(Source: ECI/ABP News/ABP Majha)
AP Capital Issue: ఏపీ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం, ఆ అవసరం ఏంటని ఘాటు వ్యాఖ్యలు
AP Capital Issue: రాజధాని విషయంలో స్పష్టమైన తీర్పు ఇచ్చాక కూడా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మూడు రాజధానుల విషయంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం ఏంటని ప్రశ్నించింది.
AP Capital Issue: ఏపీ రాజధాని విషయంలో స్పష్టమైన తీర్పు ఇచ్చాక కూడా వైసీపీ ప్రభుత్వం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు రాజధానులకు అనుకూలంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం సరికాదని తెలిపింది. హైకోర్టు విషయంలో ప్రభుత్వానికి అధికారం లేదని న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత కూడా కర్నూలులో హైకోర్టు కోసం నిరసన కార్యక్రమాలు నిర్వహించడం సరికాదన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇస్తుందని ప్రశ్నించారు. రాజధాని అమరావతి అని త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చాక, అదే అంశంపై రాజధానిగా అమరావతే ఉండాలని రైతులు అమరావతి నుంచి అరసవల్లి వరకు మహాపాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. ఇలాంటివన్నీ రైతులను ముందు ఉంచి నిర్వహించే రాజకీయ యాత్రలంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీలు దాఖలు అయ్యాయని గుర్తు చేసింది. సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం కోసం వేచి చూడాలని చెప్పింది. రైతులు దాఖలు చేసిన వ్యాజ్యాలతో హైకోర్టు బిజీగా ఉందని, ఇలాంటి చర్యలు న్యాయస్థానంపై ఒత్తిడి తీసుకురావడం కోసమేనని భావిస్తున్నామంది. పాదయాత్ర వ్యవహారమై "అమరావతి పరిరక్షణ సమితి" దాఖలు చేసిన వ్యాజ్యలో హైకోర్టు సింగిల్ జడ్డి విధించిన షరతులతో తమకు సంఘీభావం తెలియజేసే హక్కు లేకుండా పోతోందని పేర్కొంటూ అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేకుల రామారావు అక్టోబర్ 27వ తేదీన అప్పీళ్లను దాఖలు చేశారు. వీటిపై బుధవారం జరిగిన విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన వ్యాజ్యలో న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులపై మూడో పక్షం అయిన మీరెలా అప్పీల్ వేస్తారని ప్రాధమిక అభ్యంతరం లేవనెత్తింది.
ప్రభుత్వం దాఖలు చేసిన కొంటర్ కోర్టు పైల్ లోకి చేరకపోవడంతో విచారణను ఈనెల 7వ తేదీకి వాయిదా వేసింది. కౌంటర్ దస్త్రాన్ని రికార్డుల్లో చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ఆరు వందల మందితో మాత్రమే పాదయాత్ర !
మొన్నటికి మొన్న అమరావతి పాదయాత్రపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని అమరావతి రైతులు, పాదయాత్ర అనుమతి రద్దు చేయాలని ఏపీ డీజీపీ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది. పాదయాత్రలో 600 మంది రైతులు పాల్గొనవచ్చని ఆదేశాలు ఇచ్చింది. ఐడీ కార్డులు ఉన్నవారు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఐడీ కార్డులు రైతుల కు వెంటనే ఇవ్వాలని పోలీస్ అధికారులకు హైకోర్టు ఆదేశించింది. సంఘీభావం తెలిపే వారు రోడ్డుకు ఇరువైపులా ఉండాల్సిందేనని గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. పాదయాత్ర ప్రారంభించుకోవచ్చని రైతులకు హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. ఆంక్షల ఉల్లంఘించవద్దని రైతులకు స్పష్టం చేసింది. రైతులు షరతులు ఉల్లంఘిస్తే హైకోర్టును ఆశ్రయించవచ్చని డీజీపీకి సూచించింది.