YS Viveka Case : సాంకేతిక తప్పిదాలతో వివేకా కేసులో చార్జిషీట్ - తిరస్కరించిన కోర్టు ! మళ్లీ దాఖలు
వివేకా కేసులో సీబీఐ చార్జిషీటును కోర్టు తిరస్కరించింది. దీంతో తప్పులు సవరించి సీబీఐ మళ్లీ చార్జిషీటు దాఖలు చేసింది.
YS Viveka Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషటును కోర్టు వెనక్కి పంపింది. సాంకేతిక తప్పిదాల కారణంగా సీబీఐ కోర్టు వెనక్కి పంపించింది. దీంతో సీబీఐ మళ్లీ ఛార్జ్ షీట్‌ను రీసబ్మిట్ చేసింది. హైకోర్టులో దస్తగిరి అప్రూవర్‌పై వేసిన పిటిషన్‌పూ విచారణ జరగనుంది. ఛార్జ్ షీట్ రీ సబ్మిట్ చేసినట్టు కోర్టుకు సీబీఐ తెలిపింది. వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తును జూన్ 30వ తేదీలోపు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు గతంలో సీబీఐకి డెడ్ లైన్ పెట్టింది. ఈ మేరకు జూన్ 30 వరకూ దర్యాప్తును దాదాపుగా పూర్తి చేసిన సీబీఐ.. హైదరాబాద్ సీబీఐ కోర్టులో జూ0న్ 30న అదనపు ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో పలు కీలక అంశాల్ని ప్రస్తావించింది. అయితే ఈ ఛార్జిషీట్ ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. తప్పిదాలు సరి చేసి మళ్లీ సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.
ఈ విషయాన్ని హైకోర్టులో దస్తగిరి పిటిషన్ విచారణ సందర్భంగా సీబీఐ అధికారులు వెల్లడించారు. దీంతో ఛార్జిషీట్ తిరస్కరణ అంశం బయటపడింది. అయితే గతంలోనూ పలు ఛార్జిషీట్లు సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురైన సందర్భాలు ఉండటంతో ఈ వ్యవహారంపై హైకోర్టుకు తాజా అంశాన్ని సీబీఐ అప్ డేట్ చేసినట్లయింది. వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తి చేసేందుకు సుప్రీంకోర్టు జూన్ 30 డెడ్ లైన్ పెట్టినందున ఈ దర్యాప్తు పూర్తయిందా లేదా అన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. డెడ్ లైన్ ముగిసే రోజు సీబీఐ ఛార్జిషీట్ అయితే దాఖలు చేసింది. కానీ అది తుది ఛార్జిషీటా కాదా అన్న అంశంపై క్లారిటీ లేదు. అలాగే సుప్రీంకోర్టును సీబీఐ మరోసారి దర్యాప్తు గడువు పెంచమని కూడా కోరకపోవడంతో ఈ ఉత్కంఠ మరింత పెరిగింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య ముందస్తు కుట్ర ప్రకారమే జరిగిందని సీబీఐ చెబుతోంది. నిందితులు ఎర్రగంగిరెడ్డి, సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్నారని.. తర్వాత సాక్ష్యాల ధ్వంసంలో కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి పాల్గొన్నట్లు తెలిపింది. ఇప్పటికే అరెస్టయిన ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని ఏ7గా, ఆయన సన్నిహితుడు ఉదయ్‌కుమార్‌రెడ్డిని ఏ6గా పేర్కొంది. వాస్తవానికి ఈ వివరాలను ఇదివరకు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లోనే తెలియజేసింది.
వివేకా హత్య కేసులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌తో కలిపి మొత్తం 3 ఛార్జ్ షీట్‌లు దాఖలు చేసింది. ఈ క్రమంలోనే సీబీఐ కోర్టు నిందితులకు రిమాండ్ పొడిగించింది. తదుపరి విచారణ జూలై 14 కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది. నేటితో సిబిఐకు సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు పూర్తైంది. అవసరాన్ని బట్టి విచారణ గడువును పొడిగిస్తామని గతంలో సుప్రీం కోర్టు స్పష్టత ఇచ్చింది. విచారణ గడువు విషయంలో సిబిఐ ఎలాంటి విజ్ఞప్తి చేయలేదు.