Botsa Satyanarayana: మంత్రి బొత్సకు గుండె ఆపరేషన్, నెల రోజుల విశ్రాంతి
Botsa Satyanarayana: గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు శనివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది.
Botsa Satyanarayana Health: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana)కు శనివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఓపెన్ హార్ట్ సర్జరీ (Open Heart Surgery) జరిగింది. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న మంత్రికి విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించినట్లు డాక్టర్లు ప్రకటించారు. కొద్ది కాలంగా బొత్స విశ్రాంతి లేకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆయనకు ఆపరేషన్ అవసరమని తేలడంతో హైదరాబాద్ తీసుకెళ్లి ఆపరేసన్ నిర్వహించారు.
విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో వైసీపీ ఈ నెల నాలుగో తేదీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర (YCP Samajika Sadhikara Yatra)లో బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఆ సమయంలో మంత్రి అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు.. ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం విశాఖలో వైద్య పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ చేయాలని సూచించారు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ మరో సారి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం అని తేల్చారు. దీంతో శనివారం ఉదయం 10 నుంచి 12 మధ్య ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు.
ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న మంత్రి బొత్స సత్యనారాయణకు డాక్టర్లు నెల రోజుల పాటు ఆస్పత్రిలోనే విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో ఆయన హైదరాబాద్ లోని ఆస్పత్రికే పరిమితం అయ్యే అవకాశాలున్నాయి. అనంతరం డిశ్చార్జ్ అయ్యాక హైదరాబాద్‌లోని ఇంట్లో విశ్రాంతి తీసుకోనున్నారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మంత్రి హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్నారు. వైసీపీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నప్పుడు విజయనగరం, అమరావతికి వస్తున్నారు.