SCR Special Trains To Srikakulam For Sankranthi Rush: సంక్రాంతి అంటేనే తెలుగు వారికి పెద్ద పండుగ. ఈ క్రమంలో ఉద్యోగ, ఉపాధి నిమిత్తం ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఆ 3 రోజుల వేడుక కోసం స్వగ్రామాలకు తరలివస్తుంటారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోనసీమ జిల్లాల్లో సంక్రాంతి సందడే వేరు. ఈ క్రమంలో ఈ ప్రాంతాలకు ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. ఇప్పటికే ప్రత్యేక రైళ్లను ప్రకటించిన ద.మ రైల్వే (South Central Railway) శ్రీకాకుళానికి మరిన్ని ప్రత్యేక సర్వీసులను (Special Trains) నడపనున్నట్లు ప్రకటించింది. ఈ సర్వీసులు కాచిగూడ/చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్ స్టేషన్ల మధ్య నడవనున్నాయి. ఈ నెల 11, 12, 15, 16 తేదీల్లో కాచిగూడ - శ్రీకాకుళం రోడ్ మధ్య.. ఈ నెల 8, 9 తేదీల్లో చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్ మధ్య 2 రైళ్లు నడవనున్నాయి.
పూర్తి వివరాలివే..
- ఈ నెల 11, 15 తేదీల్లో కాచిగూడ - శ్రీకాకుళం రోడ్ (07615) రైలు కాచిగూడ నుంచి సాయంత్రం 5:45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. అలాగే, 12, 16 తేదీల్లో శ్రీకాకుళం రోడ్ నుంచి మధ్యాహ్నం 2:45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7:35 గంటలకు కాచిగూడ చేరుకోనుంది. ఈ రైలు మల్కాజిగిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, పొందూరు స్టేషన్లలో ఆగనుంది. ఈ రైలు బోగీలన్నీ థర్డ్ ఏసీ కోచ్‌లే అని అధికారులు వెల్లడించారు.
- చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్ ప్రత్యేక రైలు (07617) ఈ నెల 8న చర్లపల్లిలో రాత్రి 7:20 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్‌కు చేరుకుంటుంది. అలాగే, శ్రీకాకుళం రోడ్ - చర్లపల్లి (07168) రైలు.. ఈ నెల 9న మధ్యాహ్నం 2:45 గంటలకు శ్రీకాకుళంలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6:30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైలులో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, జనరల్ కోచ్‌లు ఉంటాయని ద.మ రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు.
- ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు స్టేషన్లలో ఆగనుంది.
52 అదనపు సర్వీసులు
పండుగ రద్దీ దృష్ట్యా ఇప్పటికే 52 అదనపు సర్వీసులు నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. నగరంలోని సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళం ప్రాంతాలకు ఈ సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. ఈ నెల 6 నుంచి 18వ తేదీ వరకూ ఆయా ప్రాంతాలకు ఇవి అందుబాటులో ఉంటాయని చెప్పారు. జనవరి 6, 7 తేదీల్లో చర్లపల్లి - తిరుపతి - చర్లపల్లి (రైలు నెం: 07077/07078), ఈ నెల 8, 9, 11, 12, 15, 16 తేదీల్లో చర్లపల్లి - తిరుపతి - చర్లపల్లి (02764/02763) మొత్తం 6 సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో కాచిగూడ - శ్రీకాకుళం రోడ్ - కాచిగూడ (07041/07042) రైళ్లు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: Voters List: సవరించిన ఓటర్ల జాబితా రిలీజ్ చేసిన ఎన్నికల సంఘం - తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లు ఎంతమందంటే?