Medaram Mini Jathara 2023: ఘనంగా రెండో రోజు సమ్మక్క, సారలమ్మ మినీ జాతర!
Medaram Mini Jathara 2023: మేడారం సమ్మక్క, సారలమ్మల జాతర రెండో రోజు ఘనంగా సాగుతోంది. ఆదివాసీ గిరిజిన జాతరకు రెండో రోజు భక్తులు తాకిడి విపరీతంగా పెరిగింది.
Medaram Mini Jathara 2023: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క సారలమ్మ ఆదివాసి గిరిజన జాతరకు రెండవ రోజు భక్తుల తాకిడి పెరిగింది. బుధవారం మండ మిలిగే పండుగతో ప్రారంభమైన జాతర రెండవ రోజు గిరిజన పూజారులు సంస్కృతి, సాంప్రదాయాలతో, డోలు, వాయిద్యాల నడుమ ఆమ్మవార్లు గద్దలపై అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సాగుతుంది. మధ్యలో వచ్చే ఏడు మినీ జాతర పేరిట అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపుతుంటారు గిరిజన పూజారులు. ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఛత్తీస్ గఢ్, బీహార్, మహారాష్ట్ర లాంటి ఇతర రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఆదివాసి గిరిజనుల ఆరాధ్య దేవతలైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర రెండవ రోజు గురువారం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. సమ్మక్క పూజారులు మేడారంలోని సమ్మక్క ఆలయాన్ని భక్తి శ్రద్ధలతో శుద్ధిచేసి.. ఆడపడుచులు పుట్ట మట్టితో రంగురంగుల ముగ్గులు వేసి అలంకరించారు.
జాతర రెండో రోజు గద్దెల వద్ద ప్రత్యేక పూజలు
మినీ మేడారం జాతర రెండో రోజు గురువారం గిరిజన పూజారులు(వడ్డెలు) సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారగానే మహిళలు తమ ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి నుంచి పసుపు కుంకుమలు, కొత్త చీర, సారేతో సమ్మక్క సారలమ్మల గద్దెల వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉన్న పూజారులతో కలిసి గద్దెలను అందంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం డోలు వాయిద్యాలు.. సన్నాయి మేళాలతో సమ్మక్క, సారలమ్మకు చెందిన పూజా సామాగ్రిని తిరిగి తీసుకెళ్లి దేవాలయాలలో భద్రపరిచి తాళం వేశారు. మినీ జాతర రెండో రోజు గురువారం భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పిల్లాపాపలతో కలిసి మొక్కులు సమర్పించారు. బుధవారం రాత్రి మేడారంలోని గద్దెల వద్ద జాగారం చేసిన ఆదివాసీ పూజారులు తెల్లవారే దాకా రహస్య పూజలు నిర్వహించారు. అక్కడే సమ్మక్క, సారలమ్మలకు ఆదివాసీ గిరిజనుల సంప్రదాయాల ప్రకారం నైవేద్యం పెట్టి ఆరగించారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు సమ్మక్క పూజారులు కొక్కెర కృష్ణయ్య, సారలమ్మ పూజారులు కాక సారయ్య తదితర ఆదివాసీ పూజారుల ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈ సందర్భంగా మేడారం, కన్నెపల్లి గ్రామస్థులు కోళ్లు, మేకలు బలిచ్చి అమ్మవార్లకు నైవేద్యం పెట్టారు. మండమెలిగే పండుగ సందర్భంగా మేడారం వచ్చిన భక్తులు కొత్త చీరె సారలను అమ్మవార్లకు బహుకరించారు. ఎత్తుబెల్లం సమర్పించారు. సల్లంగ చూడు.. సమ్మక్క తల్లీ అంటూ మొక్కులు.. మొక్కారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా తలనీలాలు సమర్పించారు.
మీని జాతర ప్రత్యేకత...
ప్రతి రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున జరిగే మేడారం ఆదివాసి గిరిజన వనదేవతలైన సమ్మక్క, సారలమ్మ జాతరలో భక్త జన సందోహంతో మేడారం పరిసర ప్రాంతం నిండిపోయేది. అయితే ఇటీవల కాలంలో సంవత్సరానికి ఒకసారి మినీ మేడారం జాతరగా గిరిజన పూజారులు ఆమ్మ వార్లుకు పూజలు నిర్వహిస్తున్నారు. ఈ జాతర మండ మేలిగే పండుగతో ప్రారంభించి అమ్మవార్ల గద్దెలను శుద్ధి చేయడం, ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. రెండవ రోజు సమ్మక్క గద్దల వద్ద పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించగా వివిధ ప్రాంతాల నుంచి భక్త జన సంద్రోహతో మేడారంలో నిండిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి మేడారంకు తరలివచ్చిన భక్తులు జంపన్న వాగులో పుణ్య స్థానం ఆచరించి పసుపు కుంకుమతో అమ్మవార్లకు చీరే, సారేలను సమర్పించి చల్లగా చూడు తల్లి అంటూ వేడుకుంటున్నారు. సమ్మక్క, సారలమ్మ, గోవింద రాజు, పగిడిద్ద రాజులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు ఎదురు కోళ్ల మొక్కులు తీర్చుకుంటున్నారు. బుధవారం సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులు గద్దల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించగా గురువారం సమ్మక్క గద్దెల వద్ద పూజారులు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ మినీ జాతరకు విచ్చేసే భక్తులు జంపన్న వాగులో పసుపు కుంకుమలతో కొబ్బరికాయ ముడుపులను చెల్లించి అమ్మవార్ల గద్దెల వద్ద అమ్మవారికి బంగారం (బెల్లం) చీరే, సారేలను సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
రెండో రోజు జంపన్నవాగులు భక్తుల తాకిడి
జంపన్న వాగులోని అధికారులు నీటిని వదలడం అదేవిధంగా వాగు చుట్టూ బ్యాటరీ ఆఫ్ టాబ్స్ ఏర్పాటు చేయడంతో జాతరకు వచ్చే భక్తులు బ్యాటరీ అఫ్ టాబ్స్ కింద జలకాలాడుతూ జంపన్న వాగులో పూవకాలతో ఉప్పొంగిపోతున్నారు. బుధవారం సారలమ్మకు ప్రత్యేక పూజలతో జాతర ప్రారంభం కాగా జాతరకు సుమారు లక్షకు పై చిలుకు భక్తులు హాజరు అయినట్లు అధికారులు అంచనా వేశారు. గుడి, గుడిసెలు లేని ప్రకృతి ఒడిలో దట్టమైన దండకారణ్యంలో కొలువైన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు రెండవ రోజు భక్తజనం పోటెత్తింది. నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరకు భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.