Morning Top News:
నెయ్యి కల్తీపై రంగంలోకి దిగనున్న సీబీఐ సిట్
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీపై సుప్రీంకోర్టు సిట్ విచారణ ప్రారంభం కానుంది. ఐదుగురు సిట్ బృందానికి సహకరించేందుకు 30 మంది టీమ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ నుంచి ఇద్దరు అధికారులతో పాటు రాష్ట్రం నుంచి ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి మరో అధికారి ప్రత్యేక బృందంలో నియమితులయ్యారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఏపీ బీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు
భారతీయ జనతా పార్టీ త్వరలో దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో అధ్యక్షులను మార్చనుంది. తెలుగు రాష్ట్రాలకూ కొత్త అధ్యక్షులు రానున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం గట్టి పోటీ నడుస్తోంది. ఏపీలోనూ అధ్యక్ష పదవి మార్చాలని హైకమాండ్ నిర్ణయించింది. ఇప్పటికే పార్టీలోని అత్యున్నత నిర్ణాయక కమిటీ ఈ మేరకు అభిప్రాయ సేకరణ జరిపి నలుగురు పేర్లను షార్ట్ లిస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో ఇద్దరు ఇతర పార్టీల నుంచి వచ్చిన సీనియర్లుకాగా.. మరో ఇద్దరు ఆరెస్సెస్ నుంచి పార్టీ కోసం పని చేస్తున్న యువనేతలు ఉన్నట్లుగా
బీజేపీ వర్గాలు చెబుతున్నాయి
. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
తెలంగాణ జాగృతి వేదికపైనే కవితక్క రాజకీయం
కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత రాజకీయాల్లో మళ్లీ తనదైన ముద్ర వేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సారి బీఆర్ఎస్ పార్టీ తరపున కాకుండా తెలంగాణ జాగృతి తరపున ఆమె రాజకీయంగా కీలకంగా అవ్వాలని ఆలోచిస్తున్నారు. ఇందు కోసం కార్యాచరణ కూడా ప్రకటించారు. లిక్కర్ స్కాంలో అరెస్టు అయి విడుదలైన తర్వాత రాజకీయంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అదానీ ఇష్యూ లో మోదీపై విమర్శలు గుప్పించారు. శుక్రవారమే జాగృతి సభ్యలతో సమావేశమై కార్యచారణ రూపొందించుకున్నారు.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
చితి మీద నుంచి లేచి వచ్చాడు
ఓ యువకుడు చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో అంత్యక్రియలకు ఏర్పాటు చేయగా ఆ సమయంలో చితిపై నుంచి లేచి అందరికీ షాక్ ఇచ్చాడు. స్థానికులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ కొన్ని గంటల్లోనే మృత్యుఒడికి చేరుకున్నాడు. వైద్యుల నిర్లక్ష్యంతో ఆ యువకుడి జీవితంలో కొన్ని గంటలపాటు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన రాజస్థాన్‌లో సంచలనం కలిగించింది.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఏపీ శాసనసభ నిరవధిక వాయిదా
ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు సభను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. 10 రోజుల పాటు కొనసాగిన సభలో మొత్తం 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం లభించింది. మొత్తం 60 గంటల పాటు సభ కొనసాగినట్లు స్పీకర్ తెలిపారు. ఈ సమావేశాల్లో 120 మంది సభ్యులు ప్రసంగించినట్లు చెప్పారు. 75 ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నారు. సమావేశాల్లో చివరి రోజు 3 బిల్లులకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు
అక్రమ నిర్మాణాల విషయంలో మానవత్వంతో ఆలోచిస్తే సమాజమంతా బాధపడాల్సి వస్తుందని.. కొన్నిసార్లు మనసును చంపుకొని పని చేయాల్సి వస్తోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఎఫ్‌టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలు తొలగించడం సహా చెరువుల్లోకి కొత్త నిర్మాణాలు రాకుండా అడ్డుకోవడమే తమ బాధ్యత అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
తెలంగాణకు భారీ పెట్టుబడులు
తెలంగాణలో మరికొన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఆరు ప్రముఖ ఫార్మా కంపెనీలు తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు ఎంఎస్ఎన్ లేబొరేటరీ, లారస్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, అరబిందో, హెటిరో ల్యాబ్స్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. సచివాలయంలో సీఎం
రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో ఆయా కంపెనీల ప్రతినిధులు చర్చించారు. ఫార్మా సిటీలో 6 కంపెనీలకు అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఎన్ కౌంటర్ లో 10 మంది మావోల మృతి
ఛత్తీస్‌గడ్‌లోని సుక్మాలో శుక్రవారం మావోయిస్టులు, భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది నక్సల్స్ మృతి చెందారు. బెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు జరిగినట్లు బస్తర్ రేంజ్ ఐజీ పీ.సుందర్‌రాజ్ తెలిపారు. అయితే, నక్సలైట్లను మట్టుపెట్టిన అనంతరం డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డులు సంబరాలు చేసుకున్నారు. మావోయిస్టులను మట్టుపెట్టిన ఆనందంలో చిందులు వేశారు. గన్నులు పట్టుకుని గుంపులుగా గిరిజన తెగల స్టైల్‌లో నృత్యం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఎఫ్‌సీఐ గోదాంలో 145 కోతులు మృతి
యూపీలోని హాథ్రస్ జిల్లాలో ఓ ఎఫ్‌సీఐ గోదాంలో 145 కోతులు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయం బయటకు పొక్కకుండా సిబ్బంది అక్కడే వాటిని పూడ్చిపెట్టారు. ఆలస్యంగా బయటపడిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భారీ స్థాయిలో కోతుల మృతి వెనుక గల కారణాలను వెటర్నరీ వైద్యుల సాయంతో ఆరా తీస్తున్నామని అన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
రసవత్తరంగా తొలి టెస్టు
బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ రసవత్తరంగా మారింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. కంగారుల బౌలింగ్ ధాటికి తొలి ఇన్నింగ్స్ లో కేవలం 150 పరుగులకే పరిమితమైంది. నితీశ్ కుమార్ రెడ్డి(41), రిషబ్ పంత్ (37), కేఎల్ రాహుల్(26) పరుగులు మినహా మిగిలిన బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. ఏడుగురు బ్యాటర్లు కనీసం రెండెంకల స్కోరు కూడా చేయలేదు. అనంతరం కంగారులు కూడా వరుసగా పెవిలియన్ క్యూ కట్టారు. బుమ్రా ధాటికి ఆసీస్ బ్యాటర్లు క్రీజ్ లు నిలబడటానికే శ్రమించారు. కీలకమైన 4 వికెట్లు తీసిన బుమ్రా ఆసీస్ నడ్డి విరిచాడు. ప్రస్తుతం ఆసీస్ 67 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..