Macharla TDP News : బక్రీద్ రోజు మాచర్ల టీడీపీ మైనారిటీ నేత అరెస్టుతో కలకలం - రాజకీయ కక్ష సాధింపులేనని తీవ్ర విమర్శలు!
మాచర్ల టీడీపీ మైనారిటీ నేత అరెస్టుపై రాజకీయ వివాదం ఏర్పడింది. మైనారిటీ నేతల్ని అణిచివేస్తున్నారని విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు.
Macharla TDP News : తెలుగుదేశం పార్టీ ఓ రాజకీయ కార్యక్రమం నిర్వహించింది. అక్కడ వైసీపీ నేతలతో ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో పదమూడో వ్యక్తిగా ఓ టీడీపీ నేత పేరు చేర్చారు. ఇది జరిగి వారం అయిపోయింది. ఆ టీడీపీ నేత ఇంట్లోనే ఉంటున్నారు. పోలీసులు మీ మీద కేసు నమోదయింది రావాలని నోటీసులు ఇవ్వలేదు.కానీ తెల్లవారితే బక్రీద్ అనగా.. అర్థరాత్రి పోలీసులు సివిల్ దుస్తుల్లోఇంటి తలుపు తట్టి బలవంతగా లాక్కుపోయారు. వచ్చిన వారు ఎవరో.. ఎందుకు తీసుకెళ్లారో తెలియని ఆందోళనతో ఆ టీడీపీ నేత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఇదంతా మాచర్లలో జరిగిన ముస్లిం మైనారిటీ నేత అన్వర్ బాషా అరెస్ట్ వ్యవహారంలో జరిగింది.
అర్థరాత్రి సివిల్ దుస్తుల్లో వచ్చి మైనార్టీ నేతను తీసుకెళ్లిన పోలీసులు
మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలను అక్రమ కేసులతో రాజకీయ కారణాలతో వేధిస్తున్న దానికి ఇంత కంటే సాక్ష్యం ఏం కావాలని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ముస్లింలు ఎంతో పవిత్రంగా ఆచరించే బక్రీద్ పర్వదినాన పల్నాడు జిల్లా మాచర్లలో టిడిపి మైనారిటీ నేత సయ్యద్ అన్వర్ భాషను మాచర్ల పోలీసులు అరెస్టు చేశారు. పండుగ రోజున అర్ధరాత్రి సివిల్ దుస్తుల్లో వచ్చిన పోలీసులు అన్వర్ భాషను అరెస్టు చేయడం మైనార్టీ వర్గాల్లో విస్తృత ప్రచారానికి కారణం అయింది.
ఏ పోలీస్ స్టేషన్ లోనూ తెలియని సమాచారం - తీరిగ్గా కోర్టులో ప్రవేశ పెట్టిన పోలీసులు
ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా గంటలో విచారించి, పంపిస్తామని చెప్పి తీసుకు వెళ్ళటమే కాకుండా, భాషాను ఎక్కడికో తీసుకొని వెళ్తున్నారో, ఎందుకు తీసుకొని వెళ్తున్నారో కుటుంబసభ్యులకి కనీస సమాచారం ఇవ్వలేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. కుటుంబసభ్యులను తీవ్ర భయాందోళనలకు గురిచేసి.. తెల్లవారక కూడా తమ కొడుకు గురించి ఎటువంటి సమాచారం రాకపోవడంతో, మానసిక క్షోభకు గురి అయినా తల్లిదండ్రులు నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఆరా తీశారు. అయినా ఎటువంటి సమాచారం తెలియలేదు. ఇలాంటి నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేసిన భాషాను గురువారం సాయంత్రం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు.
ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా...లేక రాక్షస రాజ్యమా? మీరు మనుషులేనా....మీకు మానవత్వం ఉందా...? ఒక ముస్లిం సోదరుడిని బక్రీద్ పండుగ రోజు తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేస్తారా? ఎప్పుడో ఎక్కడో జరిగిన వివాదంతో ముడిపెట్టి...ఏకంగా హత్యాయత్నం కేసు పెట్టి పండుగ పూట జైలుకు పంపుతారా?
— N Chandrababu Naidu (@ncbn) June 29, 2023
మాచర్లలో… pic.twitter.com/lbqkVgZFuO
దారుణంగా కొట్టారని కన్నీటి పర్యంతమైన నేత - మైనార్టీలను అణిచివేస్తున్నారని టీడీపీ ఆగ్రహం
వారం రోజుల క్రితం జరిగిన ఘటనలో బాషా పేరును చేర్చి, అర్ధరాత్రి పూట దొంగల్లా అరెస్టు చేయడమేంటని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముస్లింల మనోభావాలకి ఎటువంటి గౌరవం ఇవ్వకుండా బక్రీద్ పండుగ వేళా భాషను అరెస్టు చేయడంపై ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. ఇటీవల టిడిపి చేపట్టిన భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్ర విజయవంతం అవ్వడం వెనుక బాషా కృషి ఎంతో ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇది జీర్ణించుకోలేని వైసిపి నాయకులు అతడిని వేదించడానికి అక్రమ కేసులు పెట్టారని అంటున్నారు. తనకు కారంపూడిలో జరిగిన అల్లర్లకు ఎలాంటి సంబంధం లేదని అన్వర్ భాష చెబుతున్నారు. తనను ఓ ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లి కనికరం లేకుండా కొట్టారంటూ తన కూతుర్ని పట్టుకొని భోరున విలపించారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.