Breaking News Live: తెలంగాణలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 01 Jan 2022 08:20 PM
తెలంగాణలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు

తెలంగాణలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 79కి చేరింది. ఇప్పటివరకు ఒమిక్రాన్ నుంచి 27 మంది కోలుకున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తాజా గణాంకాలతో తెలుస్తోంది. 

కంటేపల్లి రైల్వే గేట్ వద్ద కారులో మంటలు.. అనుమానాస్పదరీతిలో వ్యక్తి సజీవదహనం 

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కంటేపల్లి రైల్వే గేట్ సమీపంలోని పొలాల్లో అనుమానాస్పద రీతిలో కారు దగ్ధమైంది.  AP28-DU-5499 అనే కారులో ముందు సీట్లో కూర్చొని సీటు బెల్ట్ తో  ఉన్న ఒక వ్యక్తి సజీవదహనం అయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు.  పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు.

హర్యానాలో కొండ చరియలు విరిగిపడి 15 మంది గల్లంతు.. పలు వాహనాలు ధ్వసం

కొత్త సంవత్సరం వేళ మరో విషాదం చోటు చేసుకుంది. ఇదివరకే జమ్మూకాశ్మీర్ లోని వైష్ణో దేవి ఆలయంలో తొక్కిసలాటలో 12 మంది చనిపోయారు. తాజాగా హర్యానాలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో పలువురు గల్లంతయ్యారు. డజన్ల కొద్ది వాహనాలు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు సమాచారం. భివానీ జిల్లాలోని తోషామ్ బ్లాక్ వద్ద ఉన్న  దాదమ్ మైనింగ్ జోన్ లో ఇది జరిగింది. ప్రస్తుతానికి 15 మంది గల్లంతయ్యారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

థర్డ్ వేవ్ వస్తే.. మహారాష్ట్రలో 8 మిలియన్ల కేసులు, 80 వేల మరణాలు సంభవిస్తాయి

మహారాష్ట్రలో తాజాగా 5,631 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముంబై నగరంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,85,110కు చేరుకుంది. కరోనా థర్డ్ వేవ్ వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. థర్డ్ వేవ్ లో కేసులు 8 మిలియన్లు, మరణాలు 80 వేల వరకు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.

మహారాష్ట్రలో కరోనా కలకలం.. 10 మంది మంత్రులు, 20 ఎమ్మెల్యేలకు కరోనా

మహారాష్ట్రలో కరోనా కలకలం రేపుతోంది. 10 మంది రాష్ట్ర మంత్రులు, 20 ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వెల్లడించారు. పుట్టినరోజు వేడుకలు, ఇతర ఫంక్షన్లకు ప్రజలు దూరంగా ఉండాలని, లేకపోతే రాష్ట్రంలో పరిస్థితి మరోసారి అదుపు తప్పే అవకాశాలు ఉన్నాయని ప్రజలను మెచ్చరించారు.

షేక్ పేట ఫ్లై ఓవర్‌ను ప్రారంభించించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన షేక్ పేట ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. నూతన సంవత్సరం తొలి రోజున ప్రారంభించిన ఈ ఫ్లై ఓవర్‌ను రేతిబౌలి నుంచి ఆరులేన్లతో షేక్‌ పేట్‌ , ఫిలింనగర్‌ జంక్షన్‌ ఓయూ కాలనీ, విస్పర్‌ వ్యాలీ జంక్షన్‌ వరకు నిర్మించారు. రూ.333 కోట్ల వ్యయంతో టోలిచౌకి నుంచి రాయదుర్గాన్ని కలిపేలా ఈ వంతెన నిర్మించారు.

సీఎం జ‌నన్ కు వేద పండితులు ఆశీర్వ‌చ‌నాలు

నూతన సంవత్సరాన్ని పుర‌స్క‌రించుకొని సీఎం జ‌నన్ కు వేద పండితులు ఆశీర్వ‌చ‌నాలు అందించారు. వెంక‌టేశ్వ‌ర‌ స్వామి  శేషవస్త్రం, ప్రసాదాలను, టీటీడీ క్యాలెండర్, డైరీలను అందించిన టీటీడీ అర్చకులు సీఎంకు అందించారు. దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నూతన ఆంగ్ల సంవత్సరం రోజు తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు

తిరుపతి : నూతన ఆంగ్ల సంవత్సరం కావడంతో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ వేకువజామున రెండు గంటల సమయంలో వి.ఐ.పి విరామ సమయంలో జమ్ము కాశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, సినీ దర్శకుడు అనిల్ రావిపూడి, రాష్ట్ర ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గుజరాత్ మంత్రి జితేంద్ర చౌదరి, తమిళనాడు మంత్రి గాంధీలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు..

వైష్ణోదేవి ఆలయంలో విషాదం.. తొక్కిసలాటలో 12 మంది భక్తులు మృతి

ఆంగ్ల సంవత్సరం తొలి రోజులన విషాదం చోటుచేసుకుంది. జమ్మూకాశ్మీర్ లోని వైష్ణోదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది భక్తులు మరణించారు. మరికొందరు భక్తులు గాయపడ్డారు. న్యూ ఇయర్ సందర్భంగా ఆలయానికి భక్తులు ఒక్కసారిగా భారీ సంఖ్యలో పూజలకు రావడంతో తొక్కిసలాట జరిగింది. తెల్లవారుజామున 2:45 గంటల ప్రాంతంలో ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Background

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గుముఖం పట్టింది. అయితే కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వర్షాలు కురిశాయి. ఏపీలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ, తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆగ్నేశ దిశ, ఉత్తర దిశల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. 


ఏపీ వెదర్ అప్‌డేట్స్..
తూర్పు వైపు, ఆగ్నేయ దిశ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. నెల్లూరు జిల్లాలో రెండు మూడు చోట్ల భారీ వర్షాలు కురవనుండగా.. కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు విశాఖ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు పుంజుకున్నాయి. 


తెలంగాణ వెదర్ అప్‌డేట్..
గత కొద్ది రోజుల నుంచి వాతావరణం పొడిగా ఉంది. రాష్ట్రంలో మళ్లీ కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అంచనా వేశారు. ఒడిశా, తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం తెలంగాణపై ఉంది. ఆదిలాబాద్, కొమురం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ములుగు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.


తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. వరుసగా మూడో రోజులు బులియన్ మార్కెట్లో తగ్గిన పసిడి ధరలు నేడు పెరిగాయి. మరోవైపు వెండి ధర పడిపోయింది.  తాజాగా హైదరాబాద్‌‌లో 22 క్యారెట్లపై రూ.200 మేర పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.49,200 కి చేరుకుంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర రూ.100 మేర తగ్గడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.65,400కి పడిపోయింది.


ఏపీ మార్కెట్లో బంగారం ధర రూ.210 మేర పెరిగింది. ఇక్కడ సైతం వెండి ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,260 అయింది.. 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.44,100కు చేరింది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లో బంగారం ధర రూ.200 మేర పుంజుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100 కు చేరింది. వెండి ధరలు ఏపీ, తెలంగాణలో ఒకే రేట్లలో విక్రయాలు జరుగుతున్నాయి. ఏపీ మార్కెట్లోనూ కేజీ ధర రూ.100 మేర పతనం కావడంతో వెండి ధర రూ.65,400 ట్రేడ్ అవుతోంది.


ఢిల్లీలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉన్నాయి. ఢిల్లీ ప్రభుత్వం ధరలు తగ్గించడంతో అక్కడ పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇటీవల ఝార్ఖండ్ ప్రభుత్వం రూ.25 మేర ధర తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు మాత్రం అలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. 


హైదరాబాద్‌లో గత ఏడాది డిసెంబర్ నుంచి ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. డిసెంబర్ నెల మొదట్నుంచీ నేడు సైతం పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 వద్ద ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇక వరంగల్‌లోనూ పెట్రోల్, డీజిల్ ధర స్థిరంగా ఉండగా.. లీటర్ పెట్రోల్ ధర రూ.107.96 కాగా.. డీజిల్ ధర రూ.94.39 అయింది. వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్‌పై 19 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.107.88 కాగా, డీజిల్‌పై 18 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.94.31కి పతనమైంది.


ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడలో పెట్రోల్ ధర 24 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.110.41 అయింది. 20 పైసల చొప్పున తగ్గడంతో ఇక్కడ డీజిల్ ధర రూ.96.49కు దిగొచ్చింది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర 0.85 పైసలు తగ్గి లీటర్ పెట్రోల్ ధర రూ.109.05 కి దిగొచ్చింది. డీజిల్ ధర 0.79 పైసలు తగ్గడంతో విశాఖపట్నంలో డీజిల్ ధర లీటర్ రూ.95.18 అయింది.


Also Read: Gold Silver Price: కొత్త సంవత్సరంలో పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధర.. మళ్లీ దిగొచ్చిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవీ.. 
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి! 
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.