Chandrababu Case : ఐఆర్ఆర్, అసైన్డ్ భూముల కేసుల వాయిదా - హైకోర్టులో చంద్రబాబుపై కేసుల విచారణలు !
చంద్రబాబుపై దాఖలైన కేసుల్లో రెండింటి విచారణ వాయిదా పడింది. సుప్రీంకోర్టులో మంగళవారం కీలక విచారణ జరగనుంది.
Chandrababu Case : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంటు మార్చారంటూ నమోదు చేసిన కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరికొంత ఊరట లభించింది. నేడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 18కి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. అప్పటి వరకూ ముందస్తు బెయిల్ పొడిగించారు. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌పై కూడా అప్పటి వరకూ విచారించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది.
ఐఆర్ఆర్ అలైన్ మెంట్ మార్చి లబ్ది పొందారని సీఐడీ ఆరోపణ
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కేసులో అక్రమాలు జరిగాయని ఏపీలోని జగన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ మేరకు గత ప్రభుత్వ హయాంలో స్కాం జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు పేరును కూడా చేర్చింది. ఏపీ హైకోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు ముందస్తు బెయిల్ పిటిషన్ నమోదు చేయగా గత బుధవారం ఉదయం విచారణ జరిగింది. ఇటు చంద్రబాబు తరఫు లాయర్ల వాదనలు.. అటు సీఐడీ తరఫు న్యాయవాదుల వాదనలను విన్న హైకోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇస్తున్నట్లు తీర్పు వెల్లడించింది. నేటి వరకూ చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో పీటీ వారెంట్, పోలీస్ కస్టడీపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు సూచించింది.
అసైన్డ్ భూముల కేసుల్లో తీర్పు ఇచ్చే ముందు ఇంకా ఆధారాలున్నాయన్నాయని సీఐడీ పిటిషన్
మరో వైపు రాజధాని అమరావతిలోని అసైన్డ్ భూముల జీవోపై సీఐడీ దాఖలు చేసిన కేసులో విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఇప్పటికే ఈ కేసులో విచారణ పూర్తి చేసిని హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. తీర్పు వెలువడాల్సిన సమయంలో మళ్లీ సీఐడీ తరపున న్యాయవాదులు రీ ఓపెనింగ్ పిటీషన్ దాఖలు చేశారు. తమ వద్ద ఈ కేసుకు సంబంధించి ఆడియో, వీడియో ఆధారాలు ఉన్నాయని వాటిని దాఖలు చేసేందుకు అనుమతి కోరుతూ పిటీషన్ వేశారు. ఈ పిటీషన్‌పై చంద్రబాబు , నారాయణ తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. వేరే కేసులో ఆధారాలు ఈ కేసులో ఎలా దాఖలు చేస్తారని న్యాయవాదులు ప్రశ్నించారు. వాదనలు పూర్తయ్యి, కేస్ తీర్పు ఇవ్వబోతున్న తరుణంలో ఈ పిటీషన్‌పై విచారణకు తమకు అభ్యంతరంగా ఉందని న్యాయవాదులు పేర్కొన్నారు. దీంతో ఈ కేసు విచారణను హైకోర్టు నవంబర్ 1కి వాయిదా వేసింది.
మంగళవారం సుప్రీంకోర్టులో కీలక విచారణ
చంద్రబాబుపై ప్రభుత్వ ఒకదాని తర్వాత ఒకటిగా కేసులు చేస్తూండటం.. అవన్నీ గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న అధికారిక నిర్ణయాలపై కావడంతో.. కక్ష సాధింపుల్లో భాగంగానే ఆధారాలు లేకుండా కేసులు పెడుతున్నారని తనకు అవినీతి నిరోధక చట్టంలోని 17 వర్తిస్తుందని చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై సుదీర్ఘంగా విచారణ జరుగుతోంది. మరోసారి మంగళవారం విచారణ జరగనుంది.