JD Waiting For Party : విశాఖ నుంచి పోటీ ఖాయం - సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఏ పార్టీలోకి ?
సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఏ పార్టీలో చేరుతారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. విశాఖ నుంచి పోటీ ఖాయమని ఆయన చెబుతున్నారు.
JD Waiting For Party : సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తానని చెబుతున్నారు. కానీ ే పార్టీ నుంచి అన్న దానిపై ఆయనకే స్పష్టత లేదు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన తాను ఏ పార్టీలో చేరుతానన్న దానిపై అనేక రకాల చర్చలను సోషల్ మీడియాలో నిర్వహిస్తున్నారని.. మన వ్యవస్థలో స్వతంత్రంగా కూడా పోటీ చేసే అవకాశం ఉందని గుర్తు చేశారు. తాను ఏ పార్టీ తరపున పోటీ చేయాలన్నది ఎన్నికల సమయంలో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటానన్నారు. ఇంకా ఏ పార్టీ అనేది డిసైడ్ చేసుకోలేదని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల్లో పోటీ మాత్రం ఖాయమని చెబుతున్నారు.
గత ఎన్నికల్లో విశాఖ లోక్‌సభకు జనసేన తరపున పోటీ చేసిన వీవీ లక్ష్మినారాయణ
విశాఖ నుంచి గత ఎన్నికలలో జనసేన తరపున పోటీ చేసిన వీవీ లక్ష్మినారాయణ.. ఓడిపోయినప్పటికీ విశాఖలో చురుగ్గా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేయడం ప్రారంభించడంతో అసంతృప్తితో ఆ పార్టీకి రాజీనామా చేశారు. పవన్ సినిమాలు చేయనని చెప్పి చేస్తున్నందున పార్టీకి సమయం కేటాయించలేరని చెప్పి ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత కౌలు వ్యవసాయం చేస్తూ.. మరో వైపు రైతుల కోసం ఓ స్వచ్చంద సంస్థను నడుపుతున్నారు. అయితే రాజకీయంగా మాత్రం యాక్టివ్‌గానే ఉన్నారు. తరచూ విశాఖలో పర్యటిస్తున్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై న్యాయపోరాటం చేస్తున్న వీవీ లక్ష్మినారాయణ
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వీవీ లక్ష్మినారాయణ న్యాయపోరాటం చేస్తున్నారు. ఉద్యమం చేస్తున్న ఉద్యోగ సంఘాలకు మద్దతుగా ఉంటున్నారు. వీవీ లక్ష్మినారాయమ పిటిషన్‌పై హైకోర్టులో పలుమార్లు వాదనలు జరిగాయి. సీనియర్ లాయర్లతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చట్ట విరుద్ధమని వాదిస్తున్నారు. దీనిపై ఎలాంటి తీర్పు వస్తుందో కానీ.. వాదనలకు స్వయంగా లక్ష్మినారాయణ కూడా హాజరవుతున్నారు. విశాఖ సమస్యలపైనా స్పందిస్తున్నారు. పోటీ కోసం గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారు.
ఏ పార్టీలో చేరుతారన్నదానిపై రాని స్పష్టత
రాజకీయాల్లోకి వచ్చేందుకే.. ఐపీఎస్ సర్వీస్‌కు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వీవీ లక్ష్మినారాయణ మొదట సొంత పార్టీ పెట్టే దిశగా ప్రయత్నాలు చేశారు. చివరికి ఏదీ సాధ్యం కాకపోవడంతో.. చివరి క్షణాల్లో జనసేన పార్టీలో చేరారు. ఈ సారి ఏ పార్టీలో చేరుతారన్నదానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. జగన్ అవినీతి కేసుల్ని పూర్తిగా దర్యాప్తు చేసిన అధికారిగా ఆయన ఆ పార్టీలో చేరలేరు. జనసేన పార్టీలో చేరి పవన్ కల్యాణ్ సినిమాలు చేస్తున్నందున రాజీనామా చేశారు.. ఇంకాపవన్ సినిమాలు చేస్తున్నందున అదే పార్టీలోకి చేరడానికి్ మొహమాట పడుతూ ఉండవచ్చు. ఇక టీడీపీలో చేరితే.. రాజకీయంగా విమర్శలతో ఎటాక్ చేయడానికి వైఎస్ఆర్‌సీపీ ఎప్పుడూ రెడీ ఉంటుంది. బీజేపీలో చేరలేరు చేరినా ప్రయోజనం ఉండదు. అందుకే వీవీ లక్ష్మినారాయణ... కుదిరేతే పార్టీ లేకపోతే.. స్వతంత్రం అనే ఆప్షన్ పెట్టుకున్నారు.