Breaking News Live Telugu Updates: హైదరాబాద్‌లోని ట్రైకలర్స్ సంస్థలో ఐటీ సోదాలు- భారీగా నగదు గుర్తించినట్టు సమాచారం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Background
ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమెరిస్ ప్రాంతం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర, తమిళనాడు దాని పరిసర ప్రాంతాలపై తుఫాను ప్రభావం ఉంటుంది. పశ్చిమ మధ్య దానిని అనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరంలో సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో అల్పపీడన ద్రోణి ఉందని వెల్లడించింది. దాని ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో పలు జిల్లాల్లో ఆగస్టు 5, 6 తేదీల వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాలతో తెలంగాణలో 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురవనుండగా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
తెలంగాణలో భారీ వర్షాలు
రాష్ట్రంలో మరో ఐదు రోజులపాటు వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని తెలిపారు. పలు జిల్లాల్లో రైతులు పొలం పనులు మొదలుపెట్టి నాట్లు వేస్తున్నారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో ఆగస్టు 5 వరకు వర్షాలు కురువనున్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. తీరం వెంట 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు రెండు, మూడు రోజులపాటు అప్రమత్తంగా ఉండాలన్నారు.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్రలో తీరం వెంట బలమైన గాలులు వీస్తున్నాయి. కానీ ఎలాంటి వర్ష హెచ్చరికలు జారీ చేయలేదు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
హైదరాబాద్‌లోని ట్రైకలర్స్ సంస్థలో ఐటీ సోదాలు- భారీగా నగదు గుర్తించినట్టు సమాచారం
హైదరాబాద్‌లోని ట్రైకలర్స్ కంపెనీపై ఐటీ శాఖ దాడులు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఆ సంస్థకు సంబంధించిన 16 ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందీ సంస్థ. హైదరాబాద్, ముంబై, పాట్నా, దిల్లీ, బెంగళూరు, చెన్నై సహా చాలా సిటీల్లో సోదాలు కొనసాగుతున్నాయి. విదేశాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రాపర్టీ బిజినెస్ చేస్తోందీ ట్రై కలర్స్ కంపెనీ. ట్రై కలర్ సంస్థలో భారీగా నగదును ఐటీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది.
నంద్యాల జిల్లా డోన్‌లో ఓ వ్యక్తిపై హత్యాయత్నం- ఇంట్లోనే కిరాతకంగా దాడి
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో శీను అనే వ్యక్తిపై దుండగులు దాడి చేశారు. తన ఇంటి మెట్లు ఎక్కుతుండగా అటాక్ చేశారు. వెనక నుంచి కత్తులతో పొడిచారు గుర్తు తెలియని వ్యక్తులు. అటాక్‌తో ఒక్కసారిగా షాక్ తిన్న శ్రీను.. గట్టిగా అరిచారు. జనాలు వస్తారని గ్రహించిన దుండగులు కత్తిని అక్కడే పడేసి స్పాట్ నుంచి పరారయ్యారు. కత్తి పోట్లకు స్పృహ కోల్పోయిన శ్రీనును ఫ్యామిలీ మెంబర్స్ స్థానికంగా అందుబాటులో ఉన్న ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. సంఘటన ప్రాంతానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.





















