AP Government Taskforce Committee On HMPV: భారత్‌లో హెచ్ఎంపీవీ (HMPV) వైరస్ కేసులు నమోదవుతున్న వేళ ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు (CM Chandrababu) సోమవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు నమోదైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. అధికారులు అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. మైక్రో బయాలజిస్ట్‌లు, పీడియాట్రిషియన్లు, పల్మనాలజిస్టులు, ప్రివెంటివ్ మెడిసిన్ నిపుణులతో టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించాలని నిర్ధేశించారు. హెచ్ఎంపీవీ వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 2001 నుంచి ఈ వైరస్ ఉన్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ ఏపీలో ఎలాంటి హెచ్ఎంపీవీ కేసులు నమోదు కాలేదని తెలిపారు. అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వంటి శ్వాసకోశ వ్యాధులు, ఇన్‌ఫ్లూయెంజా లాంటి కేసుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


'వైరస్ టెస్టింగ్ కిట్లు సిద్ధం చేయాలి'


హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టాస్క్ ఫోర్స్ నుంచి సలహాలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. 'ఈ వైరస్ సీజనల్ వ్యాధిగా సంక్రమిస్తున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలోని ఐసీఎంఆర్ అధీకృత వైరాలజీ ల్యాబ్స్ సిద్ధం చేయాలి. వైరస్ టెస్టింగ్ కిట్లను కూడా సిద్ధం చేసుకోవాలి. వెంటనే 3 వేల టెస్టింగ్ కిట్లను తెప్పించాలి.' అని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


అటు, రాష్ట్రంలో ఔషధాల లభ్యతపైనా సీఎం ఆరా తీశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4.5 లక్షల ఎన్95 మాస్కులు, 13.71 లక్షల ట్రిపుల్ లేయర్డ్ మాస్కులు, 3.52 లక్షల పీపీఈ కిట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అన్ని ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో వీటి సరఫరా పెంచాలని సీఎం ఆదేశించారు. ఆక్సిజన్ సరఫరా, లిక్విడ్ ఆక్సిజన్ సప్లై పైపులైన్లకు సంబంధించి అన్ని ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని తెలిపారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరారు. కనీసం 20 సెకన్ల పాటు సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ వినియోగించాలని సూచించారు.


భారత్‌లో వెలుగుచూసిన కేసులు


మరోవైపు, భారత్‌లోనూ హెచ్ఎంపీవీ వైరస్ కేసులు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటకలోని బెంగుళూరులో 2, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 1, కోల్‌కతాలో 1, చెన్నైలో 2 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ప్రధానంగా చిన్నారులకు ఈ వైరస్ సోకగా వారికి ఎవరికీ ట్రావెల్ హిస్టరీ లేదు. వీరికి ఎలా సోకిందనే దానిపై వైద్య నిపుణులు ఆరా తీస్తున్నారు. చిన్నారులను ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, హ్యుమన్ మెటానిమోవైరస్ (HMPV) వ్యాప్తిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని కేంద్రం స్పష్టం చేసింది. హ్యుమన్ మెటానిమోవైరస్ (HMPV).. ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో సంభవించే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో 12 శాతం వరకూ ఇదే కారణమవుతోందని అంచనా. రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV)ను పోలి ఉండే ఈ వైరస్.. ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే కనిపిస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఇది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా 11 ఏళ్ల చిన్నారుల్లోనే ఎక్కువగా ఇది కనిపిస్తుండగా.. తొలిసారిగా దీన్ని 2001లో నెదర్లాండ్స్‌లో 28 మంది చిన్నారుల్లో గుర్తించారు.


Also Read: Voters List: సవరించిన ఓటర్ల జాబితా రిలీజ్ చేసిన ఎన్నికల సంఘం - తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లు ఎంతమందంటే?