Amaravati Highcourt : నేటి నుండి అమరావతి వ్యాజ్యాల విచారణ..! హైకోర్టు తేల్చేస్తుందా..?
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అమరావతి వ్యాజ్యాల విచారణ ప్రారంభం కానుంది. కొత్త సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. ఈ కారణంగా మళ్లీ మొదటి నుంచి వాదనలు ప్రారంభమవుతాయి.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తరలింపు అంశంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఈ రోజు నుంచి విచారణ ప్రారంభిస్తోంది. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ పిటిషన్లపై వాదనలు వింటుంది. గతంలో రాజధాని కేసులన్నీ చీఫ్ జస్టిస్ గా ఉన్న జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనంలో విచారణ జరిగేవి. అయితే జేకే మహేశ్వరి బదిలీ కావడంతో కొత్త సీజేగా ఏకే గోస్వామి వచ్చారు. ఈ కారణంగా పిటిషన్లపై విచారణ ఆగిపోయింది. ఈ ఏడాది మార్చిలో అడ్వకేట్ జనరల్ రాజధాని పిటిషన్ల విచారణ ప్రారంభించాలని కోరడంతో సీజే ఏకే గోస్వామి, జస్టిస్ బాగ్చీ, జస్టిస్ జయసూర్య ధర్మాసనం మే 3 నుంచి రాజధాని కేసులపై కోర్టులోనే భౌతికంగా విచారణ జరపాలని.. అనుకున్నారు. అయితే మేలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉంది. ఈ కారణంగా మే మూడో తేదీన విచారణను ఆగస్టు 23వ తేదీకి విచారణను వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఈ రోజు నుంచి విచారణ ప్రారంభం కానుంది.
మూడు రాజధానుల బిల్లుల ఆమోదంపై వివాదం..!
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం 2019 డిసెంబర్ లో వైసీపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 2020 జనవరిలో అసెంబ్లీలో ఇందుకు సంబంధించిన రెండు బిల్లుల్ని ప్రవేశపెట్టి ఆమోదం తీసుకుంది. మండలిలో సెలక్ట్ కమిటీకి పంపారు. ఆ వివాద ంఅక్కడే ఉంది. అయితే 2020 జూన్ లో మరోసారి అసెంబ్లీ సమావేశం నిర్వహించి ఈ బిల్లుల్ని ప్రభుత్వం ఆమోదించింది. మండలి తిరస్కరించిందన్న కారణంతో వాటిని ఆమోదించిన ప్రభుత్వం తిరిగి మండలిలో ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నించింది. కానీ మండలి నిరవధిక వాయిదా పడింది. మండలి ఆమోదం పొందకపోయినా నిబంధనల ప్రకారం ఆమోదం పొందినట్లేనని భావించి రాజ్‌భవన్‌కు ఆమోదం కోసం పంపారు. గవర్నర్ కూడా ఆ బిల్లులను ఆమోదించి గెజిట్ నోటిపికేషన్లు జారీ చేశారు.
అప్పటి సీజే జేకే మహేశ్వరి బదిలీ కావడంతో ఆగిపోయిన విచారణ..!
అయితే మూడు రాజధానుల బిల్లుల ఆమోదం చెల్లదని హైకోర్టులో దాదాపు వందకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని హైకోర్టు రెండు రకాలుగా విభజించి విచారణ ప్రారంభించింది. అయితే ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పటి సీజే జేకే మహేశ్వరి నేతృత్వంలోని బెంచ్ రోజువారీ విచారణ నిర్వహించింది. పిటిషనర్ల తరపు వాదనలు దాదాపుగా ముగిశాయి. ప్రభుత్వం కూడా తమ వాదనలు వినిపించింది. అయితే చీఫ్ జస్టిస్ బదిలీతో అన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు కొత్తగా విచారణ ప్రారంభించనున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం, ఈ పిటిషన్లలో భాగస్వాములుగా ఉన్న వారంతా తిరిగి అఫిడవిట్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి ప్రారంభం కానున్న విచారణ
ఈ మధ్య కాలంలో అమరావతి భూములకు సంబంధించి అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమరావతి భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ప్రభుత్వం నమోదు చేసిన కేసులను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. అలాంటి అవకాశమే లేదని తేల్చేసింది. ముందుగా హైకోర్టు కొట్టి వేసింది. ఈ తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకెళ్లినా అదే తీర్పు వెలువడింది. అదే సమయంలో మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌తో పాటు మరికొందరిపై దాఖలు చేసిన కేసులు కూడా తేలిపోయాయి. అదే సమయంలో ప్రభుత్వం కూడా ఇటీవల మూడు రాజధానుల ప్రస్తావన తగ్గించింది. సీఎం జగన్ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించలేదు. మారుతున్న పరిణామాలతో హైకోర్టులో విచారణ ఆసక్తి రేపే అవకాశం ఉంది.