ములుగు జిల్లాలో పోలీసు జీపు బోల్తా, ఎస్ఐ సహా డ్రైవర్ మృతి
ములుగు జిల్లాలో పోలీసు జీపు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎస్ఐ సహా డ్రైవర్ మృతిచెందారు.
ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పోలీసు జీపు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎస్ఐ సహా డ్రైవర్ మృతిచెందారు. ఏటూరునాగారం మండలం జీడివాగు వద్ద పోలీసు జీపు బోల్తా పడినట్లు సమాచారం. జీపు నడుపుతున్న ప్రైవేట్ డ్రైవర్, ఏటూరు నాగారం ఎస్ఐ ఇంద్రయ్య మృతి చెందారు. ఈ ప్రమాదంతో ఏటూరు నాగారంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఎస్‌ఐ ఇంద్రయ్య ఏటూరు నాగారంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన జీపు డ్రైవర్‌తో కలిసి బయటకు వెళ్లారు. ఈ క్రమంలో జీడివాగు కల్వర్టు వద్దకు రాగానే జీపు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. కల్వర్టు వద్ద రోడ్డు పక్కకు దూసుకెళ్లిన పోలీస్ జీపు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో జీపులో ప్రయాణిస్తున్న ఎస్ఐ ఇంద్రయ్యతో పాటు డ్రైవర్ మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఘటన స్థలానికి ఎస్పి గౌస్ ఆలం చేరుకొని రోడ్డు ప్రమాదానికి గల కారణాలను సేకరిస్తున్నారు. మరో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు కావడంతో ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.