Skill Case Supreme Court : జగన్, చంద్రబాబు కేసులపై వేర్వేరుగా విచారణలు - సుప్రీంకోర్టులో ఏం జరిగిందంటే ?
Supreme Court : జగన్ కేసులపై దాఖలైన రెండు పిటిషన్లు, చంద్రబాబు బెయిల్ రద్దుపై దాఖలైన మరో పిటిషన్ పై వేర్వేరుగా సుప్రీంకోర్టులో విచారణలు జరిగాయి.
![Skill Case Supreme Court : జగన్, చంద్రబాబు కేసులపై వేర్వేరుగా విచారణలు - సుప్రీంకోర్టులో ఏం జరిగిందంటే ? Chandrababu and Jagan cases were investigated in the Supreme Court Skill Case Supreme Court : జగన్, చంద్రబాబు కేసులపై వేర్వేరుగా విచారణలు - సుప్రీంకోర్టులో ఏం జరిగిందంటే ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/0ce0caf69ec3b9636b4525b6a271bcb81705659047019228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Chandrababu Skill case: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేసు విచారణ జరిగింది. చంద్రబాబుకు స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీం కోర్టులో సవాలు చేసింది ప్రభుత్వం. జస్టిస్ బేలా ఎం త్రివేదీ, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారించింది. గతంలో విచారణకు వచ్చిన సమయంలో క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చిన తర్వాత విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది. ఆ మేరకు ఇప్పుడు విచారణకు రావడంతో తీర్పును అధ్యయనం చేస్తున్నామని కౌంటర్ దాఖలుకు సమయం కావాలన ిచంద్రబాబు తరపు లాయర్లు కోరారు. దీంతో విచారణను ధర్మాసనం ధర్మాసనం ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది.
అందకు ముందు వేరే ధర్మాసనం ముందు జగన్ ఆస్తుల కేసు విచారణ ఎందుకు ఆలస్యంపై దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది. జగన్ బెయిల్ రద్దు, జగన్ కేసుల విచారణ తెలుగు రాష్ట్రాల నుంచి బదిలీ చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేశారు. రెండు వేరువేరు పిటీషన్లపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ విచారణ లో భాగంగా జగన్ ఆస్తుల కేసు విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. తాము బాధ్యులం కాదని సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలపగా.. ఎవరు బాధ్యత వహిస్తారని తుషార్ మెహతాను సుప్రీంకోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం ప్రశ్నించింది. లోయర్ కోర్టులో వాయిదాలతో తమకు సంబంధం లేదని సీబీఐ తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
దర్యాప్తు సంస్థకు సంబంధం లేకపోతే ఎవరికి ఉంటుందని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. జగన్ తరపు న్యాయవాదులు మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులపై దాఖలైన పిటిషన్లను త్వరితగతిన విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తావించారు. అందుకని పిటిషన్ పై విచారణ ముగించాలని జగన్ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. తాము ఈ పిటిషన్ లపై విచారణ ముగించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు సుమోటోగా ఆదేశాలు ఇచ్చినందున మూడు నెలల గడువు ఇవ్వాలని, ఆ తరువాత పరిశీలన జరపాలని జగన్ తరపు న్యాయవాదులు కోరారు. సమయం ఇచ్చి ఉపయోగం ఏంటి? ఫలితం ఎక్కడా కనిపిచడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఇన్నిసార్లు వాయిదాలు పడటం, ఇంతకాలయాపన జరగడం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. రాజకీయ దృక్పదంతో పిటిషన్ ను పిటిషనర్ ఇక్కడ దాఖలు చేశారని జగన్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ నుంచి తనపై చర్యలు తీసుకున్నారని, గత మూడేళ్లుగా పార్టీ కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని పిటిషనర్ పై నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. రఘురామ రాజుపై అనర్హత పిటిషన్ దాఖలు చేసినందునే ఇక్కడ ఈ పిటిషన్లు దాఖలు చేశారని అన్నారు. అయితే, జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పందిస్తూ.. తాము రాజకీయ వ్యవహారాలను పరిశీలించడం లేదు.. కేవలం న్యాయపరమైన అంశాలనే పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేశారు. విచారణ ఆలస్యం ఎందుకు అవుతుందనేది ఇక్కడ ప్రధాన అంశం. ఇంతకాలం నుంచి ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ అన్నా పరిష్కరించారా అని ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి విచారణను ఏప్రిల్ తొలిభాగంలో చేపట్టనున్నట్లు జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ప్రకటించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)