(Source: ECI/ABP News/ABP Majha)
నెల్లూరులో రోడ్ టెర్రర్.. పోలీసులు ఏం చేస్తున్నారంటే...?
చిలకలూరు పేట నుంచి నెల్లూరు వరకు హైవేపై రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, హైవే అథారిటీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా నుంచి రెండు ప్రధాన రహదారులు వెళ్తుంటాయి. విజయవాడ టు చెన్నై రహదారి ఒకటి కాగా, నెల్లూరు ముంబై రహదారి రెండోది. ఈ రెండు రహదారులపై నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇటీవల కాలంలో ఈ ప్రమాదాల సంఖ్య భారీగా పెరిగింది. రహదారులతో కలిసి జిల్లా రోడ్ల వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని నివారించేందుకు పోలీసులు కృషిచేస్తున్నా కూడా పెద్దగా ఫలితం ఉండటంలేదు. ఇకపై ప్రమాదాల నివారణకు మరిన్ని రక్షణాత్మక చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు జిల్లా ఎస్పీ విజయరావు. “రోడ్డు భద్రతా – ప్రమాదాల నియంత్రణ” పై ప్రిన్సిపల్ సెక్రటరీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆయన.. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
చిలకలూరు పేట నుంచి నెల్లూరు వరకు హైవేపై రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, హైవే అథారిటీ అధికారులు, ఇతర విభాగాధిపతులు, సేవ్ లైఫ్ ఫౌండేషన్ తో కలసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సంయుక్తంగా వ్యూహరచనలు చేయాలని, మరణాల రేటు తగ్గించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేయాలని సూచించారు ప్రిన్సిపల్ సెక్రటరీ. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల అధికారుల నుంచి సలహాలు స్వీకరించారు. సేవ్ లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు రోడ్డు ప్రమాదాల నివారణ, ముందు జాగ్రత్తలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
నెల్లూరు జిల్లా పరిధిలో తీసుకుంటున్న చర్యలు..
- నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలను జిల్లా ఎస్పీ విజయరావు వివరించారు.
- జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని చెప్పారు ఎస్పీ.
- నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుట, రాంగ్ పార్కింగ్, హైవేపై వాహనాలకు గేదెలు అడ్డు రావడమే ప్రమాదాలకు ముఖ్య కారణాలుగా తేల్చారు.
- నెల్లూరు జిల్లా వ్యాప్తంగా హైవేల పై 12 పోలీస్ స్టేషన్ ల పరిధిలో 18 బ్లాక్ స్పాట్ ల గుర్తింపు.
- బ్లాక్ స్పాట్ ల వద్ద ప్రమాదాల నివారణకోసం ప్రత్యేక చర్యలు.
- 38 వలనరబుల్ లొకేషన్స్ గుర్తించి అక్కడ ప్రమాదాల నివారణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం.
- రేడియం జాకెట్స్, డ్రమ్స్ ఏర్పాటు చేయడం
- ప్రతి నెలా అన్ని విభాగాలతో సమన్వయ సమావేశాలు నిర్వహించడం.
- ప్రమాదాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, చైతన్య కార్యక్రమాలు, రోడ్ సేఫ్టీ పరికరాల సేకరణ వాటి ఉపయోగం, తదితర అంశాలపై వివరణ.
- ప్రమాదం జరిగిన 15 నిముషాలలో అంబులెన్స్ సేవలు మరింత చేరువయ్యేలా చూడటం.
ఇలాంటి కార్యక్రమాలతో నెల్లూరు జిల్లాలో ప్రమాదాల నియంత్రణకు కృషి చేస్తున్నామని చెప్పారు జిల్లా ఎస్పీ విజయరావు.