాయని చెప్పారు.
Also Read: Anakapalli News: పరవాడ ఫార్మా సెజ్‌లో ప్రమాదం- నలుగురికి తీవ్ర గాయాలు- ఒకరి పరిస్థితి విషమం