Central Government Key Announcement On HMPV Virus Cases: చైనాలో హెచ్ఎంపీవీ (HMPV) వైరస్ కేసులు కలవరపెడుతోన్న వేళ భారత్‌లోనూ ఈ కేసులు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటకలోని బెంగుళూరులో 2, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 1, కోల్‌కతాలో 1, చెన్నైలో 2 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ప్రధానంగా చిన్నారులకు ఈ వైరస్ సోకగా వారికి ఎవరికీ ట్రావెల్ హిస్టరీ లేదు. వీరికి ఎలా సోకిందనే దానిపై వైద్య నిపుణులు ఆరా తీస్తున్నారు. చిన్నారులను ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, హ్యుమన్ మెటానిమోవైరస్ (HMPV) వ్యాప్తిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని కేంద్రం స్పష్టం చేసింది.
జేపీ నడ్డా కీలక ప్రకటన
HMPV వైరస్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా (JP Nadda) కీలక ప్రకటన చేశారు. దీనిపై అప్రమత్తంగా ఉన్నామని.. ఈ వైరస్ కొత్తది కాదని.. 2001లోనే గుర్తించినట్లు వెల్లడించారు. అయినప్పటికీ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని.. పొరుగుదేశాల్లో ముఖ్యంగా చైనాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. ఇది మిగతా శ్వాసకోశ వైరస్‌ల మాదిరిగానే ఉంటుందని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు. దేశంలో ఇన్‌ఫ్లుయెంజా మాదిరి వ్యాధులు (ILI) లేదా తీవ్ర శ్వాసకోశ వ్యాధులు (SARI) అసాధారణ రీతిలో ఏమీ లేదని తెలిపారు.
హెచ్ఎంపీవీ ఇతర శ్వాసకోశ వైరస్‌ల మాదిరిగానే ఉంటుందని.. సాధారణ జలుబు, ఫ్లూ మాదిరి లక్షణాలు కనిపిస్తాయని కేంద్ర ఆరోగ్య సేవల డైరెక్టర్ డాక్టర్ అతుల్ గోయల్ తెలిపారు. చిన్నారులు, వృద్ధుల్లో ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా కనిపిస్తుందని.. సీజనల్ శ్వాసకోశ సంబంధిత కేసులను ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్య సామగ్రి, పడకలు, ఇతర వసతులతో భారత్‌లోని ఆస్పత్రులు సంసిద్ధంగా ఉన్నాయన్నారు. శీతాకాలంలో అవసరమైన జాగ్రత్తలు వహించడం సహా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సాధారణ వైరస్..!
హ్యుమన్ మెటానిమోవైరస్ (HMPV).. ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో సంభవించే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో 12 శాతం వరకూ ఇదే కారణమవుతోందని అంచనా. రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV)ను పోలి ఉండే ఈ వైరస్.. ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే కనిపిస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఇది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా 11 ఏళ్ల చిన్నారుల్లోనే ఎక్కువగా ఇది కనిపిస్తుండగా.. తొలిసారిగా దీన్ని 2001లో నెదర్లాండ్స్‌లో 28 మంది చిన్నారుల్లో గుర్తించారు.
మరోవైపు, బెంగుళూరులో ఇద్దరు చిన్నారులకు వైరస్ సోకడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇది కొవిడ్ వైరస్‌లా వ్యాప్తి చెందేది కాదని.. అందువల్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని విజ్ఞప్తి చేసింది. ఎవరైనా దగ్గు, తుమ్మిన సమయంలో నోరు, ముక్కు కప్పి ఉంచుకోవాలని.. తరచూ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని సూచించింది. వాడిన టిష్యూ పేపర్లు తిరిగి ఉపయోగించొద్దని.. రుమాలు, తువ్వాలు షేర్ చేసుకోవద్దని పేర్కొంది. వైరస్ లక్షణాలు ఉన్న వారు బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది.
Also Read: Chhattisgarh Blast: ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ