IED blast on security forces vehicle in Bijapur district | రాయగఢ్: మావోయిస్టులు ఏర్పాటు చేసిన బాంబు పేలడంతో విషాదం నెలకొంది. ఛత్తీస్ గడ్‌లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతర (Chhattisgarh Blast) పేలడంతో 9 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు జవాన్లు గాయపడగా, వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని సమాచారం. బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది వాహనంలో వెళ్తుండే మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 15 మంది వరకు ఆర్మీ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
కూంబింగ్ చేస్తున్నారని కక్ష కట్టి వాహనం పేల్చివేసిన మావోయిస్టులు
బస్తర్ ఐజీ ప్రమాదంపై స్పందించారు. భద్రతా బలగాల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని బాంబు దాడి జరిగినట్లు పేర్కొన్నారు. దంతేవాడ, నారాయణపూర్, బీజాపూర్ లలో పోలీసులతో కలిసి భద్రతా బలగాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. కొన్ని రోజులు ఆ ప్రాంతాల్లో కూంబింగ్ తరువాత తిరిగొస్తున్న సమయంలో జవాన్ల వాహనాన్ని మావోయిస్టులు పేల్చివేయడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుందని బస్తర్ ఐజీ తెలిపారు.
కొన్నేళ్ల నుంచి మావోయిస్టుల ఏరివేతకు చర్యలు
గత కొన్నేళ్లుగా ఛత్తీస్ గఢ్‌లో మావోయిస్టుల ఏరివేత జరుగుతోంది. దీంతో గత ఏడాది 200 మందికి పైగా మావోయిస్టులు ఎన్ కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. ఆపరేషన్ కగార్ వల్ల తమకు తీవ్ర నష్టం జరుగుతోందని కన్నెర్ర చేశారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు టార్గెట్ గా మందుపాతర ఏర్పాటు చేసి వాహనాన్ని పేల్చివేశారు. దాంతో అక్కడ భారీ గుంత ఏర్పడింది. భద్రతా సిబ్బంది మృతదేహాలు ముక్కలుగా పడటంతో ఆ ప్రాంతం భయానక వాతావరణాన్ని తలపించింది.
డీఆర్‌జీ జవాన్ల వాహనం లక్ష్యంగా పేలిన మందుపాతర
‘గత మూడు రోజులుగా మావోయిస్టులు, నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ జరుగుతోంది. ఈ క్రమంలో దంతేవాడ, నారాయణపూర్, బీజాపూర్ ప్రాంతాల్లో కూంబింగ్ కు వెళ్లొస్తున్న డీఆర్‌జీ జవాన్ల వాహనాన్ని నక్సలైట్లు పేల్చివేశారు. బీజాపూర్ లోని అంబేలి ఏరియాలో ఈ ఘటన జరిగింది. ఇందులో 8 మంది డీఆర్‌జీ జవాన్లు, ఒక డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలను రికవరీ చేస్తున్నాం. ఈ దాడి జరిగి భద్రతా సిబ్బంది చనిపోవడం దురదృష్ణకరం’ అని బస్తర్ ఐజీ పి సుందర్ రాజ్ అన్నారు.