AB Venkateswara Rao : ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ హైకోర్టులో ఊరట - విదేశాలకు వెళ్లేందుకు అనుమతి !
సస్పెన్షన్‌లో ఉన్న ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లభించింది.
AB Venkateswara Rao : సస్పెన్షన్‌లో ఉన్న ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఆర్జిత లీవ్స్ పై విదేశాలకు వెళ్లేందుకు అనుమతి నిరాకరిస్తూ సి ఎస్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది . ఈ విషయంలపై ఇవాళ ఏపీ హై కోర్టు విచారించింది. ఈ సందర్భంగా ఏబీ వెంకటేశ్వరరావు విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని ఆదేశించింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి నిరకరించిన సీ ఎస్ ఉత్తర్వులు రద్దు చేసింది. సీఎస్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు ఏబీ వెంకటేశ్వరరావు. దీనిపై విచారణ జరిపి నేడు తీర్పు నిచ్చింది ఏపీ ఉన్నత న్యాయస్థానం.
వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సస్పెన్షన్‌లో ఏబీవీ
గత ప్రభుత్వ హయాంలో నిఘా విభాగం అధిపతిగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరావు నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారంటూ వైసీపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆయనను విధుల నుంచి తొలగించింది. దాంతో ఆయన న్యాయపోరాటం చేశారు. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేసి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గతేడాది సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తర్వాత ఆయనకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగంలో పోస్టింగ్ ఇచ్చారు. అయితే ఆ పోస్టింగ్ ఇచ్చిన 15 రోజులకే ఆయనను మరోమారు సస్పెండ్ చేశారు. అవినీతి కేసులో సాక్షుల్ని ప్రభావితం చేశారన్న అభియోగాలతో ప్రభుత్వం ఆ మేరకు సస్పెన్షన్ వేటు వేసింది. మళ్లీ ఇంత వరకూ సస్పెన్షన్ ఎత్తివేయలేదు. దాంతో ఆయనకు పోస్టింగ్ లభించడం లేదు.
డిస్మిస్ చేయాలని సిఫారసు చేసిన ఏపీ ప్రభుత్వం
ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం నమోదు చేసిన అభియోగాలపై పూర్తిగా తేలకుండానే..ఆయనను డిస్మిస్ చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరించింది. ఏబీ వెంకటేశ్వరరావును ఉద్యోగం నుంచి తొలగించడం, తప్పనిసరిగా పదవీ విరమణ చేయించడం కుదరదని స్పష్టం చేసింది. అయితే, ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చని, రిటైర్ అయ్యే వరకు లభించే ఇంక్రిమెంట్లను రద్దు చేయవచ్చని ... యూపీఎస్సీ సలహా మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఈఎల్స్‌పై విదేశాలకు వెళ్లేందుకు తాజాగా అనుమతి నిరాకరణ
సస్పెన్షన్ లో ఉన్నప్పటికీ ఈఎల్స్‌పై విదేశాలకు వెళ్లేందుకు అనుమతి తీసుకోవాలి. అందు కోసం సీఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుపై 21 రోజుల వరకు నిర్ణయాన్ని వెల్లడించలేదు.దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో అధికారుల నుంచి స్పందన లేకపోతే విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లభించినట్లుగా భావించాలని చట్ట నిబంధనలు ఉన్నాయి. అయితే విచక్షణాధికారం పేరుతో సెలవులు మంజూరు అభ్యర్థనను సీఎస్ తిరస్కరించారు. అయితే సాంకేతికంగా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లభించాక... ఆర్జిత సెలవులపై విదేశాలకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించడం సరికాదని హైకోర్టు పేర్కొంది. విదేశీ ప్రయాణాన్ని ప్రాథమిక హక్కుగా మేనకాగాంధీ కేసులో సుప్రీంకోర్టు గుర్తించిందని వ్యాఖ్యానించింది.