Andhra Pradesh: ధర్మారెడ్డి, విజయ్ కుమార్ లపై విజిలెన్స్ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు
Vigilance Inquiry against Dharma Reddy| టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డితో పాటు సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ లపై విజిలెన్స్ విచారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
AP govt orders vigilance Inquiry against AV Dharma Reddy And Thumma Vijay Kumar: అమరావతి: టీటీడీ మాజీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ధర్మారెడ్డిపై, విజయ్ కుమార్ లపై విజిలెన్స్ విచారణకు ఏపీ ప్రభుత్వం బుధవారం (జూలై 10) నాడు ఆదేశాలు జారీ చేసింది. టీటీడీ ఈవో గా ధర్మారెడ్డి, I & PR కమిషనర్ గా విజయ్ కుమార్ రెడ్డి తమ పదవీ కాలంలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. విజయ్ కుమార్ రెడ్డిపై, ధర్మారెడ్డి మీద టీడీపీ నేతలు, జర్నలిస్ట్ సంఘాలు ఇటీవల ఫిర్యాదు చేశాయి. కాగా, ధర్మారెడ్డి గత నెలలో ఉద్యోగ విరమణ చేయడం తెలిసిందే.
విజిలెన్స్ ఎంక్వైరీలో భాగంగా ధర్మారెడ్డి, విజయ్ కుమార్ ల అవినీతి, అధికార దుర్వినియోగానికి సహకరించిన ఇతర ఉద్యోగులను సైతం విచారణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శ్రీవాణి టికెట్లలో అక్రమాలకు పాల్పడ్డారని ధర్మారెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. టీటీడీని అడ్డం పెట్టుకుని అధికార పార్టీ వైఎస్సార్ సీపీకి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించారని అభియోగాలు ఉన్నాయి. బడ్జెట్‌తో సంబంధం లేకుండా సివిల్ కాంట్రాక్ట్ పనులు ఇచ్చారని ధర్మారెడ్డిపై ఆరోపణలు రాగా, తాజాగా అందిన ఫిర్యాదులతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
కేంద్రంలో చేరేందుకు ఢిల్లీకి వెళ్లిన విజయ్ కుమార్ రెడ్డి ఏపీకి వెనక్కు వచ్చారు. సమాచార శాఖలో నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనల పేరిట పెద్ద ఎత్తున కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని విజయ్ కుమార్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఈయనపై సైతం ఫిర్యాదులు రావడంతో అన్ని కోణాల్లో విజిలెన్స్ విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.