NTR Health Scheme : ఏపీలో రేపటి నుంచి NTR హెల్త్ సేవలు నిలిపివేత- ఆర్థిక భారంతో నడపలేమంటున్న నెట్‌వర్క్ హాస్పిటల్స్
NTR Health Scheme: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ హెల్త్ స్కీమ్ సేవలు నిలిపివేస్తున్నట్టు నెట్ వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై తేల్చడం లేదని ఆగ్రహంతో ఉన్నాయి.

NTR Health Scheme: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడనుంది. ప్రభుత్వం రావాల్సిన బకాయిలు ఇంకా విడుదల కాలేదని ఆర్థిక భారం పెరిగిందని నెట్‌వర్క్ ఆసుపత్రులు తెలిపాయి. ప్రభుత్వం నుంచి దాదాపు 2700 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని వెల్లడించాయి. వాటిని చెల్లించే వరకు సేవలు కొనసాగించలేమని ఓ ప్రకటన చేశాయి.
ప్రజలకు అందేచే సేవలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు చాలా ప్రయత్నం చేసినట్టు నెట్‌వర్క్ ఆసుపత్రులు పేర్కొన్నాయి. గత రెండు రోజులుగా అనేక సందర్భాల్లో ఆందోళన చేశామని ప్రజాప్రతినిధులను కలిశామని అయినా రావాల్సిన బకాయిలపై స్పందన లేదని అన్నారు. అందుకే శుక్రవారం నుంచి సేవలు పూర్తి నిలిపివేయాలని నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించాయి.
ఎన్టీఆర్ వైద్య సేవల నెట్‌వర్క్ ఆసుపత్రులు రాసిన లేఖలో ఉన్న అంశాలు ఇవే. "ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రుల బతుకు భారమైంది. ఇంత కాలం కాళ్లీడ్చుకుంటూ కాలం వెళ్లదీసిన నెట్వర్క్ ఆసుపత్రులు ఇక కాలు కదపలేని పరిస్థితుల్లో ఉన్నాయి. అందుకే ఈ నెల 10వ తేదీ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలను నెట్వర్క్ ఆసుపత్రుల్లో నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆషా) నిర్ణయించింది. ఇంతకాలం ఏదో విధంగా పంటి బిగువున కష్టాలను భరిస్తున్నాగానీ, ఇక ఎంత మాత్రం భరించలేకపోతున్నాం. నెట్వర్క్ ఆసుపత్రులకు ఇప్పటి వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నుంచి రావాల్సిన బకాయిలు సుమారు 2వేల 700కోట్లు పైమాటే. ఈ బకాయిలు పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదు. పోనీ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏదైనా ప్రయత్నం జరుగుతుతోందా అంటే అదీ జరగటం లేదు. ఆషా కార్యవర్గం బకాయిల విడుదల కోసం ప్రభుత్వ పెద్దలను కలిసి ఎన్నిసార్లు విన్న వించినా, అదిగో చేస్తాం..ఇదిగో చేస్తాం అని చెబుతున్నారే తప్పు. ఆ దిశగా ఎలాంటి ప్రయత్నమూ కనిపించటం లేదు, ఫలితమూ కనిపించటం లేదు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిలను చాలా స్పష్టంగా అసెంబ్లీలో ప్రకటించారు. కానీ చేతల్లో మాత్రం ఫలితం కనిపించటం లేదు." అని తమ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం స్పందించకుంటే సేవలు నిలిపివేయాలని ఇప్పటికే నిర్వహించన సమావేశంలో నిర్ణయించామన్నాయి ఆసుపత్రులు. అందుకే రేపటి నుంచి సేవలు బంద్ చేస్తున్నట్టు ప్రకటించాయి. ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని సూచించాయి." గత సెప్టెంబరు 25న సమావేశమైన ఆషా రాష్ట్ర కార్యవర్గం భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించింది. దీని అనుగుణంగానే ఈ నెల 10 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద వైద్య సేవలను నిలిపివేయాలని నెట్వర్క్ ఆసుపత్రులు నిర్ణయించాయి. ఆషా కార్యవర్గం భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించి, ప్రభుత్వ పెద్దలకు ట్రస్ట్ ఉన్నతాధికారులకు వైద్యశాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ, ఇంత వరకు పూర్తిస్థాయి పరిష్కారం కనిపించలేదు. ఆషా ప్రతినిధులు మాత్రం గత వారం రోజులుగా జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపిలను కలిసి తమ ఆవేదనను విన్నవిస్తూనే ఉన్నాం. తమ ఆందోళన కారణంగా సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకూడదన్న ఉద్దేశ్యంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రాష్ట్రప్రభుత్వానికి విన్నవిస్తున్నాం."





















